IND vs SA: రెండో రోజు సఫారీలదే.. భారీ స్కోర్ చేసి టీమిండియాకు ఛాలెంజ్

IND vs SA: రెండో రోజు సఫారీలదే.. భారీ స్కోర్ చేసి టీమిండియాకు ఛాలెంజ్

సౌతాఫ్రికాతో జరుగుతున్నరెండో టెస్టులో టీమిండియా వెనకబడినట్టుగానే కనిపిస్తుంది. గౌహతి వేదికగా రెండో రోజు ముగిసిన ఈ టెస్టులో  సఫారీలు పూర్తి ఆధిపత్యం చూపించారు. నాలుగు లోయర్ ఆర్డర్ వికెట్లు తీయడానికి టీమిండియా రోజంతా కష్టపడితే.. సౌతాఫ్రికా 242 పరుగులు రాబట్టి పటిష్ట స్థితిలో నిలిచింది. ముత్తుస్వామి సెంచరీ (109) కి తోడు జాన్సెన్ మెరుపు హాఫ్ సెంచరీ (93) చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్లు రాహుల్ (2), జైశ్వాల్ (7) ఉన్నారు. 

ప్రస్తుతం ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 480 పరుగులు వెనకబడి ఉంది. రెండు రోజుల ఆట ముగియడంతో ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓడిపోయే అవకాశాలు కనిపించడం లేదు. భారీ స్కోర్ కొట్టి ఈ మ్యాచ్ లో దాదాపు సేఫ్ జోన్ లో నిలిచింది. టీమిండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే. మూడు, నాలుగు రోజులు బ్యాటింగ్ చేస్తేనే ఇండియా ఈ మ్యాచ్ లో డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. 

7 వికెట్ల నష్టానికి 428 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా మరో 61 పరుగులు జోడించి 489 పరుగులకు ఆలౌటైంది. సెషన్ ఆరంభంలోనే సెంచరీ హీరో ముత్తుస్వామిని సిరాజ్ చేశాడు. దీంతో జాసన్ తో కలిసి నెలకొల్పిన 97 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. హార్మర్ ను బుమ్రా బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా 8 వ వికెట్ కోల్పోయింది. జాన్సెన్ చివరి వికెట్ రూపంలో కుల్దీప్ బౌలింగ్ లో ఔటవ్వడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.  ముత్తుస్వామి 109 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాన్సెన్ 93 పరుగుల వద్ద ఔటై సెంచరీ మిస్ చేసుకున్నాడు. టీమిండి బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జడేజా, సిరాజ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

ముత్తుస్వామి కీలక భాగస్వామ్యాలు:  

6 వికెట్ల నష్టానికి 247 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్ లో చాలా జాగ్రత్తగా ఆడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి గంట పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత పరుగుల వేగం పెంచిన వీరిద్దరి జోడీ జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించారు. ఈ క్రమంలో ముత్తుస్వామి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో వికెట్ కీపర్  వెర్రెయిన్ ఓపిగ్గా ఆడడంతో ఈ సెషన్ లో ఇండియాకు వికెట్ రాలేదు. రెండో రోజు తొలి సెషన్ లో 69 పరుగులు రాబట్టిన సౌతాఫ్రికా వికెట్ ఏమీ కోల్పోలేదు.      
  
6 వికెట్ల నష్టానికి 316 పరుగులతో టీ విరామం తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వికెట్ తీసుకుంది. వెర్రెయిన్ వికెట్ తీసి జడేజా టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. దీంతో ముత్తుస్వామి, వెర్రెయిన్ ల 88 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. వీరిద్దరూ 40 ఓవర్ల పాటు క్రీజ్ లో భారత బౌలట్లను కొరకరాని కొయ్యలా తయారయ్యారు. వెర్రెయిన్ ఔటైనా ముత్తుస్వామి, జాన్సెన్ సౌతాఫ్రికా జట్టును మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఒక ఎండ్ లో ముత్తుస్వామి నిదానంగా ఆడినా మరో ఎండ్ జాన్సెన్ ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించాడు.

జాన్సెన్ తో పాటు ముత్తుస్వామి కూడా వేగంగా ఆడడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ శరవేగంగా కదిలింది. ఈ క్రమంలో ముత్తుస్వామి సెంచరీతో పాటు జాన్సెన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 96 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. మూడో సెషన్ లో సౌతాఫ్రికా 112 పరుగులు రాబట్టి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.