
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ సిటీల్లో చిక్కుకుపోయిన ఇండియన్ స్టూడెంట్లను సేఫ్ గా పంపాలని రష్యా, ఉక్రెయిన్ దేశాలకు మన విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. వెంటనే కాల్పులు ఆపాలని, మనోళ్లు తిరిగి వచ్చేందుకు వీలుగా సేఫ్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరింది. ‘‘సుమీలో ఇండియన్ స్టూడెంట్లు చిక్కుకుపోవడం పట్ల మేం ఆందోళన చెందుతున్నాం. వెంటనే కాల్పులు ఆపాలని, మా స్టూడెంట్లకు సేఫ్ కారిడార్ ఏర్పాటు చేయాలని వివిధ మార్గాల్లో రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాలను గట్టిగా కోరాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. ఖార్కివ్‌లో 300 మంది, సుమీ సిటీలో 700 మంది మన స్టూడెంట్లు చిక్కుకుపోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రిస్క్ తీస్కోవద్దు..
సుమీ స్టేట్ యూనివర్సిటీలో మన స్టూడెంట్లు వారం రోజులుగా చిక్కుకుపోయారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవని, ఇక తాము రిస్క్ తీసుకుని 50 కిలోమీటర్ల దూరంలోని రష్యా బార్డర్ వైపు బయలుదేరుతున్నామంటూ స్టూడెంట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమకు ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వం, అక్కడి ఇండియన్ ఎంబసీనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సిటీలో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయని, వీధుల్లో కాల్పుల మోత వినిపిస్తోందని చెప్పారు. కొందరు విదేశీ స్టూడెంట్లు రిస్క్ తీసుకుని వెళ్లి కాల్పుల్లో హతమైనట్లు వీడియోలు కూడా తమకు అందాయన్నారు. దీంతో వెంటనే మన స్టూడెంట్లతో అక్కడి మన ఎంబసీ అధికారులు కాంటాక్ట్ అయ్యారు. యూనివర్సిటీలోనే సేఫ్ గా ఉండాలని, అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని చెప్పారు. వారిని అక్కడి నుంచి తరలించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాలతో పాటు రెడ్ క్రాస్, ఇతర సంస్థల సహాయం కూడా తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
ప్రతి ఒక్కరినీ సేఫ్‌గా పంపుతం: రష్యా
ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్కివ్, సుమీ సిటీల నుంచి ఇండియన్ స్టూడెంట్లను, ఇతర దేశీయులను తరలించేందుకు 130 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రష్యా తెలియజేసింది. బార్డర్ వద్ద చెక్ పాయింట్లు పెట్టామని, అక్కడ స్టూడెంట్లకు ఫుడ్, మందులు వంటివి సిద్ధం చేశామని చెప్పింది. వీళ్లందరినీ రష్యాలోని బెల్గార్డ్కు తీసుకెళ్లి, అక్కడి నుంచి వారి వారి దేశాలకు విమానాల్లో పంపుతామని పేర్కొంది. శుక్రవారం జపొరిజియా అణు విద్యుత్ కేంద్రంపై దాడి తర్వాత 15 దేశాలతో కూడిన భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో రష్యన్ అంబాసిడర్ వసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ బలగాలు 3,700 మంది ఇండియన్ లు, ఇతర దేశాలకు చెందిన అనేక మందిని సిటీల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటు న్నారని చెప్పారు. తాము మాత్రం ఇండియన్, ఇతర దేశాల స్టూడెంట్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.