IND vs AFG 3rd T20I: అందరి కళ్లు ఆ ఒక్కడిపైనే..చిన్నస్వామి పిచ్ ఎలా ఉందంటే..?

IND vs AFG 3rd T20I: అందరి కళ్లు ఆ ఒక్కడిపైనే..చిన్నస్వామి పిచ్ ఎలా ఉందంటే..?

ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు భారత్ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. చివరి మ్యాచ్ లోనైనా గెలిచి భారత్ కు షాక్ ఇవ్వాలని ఆఫ్ఘనిస్తాన్ చూస్తుంది. చిన్నస్వామి స్టేడియం కావడంతో ఈ మ్యాచ్ లో అందరి చూపు కోహ్లీ పైనే ఉంది. ఇక ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా చిన్నస్వామి పిచ్ అంటే బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంటుంది. నేటి మ్యాచ్ లో కూడా బౌలర్లకు పీడకల ఖాయమంటున్నారు నిపుణులు. ఇక్కడ బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తుంది. ఖచ్చితమైన లెంగ్త్ లో బౌలింగ్ వేస్తేనే పరుగులు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఛేజింగ్ సమయంలో మంచు ప్రభావం బౌలర్లకు మరింత ప్రతికూలంగా మారనుంది.

ఈ స్టేడియంలో  టీమిండియా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించగా, మూడింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ లో ఫలితం తేలలేదు. తుది జట్టు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత్ ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు ఇదే చివరి మ్యాచ్ కావడంతో అందరూ ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. ధర్మశాల, ఇండోర్ వేదికగా జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.