అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి పాకిస్థాన్ పై బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో అద్భుతంగా రాణించి దాయాది జట్టుకు పరాభవాన్ని మిగిల్చారు. ఆదివారం (డిసెంబర్ 14) దుబాయ్ వేదికగా ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో 90 పరుగుల తేడాతో పాకిస్థాన్ జట్టుపై విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ లో ఆరోన్ జార్జ్ (85) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు బౌలింగ్ లో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ విజృంభించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.1 ఓవర్లలోనే 240 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో పాకిస్థాన్ 150 పరుగులకు ఆలౌటైంది.
241 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. తొలి 8 ఓవర్లలో పరుగులు రాకపోయినా వికెట్ కాపాడుకునేందుకు పాక్ ఓపెనర్లు ప్రాధాన్యత ఇచ్చారు. 9 ఓవర్ నుంచి పాకిస్థాన్ కు వరుస షాకులు తగిలాయి. ఫాస్ట్ బౌలర్ దీపేష్ దేవేంద్రన్ చెలరేగడంతో స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ కోలుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్ లో స్పిన్నర్ కనిష్క్ చౌహాన్ ధాటికి పాక్ కుప్పకూలింది. హుజైఫా అహ్సాన్ 70 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో మూడు వికెట్లు తీసుకొని పాక్ ను చిత్తు చేశారు.
ఆదుకున్న ఆరోన్ జార్జ్:
వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలోనే టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ కేవలం 5 పరుగులకే చేసి ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 49 పరుగులు జోడించిన తర్వాత భారత జట్టు మాత్రే వికెట్ ను కోల్పోయింది. ఈ రెండు వికెట్లు మొహమ్మద్ సయ్యంకే దక్కాయి. కాసేపటికే విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) పెవిలియన్ బాట పట్టడంతో భారత జట్టు 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో అభిజ్ఞాన్ కుండుతో కలిసి జార్జ్ జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అభిజ్ఞాన్ కుండు (22) తో పాటు 85 పరుగులు చేసి క్రీజ్ లో పాతుకుపోయిన జోర్జి స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్ల పడుతున్నా మరో ఎండ్ లో కనిష్క్ చౌహాన్ జట్టుకు విలువైన పరుగులు అందించాడు. కీలకమైన 46 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 240 పరుగులకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్ లో యూఏఈపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
