V6 News

U19 Asia Cup: తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపారు: యూఏఈపై 234 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

U19 Asia Cup: తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపారు: యూఏఈపై 234 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. శుక్రవారం (డిసెంబర్ 12) యూఏఈపై జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో 234 పరుగుల భారీ తేడాతో యూఏఈని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ భారీ సెంచరీతో చెలరేగడంతో పాటు బౌలర్లందరూ సమిష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. ఛేజింగ్ లో యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులకే పరిమితమైంది. 

434 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన యూఏఈ జట్టుకు ఘోరమైన ఆరంభం లభించింది. భారత పేసర్ల ధాటికి షాలోం డిసౌజా (4), అయాన్ మిస్బా (3) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కాసేపాటికీ అహ్మద్ ఖుదాదాద్ (0), యాయిన్ రాయ్ (17), ముహమ్మద్ రాయన్ ఖాన్ (19), నూరుల్లా అయోబి (3) పెవిలియన్ కు క్యూ కట్టడంతో యూఏఈ 53 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఉద్దీష్ సూరి, పృథ్వీ మధు భారత బౌలర్లను ఎదుర్కొని భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. 7 వికెట్ కు 85 పరుగులు జోడించి వికెట్ల పతనాన్ని ఆపారు. చివరికి 50 ఓవర్లు ఆడి 199 పరుగులే చేసి ఓడిపోయారు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే ఆయుష్ మాత్రే (4) వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఆరోన్ జార్జ్ తో కలిసి సూర్య 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్య 171 పరుగుల  మారథాన్ ఇన్నింగ్స్ తర్వాత ఔటైనా.. విహాన్ మల్హోత్రా (69), వేదాంత్ త్రివేది (38), అభిజ్ఞాన్ కుండు (32), కనిష్క్ చౌహాన్ (28) దూకుడుగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. 

14 ఏళ్ల చిచ్చర పిడుగు.. వైభవ్ సూర్యవంశీ యూఏఈ బౌలర్లపై తాండవం ఆడాడు. 56 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్లతో సెంచరీ చేసి.. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. సెంచరీ చేశాక మరింత దూకుడుగా ఆడాడు. ఓవరాల్ గా 95 బంతుల్లో 14 సిక్సులు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీకి 29 పరుగుల దూరంలో ఔటయ్యాడు. సూర్యవంశీ ఔట్ కావడంతో యూఏఈ బౌలర్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.