IND vs ENG 4th Test: తిప్పేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్లు..రెండో రోజూ ఇంగ్లాండ్‌దే

IND vs ENG 4th Test: తిప్పేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్లు..రెండో రోజూ ఇంగ్లాండ్‌దే

రాంచీ టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి మన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. జైస్వాల్, గిల్ 80 పరుగుల భాగస్వామ్యం తప్ప భారత ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ధృవ్ జురెల్ (30), కుల్దీప్ యాదవ్ క్రీజ్ (17) లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ మరో 134 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉండడంతో ఇంగ్లాండ్ కు ఆధిక్యం ఖాయంగా కన్పిస్తుంది.

 4 వికెట్ల నష్టానికి 131 పరుగులతో టీ విరామం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. 73 పరుగులు చేసిన జైశ్వాల్ ను బషీర్ క్లీన్ బౌల్డ్ చేసి భారత్ కు షాకిచ్చాడు. ఆ తర్వాత స్పిన్నర్ హర్టీలి విజ్రంభించి సర్ఫరాజ్(12), అశ్విన్ (1) వికెట్ లను తీసి టీమిండియాను చావు దెబ్బ కొట్టాడు. ఈ దశలో జురెల్, కుల్దీప్ యాదవ్ ఆదుకున్నారు. 8 వ వికెట్ కు అజేయంగా 42 పరుగులు జోడించి భారత్ ను పోటీలో నిలబెట్టారు. అంతకముందు గిల్(38) పర్వాలేదనిపించినా.. పటిదార్(17), జడేజా(12), రోహిత్ శర్మ(2) విఫలమయ్యారు. 

ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ కు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. హర్టీలి 2 వికెట్లు పడగొట్టగా.. అండర్సన్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో రూట్(121) సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ 353 పరుగుల భారీ స్కోర్ చేసింది. జడేజా నాలుగు, ఆకాష్ దీప్ మూడు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు.