
- ఫుట్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా గిల్‌కు మొదటి సవాల్
- ఉ. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
పెర్త్: అభిమానులందరి ఫోకస్ లెజెండరీ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఉండగా.. ఇండియా క్రికెట్‌లో ఒక కొత్త శకానికి తెరలేవనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌తో యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఏడు నెలల గ్యాప్ తర్వాత లెజెండ్స్ రోహిత్, కోహ్లీ (రోకో) తిరిగి ఇండియా జెర్సీ వేసుకొని గ్రౌండ్‌లో అడుగు పెట్టడం ఈ సిరీస్‌కు జోష్ తెచ్చింది. ఇండియాతో పాటు ఆసీస్ ఫ్యాన్స్ కూడా రోకో ఆట కోసం ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం షార్ట్ ఫార్మాట్‌కు, ఆ తర్వాత టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఈ ఏడాది మార్చిలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ ఏడు నెలల్లో దేశ క్రికెట్‌లో సమీకరణాలు చాలా మారాయి. ఈ దిగ్గజాలు లేకుండానే జట్టు ముందుకు సాగడం అలవాటు చేసుకుంది. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైనప్పటికీ రోకోపై భారీ అంచనాలు ఉన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలెక్టర్లు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఈ ఇద్దరు లెజెండ్స్ జట్టులో తమ స్థానాలను పదిలం చేసుకోవాలంటే ఈ సిరీస్‌లో రాణించాల్సి ఉంటుంది.
నితీష్‌కు చాన్స్
2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్న రోహిత్, కోహ్లీ అందుకు ఈ సిరీస్ నుంచి బలమైన పునాది వేసుకోవాలని భావిస్తున్నారు. ఒకే ఫార్మాట్‌లో మాత్రమే బరిలో నిలిచిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఫామ్ చూపెట్టి.. తమ బ్యాట్ పవర్ తగ్గలేదని నిరూపించుకోవాలి. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కేవలం సీనియర్ ఆటగాడిగా కొత్త పాత్రకు అలవాటు పడాల్సి ఉంది. ఆసీస్‌లో ఘన రికార్డును కోహ్లీ కొనసాగించి.. రోహిత్ తన మార్కు షాట్లతో అలరించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ఈ ఇద్దరి పాత వైరం ఆసక్తి పెంచుతోంది. ఇక, టీమ్ కాంబినేషన్ విషయంలో ఇండియాకు పెద్దగా ఇబ్బందులు లేవు. సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ కాంబినేషన్‌గా రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగనుండగా.. యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉంటాడు. వన్‌డౌన్‌లో కోహ్లీ రానుండగా.. కొత్తగా వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్, కీపర్ కేఎల్ రాహుల్ తో కలిసి మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకోనున్నాడు. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేసే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బాధ్యతలు మోయనుండగా.. బుమ్రా గైర్హాజరీలో హైదరాబాదీ సిరాజ్ పేస్ ఎటాక్‌ను ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా లేదా ప్రసిధ్ కృష్ణలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు.
ఆసీస్‌కు గాయాల బెడద
ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో ఇబ్బంది పడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్, ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయాలతో దూరం కాగా, ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. అయినప్పటికీ, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రమాదకర ఆటగాళ్లతో ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. స్టాండిన్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌నూ తక్కువగా అంచనా వేయడానికి లేదు. పైగా సొంతగడ్డపై ఆసీస్‌ను పడగొట్టడం అంత ఈజీ కాబోదు. ఇండియా అనగానే రెచ్చిపోయే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఆ టీమ్‌కు అతి పెద్ద బలం. ఈ మ్యాచ్‌తో రెన్‌షా, ఓవెన్ వన్డే అరంగేట్రం చేయనున్నారు.
►ALSO READ | గిల్ను చూస్తే భయమేస్తోంది.. టీ20 కెప్టెన్సీ లాగేసుకుంటాడేమో..! సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్ వైరల్
పిచ్/వాతావరణం
పెర్త్ స్టేడియం సహజంగా పేసర్లకు అనుకూలిస్తుంది, ఇక్కడ వన్డేల్లో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. అయితే, మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉండటం కాస్త ఆందోళన కలిగించే విషయం.
తుది జట్లు (అంచనా):
ఇండియా: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, అయ్యర్, రాహుల్ (కీపర్), నితీష్ రెడ్డి, అక్షర్, కుల్దీప్, సిరాజ్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా/ప్రసిధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), హెడ్, మాథ్యూ షార్ట్, లబుషేన్, జోష్ ఫిలిప్ ( కీపర్), రెన్‌షా, మిచ్ ఓవెన్, కనొలీ, స్టార్క్, హేజిల్‌వుడ్, నేథన్ ఎలీస్.
గిల్ కెప్టెన్సీకి పరీక్ష
ఒకవైపు సీనియర్ల రీఎంట్రీతో పాటు 26 ఏండ్ల శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టెస్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ టూర్‌లో మెప్పించిన గిల్.. కోహ్లీ వారసత్వాన్ని కొనసాగించే సత్తా తనకుందని నిరూపించుకున్నాడు. ఇప్పుడు వైట్‌బాల్ ఫార్మాట్‌పైనా తనదైన ముద్ర వేయాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్‌గా వన్డేల్లో 75 శాతం సక్సెస్ రికార్డు ఉన్న రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం గిల్‌కు పెద్ద సవాల్ కానుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో, గ్రౌండ్‌లో తనను గైడ్ చేసేందుకు రోహిత్, విరాట్ ఉండటం ప్లస్ పాయింట్ కానుంది. మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురైతే వాళ్ల సలహా తీసుకోవడానికి అస్సలు వెనుకాడనని గిల్ పేర్కొన్నాడు.