
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో 1998 పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన రోజులు అత్యంత అద్భుతమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన దేశం అభివృద్ధి కోసమే టెక్నాలజీని వినియోగిస్తుంది కానీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం కాదన్నారు. టెక్నాలజీ వేగవంతమైన అభివృద్ధికి సాధనం అని ఆయన స్పష్టం చేశారు. పోఖ్రాన్ అణు పరీక్షల 25వ వార్షికోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) సందర్భంగా గురువారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు.
నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో జరిగిన పోఖ్రాన్ అణుపరీక్షల ద్వారా భారతదేశం తన సామర్థ్యాలను నిరూపించుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో దేశ ఔన్నత్యాన్ని చాటిందన్నారు. తమ ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పదేండ్ల క్రితం ఏడాదికి 4 వేల పేటెంట్లు రిజిస్టర్ అయితే ప్రస్తుతం సంవత్సరానికి 30 వేలకుపైగా పేటెంట్లు రిజిస్టర్ అవుతున్నాయన్నారు. ఇంతకుముందు ఏటా 70,000 ట్రేడ్‌మార్క్‌లు నమోదైతే ఇప్పుడు ఈ సంఖ్య 2.5 లక్షలకు పైగా ఉందని, 2014లో 150 ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్ల సంఖ్య 650కి పెరిగిందని ప్రధాని వెల్లడించారు.
700 జిల్లాల్లో పనిచేస్తున్న 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఇన్నోవేషన్ నర్సరీలుగా మారాయన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని లేజర్ ఇంటర్‌ఫెరో మీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో -ఇండియా)కు, ఒడిశాలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌కు, తదితర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.