V6 News

2022 నాటికి 73 సూపర్ కంప్యూటర్లు

2022 నాటికి  73 సూపర్ కంప్యూటర్లు

    ‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్’  ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్  

    తయారు చేయనున్న సీ-డాక్, ఐఐఎస్‌‌‌‌సీ

4,500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

సూపర్ కంప్యూటర్ల తయారీలో చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాలే టాప్ ప్లేస్ లో ఉంటున్నాయి. మన దేశం మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడే ఉంది. అయితే ‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం)’ ఫేజ్–2కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సూపర్ కంప్యూటర్ల రంగంలో మన దేశం కూడా ముందడుగు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్‌‌‌‌లలో త్వరలో 11 కొత్త సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా2022 నాటికి 73 కొత్త సూపర్ కంప్యూటర్లను తయారు చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.

మనదేశంలోనే తయారీ..

ఇప్పటివరకూ సూపర్ కంప్యూటర్ల కోసం 60 శాతం విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, మనదేశంలో అసెంబుల్ చేస్తూ వచ్చారు. ‘ఎన్ఎస్ఎం’ ఫేజ్–1లో ప్రారంభించిన సూపర్ కంప్యూటర్లన్నింటికీ మదర్ బోర్డులు సైతం ఇంటెల్ సంస్థ తయారు చేసి ఇచ్చింది. అయితే ఇకపై సూపర్ కంప్యూటర్లను పూర్తిస్థాయిలో మనదేశంలోనే తయారు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశంలో పూర్తిస్థాయిగా తయారైన తొలి సూపర్ కంప్యూటర్ ‘పరమ్ శివాయ్’ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాదే ఐఐటీ వారణాసి వద్ద ప్రారంభించారు. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్ పూర్ లో ‘పరమ్ శక్తి’, ఐఐఎస్ఈఆర్ పుణేలో ‘పరమ్ బ్రహ్మ’లు ప్రారంభమయ్యాయి.

సీ–డాక్, ఐఐఎస్సీకి తయారీ బాధ్యతలు.. 

నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌‌‌‌ను మినిస్ట్రీ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, డిపార్ట్ మెంట్ ఆఫ్ ​సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సంయుక్తంగా చేపట్టాయి. దీనిని పుణేలోని సీ–డాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్​అడ్వాన్స్‌‌‌‌డ్ కంప్యూటింగ్), బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​సైన్స్ (ఐఐఎస్సీ) అమలు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి10 పెటాఫ్లాప్స్ కెపాసిటీ ఉండే11 హై పవర్ సూపర్ కంప్యూటర్లను నిర్మించనున్నాయి. వీటికి ప్రాసెసర్ ను సీ–డాక్ తయారు చేయనుంది. ఇది మార్చి 2020 నాటికి రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సూపర్ కంప్యూటర్ల చిప్‌‌‌‌లను వేగంగా చల్లార్చేందుకు ప్రత్యేక క్రయోజెనిక్ కూలింగ్ సిస్టంను కూడా సీ–డాక్, ఐఐటీ బాంబే సంస్థలు తయారు చేస్తున్నాయి. గత నెలలో విడుదలైన వరల్డ్ టాప్ 500 సూపర్ కంప్యూటర్ల లిస్టులో మనదేశం నుంచి పూణేలోని ఐఐటీఎం వద్ద ఉన్న ప్రత్యూష్​ సూపర్ కంప్యూటర్‌‌‌‌ (57), మినిస్ట్రీ ఆఫ్​ఎర్త్ సైన్సెస్ కు చెందిన మిహిర్ సూపర్ కంప్యూటర్ (100)లు మాత్రమే చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఐఐటీ హెచ్‌‌‌‌కువచ్చే ఏడాదే

వచ్చే ఏడాది మూడు సూపర్ కంప్యూటర్లను స్వదేశీయంగా తయారు చేసి, ఇన్ స్టాల్ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్, జేఎన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బెంగళూరులో ఒక్కో సూపర్ కంప్యూటర్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే చిన్న, మధ్య తరహా కంపెనీలు తమ ఉద్యోగులకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు, చౌకగా సూపర్ కంప్యూటింగ్ సేవలను పొందేందుకు వీలుగా సీ-డాక్‌‌‌‌లో మరో సూపర్‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌ను పెట్టనున్నారు.