అమ్మాయిలకు టెస్ట్ : నేటి నుంచి ఇంగ్లండ్ విమెన్స్‌‌‌‌తో ఇండియా టెస్టు మ్యాచ్​

అమ్మాయిలకు టెస్ట్ : నేటి నుంచి ఇంగ్లండ్ విమెన్స్‌‌‌‌తో ఇండియా టెస్టు మ్యాచ్​

    నేటి నుంచి ఇండియా–ఇంగ్లండ్ ఏకైక మ్యాచ్​
    ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్​ 18, జియో సినిమాలో

నవీ ముంబై: ఇంగ్లండ్‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌లో నిరాశ పరిచిన హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్ ఇప్పుడు ఆ టీమ్‌‌‌‌తో టెస్టు సవాల్‌‌‌‌కు రెడీ అయింది. గురువారం మొదలయ్యే ఏకైక టెస్టులో తమ స్పిన్‌‌‌‌ బలంతో ఇంగ్లండ్‌‌‌‌ను తిప్పేయాలని చూస్తోంది. టెస్టుల్లో ఇండియాకు మంచి రికార్డు ఉంది. 1986 నుంచి ఇంగ్లిష్ టీమ్‌‌‌‌తో ఆడిన 14 మ్యాచ్‌‌‌‌ల్లో ఒక్క టెస్టులోనే ఓడిపోయింది.

ఈ రికార్డును కొనసాగించాలని ఆతిథ్య  జట్టు కోరుకుంటోంది.  రెండేండ్ల గ్యాప్‌‌‌‌ తర్వాత ఈ ఫార్మాట్‌‌‌‌లో బరిలోకి దిగుతున్న హర్మన్‌‌‌‌సేన పది రోజుల వ్యవధిలోనే రెండు టెస్టులు ఆడనుంది. ఈ నెల 21 నుంచి వాంఖడేలో ఆస్ట్రేలియాతోనూ టెస్టు మ్యాచ్‌‌‌‌లో పోటీ పడనుంది. ఈ క్రమంలో సొంతగడ్డపై తమ ప్రధాన ఆయుధమైన స్పిన్‌‌‌‌తో ముందుగా ఇంగ్లండ్‌‌‌‌ను పడగొట్టాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నారు.

సీనియర్లు దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌‌‌‌, స్నేహ్‌‌‌‌ రాణాకు తోడు మూడో టీ20లో మెప్పించిన  బెంగాల్ లెఫ్టార్మ్  స్పిన్నర్ సైకా ఇషాక్‌‌‌‌ రాకతో స్పిన్ విభాగం మరింత బలోపేతం అయింది. కర్నాటక లెఫ్టాండ్ ఓపెనింగ్ బ్యాటర్‌‌‌‌ ‌‌‌‌శుభా సతీష్‌‌‌‌ కొత్తగా టీమ్‌‌‌‌లోకి వచ్చినప్పటికీ స్టార్లు మంధాన, షెఫాలీనే ఓపెనర్లుగా దిగనున్నారు. జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌, హర్లీన్ డియోల్‌‌‌‌ టెస్టు అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.

టీ20ల్లో మెప్పించలేకపోయిన హర్మన్‌‌‌‌ ఈ టెస్టులో జట్టును  ముందుండి నడిపించాల్సి ఉంది.  సీమర్ రేణుక సింగ్ రీఎంట్రీతో పేస్ విభాగం కూడా బలోపేతం అయింది. ఇంగ్లండ్‌‌‌‌ జట్టు సీనియర్లు సివర్ బ్రంట్, హీథర్ నైట్, డానీ వ్యాట్‌‌‌‌, కేట్ క్రాస్, సోఫీ ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌ అనుభవంపై నమ్మకం ఉంచింది. ఈ మ్యాచ్‌‌‌‌ ఇంగ్లిష్ టీమ్‌‌‌‌కు వందో టెస్టు కానుంది. దాంతో ఈ మ్యాచ్‌‌‌‌ను గుర్తుండిపోయేలా మార్చుకోవాలని చూస్తోంది.