
- తేలిపోయిన టాపార్డర్
- అయ్యర్ పోరాటం వృథా
- 8 వికెట్లతో మోర్గాన్‌సేన గెలుపు
‘ఈ సిరీస్ నుంచి టీ20ల్లో మేం డిఫరెంట్‌గా ఆడబోతున్నాం. నాతో పాటు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అంతా నిర్భయంగా, దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం’. సిరీస్‌కు ముందు కెప్టెన్ కోహ్లీ చేసిన కామెంట్ ఇది. దాంతో, టెస్టు సిరీస్ గెలిచి ఊపుమీదున్న టీమిండియా షార్ట్ ఫార్మాట్‌లో దంచికొట్టి తమకు కావాల్సిన వినోదం పుంచుతారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది..! పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై జాగ్రత్తగా ఆడాల్సిన టైమ్‌లో నిర్లక్ష్యమైన షాట్లు ఆడిన టాపార్డర్ కుప్పకూలింది..! శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్‌తో 67) ఒంటరి పోరాటం చేసినా వరల్డ్
నంబర్ 1 టీమ్ ఇంగ్లండ్ ముందు చిన్న టార్గెట్‌ను మాత్రమే ఉంచిన ఇండియా బౌలింగ్‌లోనూ తేలిపోయి తొలి టీ20లో చిత్తయింది..! ఆల్‌రౌండ్ షో చేసిన ఇంగ్లిష్ టీమ్ టీ20 సిరీస్‌లో ఫస్ట్ పంచ్ కొట్టింది..!
అహ్మదాబాద్: టీ20 వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్‌లో ఇండియా తొలి అడుగే తడబడింది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన కోహ్లీసేన శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ టీమ్ చేతిలో చిత్తుగా ఓడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 రన్స్ చేసింది. అయ్యర్ తో పాటు రిషబ్ పంత్ (23 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21), హార్దిక్ పాండ్యా (21 బాల్స్‌లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 19) మాత్రమే రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (3/23) మూడు వికెట్లతో దెబ్బకొట్టాడు. మార్క్ వుడ్ (1/20), క్రిస్ జోర్డాన్ (1/27) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం జేసన్ రాయ్ (32 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49) మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లిష్ టీమ్ 15.3 ఓవర్లలో 2 వికెట్లకు 130 రన్స్ చేసి ఈజీగా గెలిచింది. సిరీస్‌లో 1–0తో లీడ్ సాధించింది. జోఫ్రా ఆర్చర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండు జట్ల మధ్య సెకండ్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
టాప్ ఢమాల్
మూడు ఓవర్లకే రెండు వికెట్లు.. పవర్‌ప్లేలో 22/3.. సగం ఓవర్లు ముగిసేసరికి 48/4. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఆట సాగిన తీరిది. ఇంగ్లండ్ బౌలర్లు ఎక్స్‌ట్రా బౌన్స్ రాబడుతూ వేసిన కట్టుదిట్టమైన బాల్స్‌కు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా తేలిపోయారు. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (1), శిఖర్ ధవన్ (4), విరాట్ కోహ్లీ (0) ముగ్గురు కలిసి ఐదు పరుగులే చేయడంతో ఇండియా మోస్తరు స్కోరుకే సరిపెట్టుకుంది. పేసర్ జోఫ్రా ఆర్చర్ తన రెండో బాల్‌కే ఓపెనర్ లోకేశ్‌ను బౌల్డ్ చేసి హోమ్‌టీమ్‌కు షాకిచ్చాడు. రషీద్ వేసిన మూడో ఓవర్లో అతి పెద్ద దెబ్బ తగిలింది. అతని బాల్‌ను సర్కిల్ మీదుగా బౌండ్రీ కొట్టే ప్రయత్నం చేసిన విరాట్ జోర్డాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా 3/2తో నిలిచింది. స్టేడియం మొత్తం సైలెంట్‌గా మారింది. అయితే, నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ స్టార్టింగ్‌లో అనూహ్య షాట్లతో ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. బౌండ్రీతో ఖాతా తెరిచిన అతను ఆర్చర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్‌తో సిక్సర్, తర్వాతి బాల్‌ను స్క్వేర్ లెగ్ మీదుగా బౌండ్రీ దాటించాడు. కానీ, తర్వాతి ఓవర్లో ధవన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన మార్క్‌వుడ్ ఇండియాకు మరో షాకిచ్చాడు. ఈ టైమ్‌లో పంత్‌కు తోడైన శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. మరో ఎండ్‌లో పంత్ జాగ్రత్తగా ఆడగా.. వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు. దాంతో, ఈ జోడీ కుదురుకున్నట్టే అనిపించింది. కానీ, పదో ఓవర్లో స్టోక్స్.. తన ప్యాడ్స్‌పైకి సంధించిన హాఫ్ వాలీని పంత్ నేరుగా డీప్ స్క్వేర్ లెగ్‌లో బెయిర్‌స్టో చేతుల్లోకి కొట్టాడు.
