నవంబర్ నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఖరారయ్యే ఛాన్స్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

నవంబర్ నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఖరారయ్యే ఛాన్స్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: అమెరికా భారత్ మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోన్న వేళ.. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 2)  ముంబైలో జరిగిన వార్షిక ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో గోయల్ మాట్లాడుతూ.. అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (BTA) 2025 నవంబర్ నాటికి భారత్ పూర్తి చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కొన్ని భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఈ ఒప్పందం కోసం జరిగే చర్చలను అధిగమించాయని తెలిపారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య పరిస్థితులు చక్కబడతాయని.. ముందు అనుకున్నట్లుగా నవంబర్ నాటికి  అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముగించగలమని భావిస్తున్నానని అన్నారు. భారతదేశంతో వాణిజ్యం, వ్యాపార సంబంధాలను విస్తరించడంపై ప్రపంచ దేశాలకు చాలా ఆసక్తి ఉందని ఆయన అన్నారు.  

భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియా, యుఎఇ, మారిషస్, యూకే, యూరోపియన్ కూటమి EFTAలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని గుర్తు చేసిన గోయల్..  అమెరికా విషయంలో కొన్ని భౌగోళిక రాజకీయాలు పరిస్థితుల వల్ల ఫ్రీ ట్రేడ్ డీల్ ఆలస్యమవుతోందని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయని.. మరికొన్ని జరగాల్సి ఉందని పేర్కొన్నారు. 

►ALSO READ | పుతిన్ డైనమిక్ లీడర్: భారత్-రష్యా సంబంధాలపై పాక్ పీఎం కీలక వ్యాఖ్యలు

కాగా, 2025, మార్చి నుంచి భారత్, అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటివరకు ఐదు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. తదుపరి రౌండ్ చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం 2025, ఆగస్టు 25న ఇండియాకు రావాల్సి ఉంది. కానీ 2025, ఆగస్టు 27 నుంచి భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో ఫ్రీ డీల్ అగ్రిమెంట్‎పై చర్చలు నిలిచిపోయాయి. 

ఆరో రౌండ్ చర్చలకు కొత్త తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు. కాగా, అమెరికా ఎగుమతులపై భారత్ విధిస్తున్న సుంకాలకు ప్రతీకారంగా భారత ఎగుమతులపై ట్రంప్ 25 శాతం టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. రష్యా నుంచి క్రూడ్  ఆయల్ కొనుగోలు చేస్తోందన్న సాకుతో ఇండియాపై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించాడు ట్రంప్. దీంతో ఇండియా ఎగుమతులపై సుంకాలు మొత్తం 50 శాతానికి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇండియా, అమెరికా మధ్య టారిఫ్ వార్ సాగుతోంది.