ఉక్రెయిన్​పై శాంతి చర్చలకు ఇండియా

ఉక్రెయిన్​పై శాంతి చర్చలకు ఇండియా
  • సౌదీ ఆధ్వర్యంలో రేపట్నించి చర్చలు
  •        మన దేశ ప్రతినిధి కూడా హాజరు 

న్యూఢిల్లీ/కీవ్: ఉక్రెయిన్​లో శాంతి కోసం ఈ నెల 5, 6వ తేదీల్లో సౌదీ అరేబియా నిర్వహిస్తున్న చర్చల సమావేశంలో ఇండియా కూడా పాల్గొటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మీటింగ్​కు పశ్చిమ దేశాలు, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను సౌదీ ఆహ్వానించింది. ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రతిపాదిస్తున్న శాంతి ప్రణాళికలోని ‘రష్యా దళాలు వాపస్​ వెళ్లాలి, సోవియట్​నుంచి విడిపోయినప్పుడు నిర్ణయించిన సరిహద్దులను తిరిగి పునరుద్ధరించాలి’ అనే అంశాలపై చర్చించనున్నారు. 

యుద్ధం మృతులు 10 వేలపైనే: ఉక్రెయిన్​ 

రష్యా దాడుల్లో ఇప్పటివరకు తమ దేశంలో 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ తెలిపింది. ఆక్రమణకు గురైన తమ భూభాగాలను తిరిగి దక్కించుకునే సరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ యుద్ధ నేరాల విభాగం అధికారి యురియ్ బెల్సోవ్ తెలిపారు. “ఇప్పటివరకు 10,749 మంది మరణించారు. వీరిలో 499 మంది పిల్లలున్నారు. మొత్తం15,599 మంది గాయపడ్డారు” అని బెల్సోవ్​చెప్పారు. రష్యా సైన్యం 98 వేల యుద్ధ నేరాలకు పాల్పడిందని, అన్నింటినీ నమోదు చేశామని తెలిపారు. కాగా, ఖేర్సన్ సిటీలోని 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ సెయింట్ కేథరీన్ కేథడ్రల్ చర్చిపై రష్యా షెల్​ బాంబులతో  రెండు సార్లు దాడి చేయడంతో చర్చి చాలా వరకు ధ్వంసమైందని ఉక్రెయిన్ వెల్లడించింది.