ఆదుకున్న అయ్యర్
సగం ఓవర్లకే నాలుగు వికెట్లు పడగా.. స్కోరు యాభై కూడా దాటలేదు. ఈ టైమ్‌లో క్రీజులో కుదురుకున్న అయ్యర్‌కు హార్దిక్ పాండ్యా తోడయ్యాడు. పాండ్యా ఆచితూచి ఆడగా అయ్యర్ క్రమంగా గేర్లు మార్చాడు. చెత్త బాల్స్ వచ్చినప్పుడల్లా క్లాసిక్ షాట్లతో వాటిని బౌండ్రీ దాటించాడు. తన తొలి 12 బాల్స్‌లో ఏడు పరుగులే చేసిన హార్దిక్.. స్టోక్స్ వేసిన 15వ ఓవర్లో 6, 4తో జోరు పెంచాడు. మరోవైపు ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన శ్రేయస్36 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా సిక్స్ కొట్టి స్కోరు వంద దాటించాడు. ఇంకో వైపు హార్దిక్ కూడా జోరు మీదుండగా... చివరి మూడు ఓవర్లలో దంచికొడితే స్కోరు 150 వరకు వెళ్తుందనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లో వరుస బాల్స్‌లో పాండ్యా, శార్దూల్ ఠాకూర్ (0)ను ఔట్ చేసిన ఆర్చర్ మూడు రన్సే ఇచ్చాడు. ఇక, లాస్ట్ ఓవర్లో బౌండ్రీ లైన్ దగ్గర మలన్ పట్టిన సూపర్ క్యాచ్‌కు అయ్యర్ ఔటయ్యాడు. చివరి మూడు బాల్స్‌కు 2, 4, 1 రాబట్టిన అక్షర్ పటేల్ (7 నాటౌట్) స్కోరు 120 దాటించాడు. ఓవరాల్‌గా పవర్‌ప్లే, స్లాగ్ ఓవర్లలో సూపర్బ్‌గా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్.. హోమ్‌టీమ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.
ఇంగ్లండ్ ధనాధన్
బిగ్ హిట్టర్లతో కూడిన ఇంగ్లండ్ లైనప్ ముందు 125 రన్స్ టార్గెట్ ఏమాత్రం సరిపోలేదు. ఓపెనర్ జేసన్ రాయ్ స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడడంతో చిన్న లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడ్డ పిచ్‌పై టూరిస్ట్ టీమ్ ఓపెనర్లు రాయ్, బట్లర్ (28) ఈజీగా షాట్లు కొట్టారు. భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్లో బౌండ్రీల ఖాతా తెరిచిన రాయ్.. చహల్ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్, ఓ ఫోర్‌తో టాప్ గేర్‌లోకి వచ్చాడు. అక్షర్ బౌలింగ్‌లో బట్లర్ వరుసగా 4, 6 కొట్టి గేరు మార్చాడు. మరో ఎండ్‌లో జేసన్ జోరు కొనసాగించాడు. అక్షర్ ఓవర్లో సిక్స్.. చహల్ బౌలింగ్‌లో 4, 6తో మరింత రెచ్చిపోయాడు. బట్లర్‌ను ఎల్బీ చేసిన చహల్ ఫస్ట్ వికెట్‌కు 72 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఫిఫ్టీకి చేరువైన రాయ్‌ను 12వ ఓవర్లో సుందర్ ఔట్ చేసి ఆశలు రేపాడు. కానీ, అప్పటికి ఇంగ్లండ్ 89/2తో పటిష్ట స్థితిలో నిలవగా.. చహల్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన బెయిర్‌స్టో (26 నాటౌట్) స్కోరు వంద దాటించాడు. మధ్యలో అతనిచ్చిన క్యాచ్‌ను ధవన్ అందుకోలేకపోయాడు. ఇక సుందర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన డేవిడ్ మలన్ (24 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
రెండు షాట్లు.. ఒక సేవ్..
