ఇక కరోనా టెస్టు కిట్ల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉండబోదు. అతి త్వరలోనే భారత్ లో తయారైన ఆర్టీ – పీసీఆర్, ర్యాపిట్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటి అభివృద్ధికి పలు కంపెనీలు, పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు అడ్వాన్స్ స్టేజ్ కు చేరుకున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదంతో త్వరలోనే అవి కరోనా టెస్టు కిట్ల ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయి. అటానమస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మే నెలలో స్వదేశీ కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. కరోనాను గుర్తించేందుకు అత్యంత ప్రామాణికమైన RT-PCR టెస్టు కిట్స్ తో పాటు యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్టు కిట్లు కూడా భారత్ లోనే తయారవబోతున్నాయని తెలిపారాయన. దేశంలోనే వీటి ఉత్పత్తి ద్వారా మే 31 నాటి కల్లా రోజుకు లక్ష మందికి టెస్టు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, వారం రోజులుగా 80 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పారు కేంద్ర మంత్రి హర్షవర్దన్. 14 రోజులగా 47 జిల్లాల్లో, 21 రోజులగా 39 జిల్లాల్లో, 28 రోజులుగా 17 జిల్లాల్లో కొత్త కేసులు లేవని తెలిపారు. కాగా, దేశంలో మంగళవారం ఉదయం వరకు మొత్తం 29,435 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 934 మంది మరణించగా.. 6,869 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
