2036 ఒలింపిక్స్‌కు భారత్‌ రెడీ.. ‘రైజింగ్‌ టుగెదర్‌’ విజన్‌తో ముందడుగు

2036 ఒలింపిక్స్‌కు భారత్‌ రెడీ.. ‘రైజింగ్‌ టుగెదర్‌’ విజన్‌తో ముందడుగు
  • ‘రైజింగ్‌ టుగెదర్‌’ పేరుతో ఆతిథ్యానికి సన్నద్ధం..
  • వచ్చే నెలలో ఐఓసీ ఫ్యూచర్‌ హోస్ట్‌ కమిషన్‌కు  ప్రజెంటేషన్‌


న్యూఢిల్లీ : 2036 ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని  భారత్‌  ‘రైజింగ్‌ టుగెదర్‌’ విజన్‌తో  ముందుకెళ్తుంది.   వచ్చే నెల చివర్లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఫ్యూచర్‌ హోస్ట్‌ కమిషన్‌ ముందు భారత్‌ తొలిసారి తన ప్రాజెక్టును ప్రజెంట్‌ చేయనుంది.   2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యంపై ఆసక్తి వ్యక్తం చేసిన ఏడు దేశాల్లో భారత్‌, జర్మనీ, ఖతార్‌, టర్కియే తదితర దేశాలు ఉన్నట్లు   స్పోర్ట్స్​ మినిస్టర్​  మన్‌సుఖ్‌ మాండవీయ, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషా మంగళవారం  ప్రకటించారు.

అహ్మదాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు భారత్‌ ఆసక్తి వ్యక్తం చేస్తోంది. 2024లోనే ఆతిథ్యం కోసం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ సమర్పించింది.క్రీడల ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడమే ‘రైజింగ్‌ టుగెదర్‌’ లక్ష్యమని మాండవీయ తెలిపారు. ఒలింపిక్స్‌ నిర్వహణతో యువత క్రీడల వైపు ఆకర్షితులవుతారని,  పేర్కొన్నారు.ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా మాట్లాడుతూ.. ‘రైజింగ్‌ టుగెదర్‌’ కేవలం నినాదం కాదని, దేశంలోని శక్తి, వైవిధ్యం, ఆకాంక్షలను ఒకే ఒలింపిక్‌ లక్ష్యం వైపు నడిపించే సంకల్పమని చెప్పారు. యువతను క్రీడల్లో భాగస్వాములను చేయడంతో పాటు క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామన్నారు.వేదికల మాస్టర్‌ ప్లాన్‌, అథ్లెట్ల అనుభవం, నిధుల సమీకరణలను  ఐఓసీ పరిశీలించనుంది. నవంబర్‌ ప్రజెంటేషన్ల అనంతరం ‘స్ట్రాటజిక్‌ డైలాగ్‌’ దశ ప్రారంభమవుతుంది. తుది నిర్ణయం 2029లో ఐఓసీ సమావేశంలో ఓటింగ్‌ ద్వారా వెలువడనుంది.