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కొట్టిన రెండు షాట్స్ ఫ్యాన్స్‌ను అబ్బురపరిచాయి. ఫోర్త్ టెస్టులో అండర్సన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ షాట్ కొట్టిన పంత్ ఈ సారి ఆర్చర్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో సిక్స్ కొట్టి ఆశ్చర్యపరిచాడు. ఈ షాట్ కోసం ముందుగానే వికెట్లకు ఎడంగా జరిగిన పంత్ స్టాన్స్ మార్చుకొని బంతిని స్కూప్ చేశాడు. దాంతో, బాల్ థర్డ్ మ్యాన్ మీదుగా మెరుపు వేగంతో రోప్స్ అవతల పడింది. ఇక, స్టోక్స్ వేసిన 15వ ఓవర్లో హార్దిక్ ఎడమవైపు పడిపోతూ కొట్టిన ర్యాంప్ షాట్ ఆకట్టుకుంది. ఇక, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బెయిర్‌స్టో క్యాచ్ కోసం బౌండ్రీ లైన్ వద్ద కేఎల్ రాహుల్ సూపర్బ్ డైవ్ చేశాడు. సిక్స్‌గా వెళ్తున్న బాల్‌ను రాహుల్ వెనక్కు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. కానీ, లైన్ దాటుతున్న విషయం తెలిసి వెంటనే బాల్‌ను బయటికి విసిరాడు. క్యాచ్ రాకున్నా నాలుగు రన్స్ సేవ్ చేశాడు.
Score Board:
ఇండియా: ధవన్ (బి) వుడ్ 4, రాహుల్ (బి) ఆర్చర్ 1, కోహ్లీ (సి) జోర్డాన్ (బి) రషీద్ 0, పంత్ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్ 21, అయ్యర్ (సి) మలన్ (బి) జోర్డన్ 67, పాండ్యా (సి) జోర్డాన్ (బి) ఆర్చర్ 19, శార్దూల్ (సి) మలన్ (బి) ఆర్చర్ 0, సుందర్ (నాటౌట్) 3, అక్షర్ (నాటౌట్) 7;
ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 124/7;
వికెట్ల పతనం: 1–2, 2–3, 3–20, 4–48, 5–102, 6–102, 7–117;
బౌలింగ్: రషీద్ 3–0–14–1, ఆర్చర్ 4–1–23–3, మార్క్ వుడ్ 4–0–20–1, జోర్డన్ 4–0–27–1, స్టోక్స్ 3–0–25–1, కరన్ 2–0–15–0.
ఇంగ్లండ్: రాయ్ (ఎల్బీ) సుందర్ 49, బట్లర్ (ఎల్బీ) చహల్ 28, మలన్ (నాటౌట్) 24, బెయిర్‌స్టో (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 15.3 ఓవర్లో 130/2; వికెట్ల పతనం: 1–72, 2–89; బౌలింగ్: అక్షర్ 3–0–24–0, భువనేశ్వర్ 2–0–15–0, చహల్ 4–0–44–1, శార్దూల్ 2–0–16–0, హార్దిక్ 2–0–13–0, సుందర్ 2.3–0–18–1.