సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి సెషన్ లో నాలుగు వికెట్లు చేజార్చుకోవడంతో పాటు టీ విరామం తర్వాత మరో మూడు వికెట్లు కోల్పోయింది. జట్టులో అందరూ పెవిలియన్ కు క్యూ కట్టడంతో మూడో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజ్ లో సుందర్ (33), కుల్దీప్ యాదవ్ (14) ఉన్నారు. ప్రస్తుతం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 315 పరుగులు వెనకబడి ఉంది. ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే మరో 115 పరుగులు చేయాలి. క్రీజ్ లో ఉన్న వాషింగ్ టన్ సుందర్ లోయర్ ఆర్డర్ తో కలిసి ఏ మాత్రం పోరాడతాడో ఆసక్తికరంగా మారింది.
చెలరేగిన జాన్సెన్:
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ రెండో సెషన్ లో హైలెట్ గా నిలిచాడు. భారత పిచ్ లపై బౌన్సర్లు విసురుతూ ఈ ఒక్క సెషన్ లోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట పంత్ ను ఔట్ చేసిన ఈ సఫారీ పేసర్ అతి పెద్ద వికెట్ తీసుకున్నాడు. జాన్సెన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడిన పంత్.. వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా పంత్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే పంత్ మాత్రమే నిర్లక్ష్యంగా షాట్ ఆడి చేజేతులా వికెట్ పోగొట్టుకున్నాడు.
ఇన్నింగ్స్ 38 ఓవర్ రెండో బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. 7 పరుగుల వద్ద పంత్ ఔట్ కావడంతో ఇండియా 105 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వరుసగా నితీష్ కుమార్ రెడ్డి, జడేజాలను పెవిలియన్ కు పంపాడు. నితీష్ వికెట్ బ్యాడ్ లక్ అని చెప్పాలి. మార్క్రామ్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్‌కు నితీష్ ఔటయ్యాడు. జాన్సెన్ వేసిన బౌన్సర్ ను ఆడే క్రమంలో నితీష్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి గల్లీ వైపుగా వెళ్ళింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రామ్ దూరంగా వెళ్తున్న బంతిని డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఒక బౌన్సర్ తో జడేజా ను ఔట్ చేయడంతో ఇండియా 122 పరుగుల వద్దకు ఏడో వికెట్ కోల్పోయింది.
ఆదుకున్న సుందర్, కుల్దీప్ జోడీ:
వరుసగా వికెట్లు తీసి మంచి జోరు మీదున్న సౌతాఫ్రికా బౌలర్లను సుందర్, కుల్దీప్ ఆదుకున్నారు. వికెట్ల పతనాన్ని అడ్డుకుంటే సఫారీ బౌలర్లలు ఎదురు నిలిచారు. 24 ఓవర్ల పాటు సౌతాఫ్రికాకు వికెట్ ఇవ్వకుండా చేశారు. వీరిద్దరి జోడీ ఎనిమిదో వికెట్ కు 141 బంతుల్లో 52 పరుగులు జోడించి లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. సుందర్ 33.. కుల్దీప్ 14 పరుగులు చేసి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. హార్మర్ రెండు.. మహరాజ్ కు ఒక వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది.
Lunch on Day 3️⃣
— BCCI (@BCCI) November 24, 2025
Washington Sundar and Kuldeep Yadav take #TeamIndia to 174/7 with a gritty 5️⃣2️⃣-run stand 🤝
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/13Bcz2ycAe
