ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లంచ్ బ్రేక్ స్కోర్: 1/1

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లంచ్ బ్రేక్ స్కోర్: 1/1
  • టీమిండియా తొలి ఇన్నింగ్స్: 337 ఆలౌట్
  • 246 పరుగులు వెనుకబడ్డ భారత్

చెన్నై: తొలి టెస్ట్ నాలుగో రోజు భోజన విరామ సమయానికి ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు 1 పరుగు చేసి ఒక వికెట్ కోల్పోయింది. భారత్ ఘోరంగా తడబడి 337 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఓవర్ ను కెప్టెన్ కోహ్లి అశ్విన్ కు అందజేయగా.. తొలి బంతికే వికెట్ పడగొట్టి ఆశలు రేపాడు. ఓపెనర్ రోరీ బర్న్స్ ను డకౌట్ చేశాడు అశ్విన్. అనూహ్యంగా స్వింగ్ అయిన బంతి బ్యాట్ ను తాకి స్లిప్ లోకి దూసుకెళ్లగా.. అక్కడే కాచుకుని ఉన్న రెహానే వెంటనే ఒడిసి పట్టేశాడు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో తొలి బంతికే ఒక వికెట్ సమర్పించుకుంది. ఆ తర్వాత మరో ఐదు ఓవర్ల ఆట జరిగింది. లంచ్ బ్రేక్ సమయానికి  ఇంగ్లండ్ 1 పరుగుతో ఖాతా తెరిచింది. సిబ్లి మరియు లారెన్స్ క్రీజులో ఉన్నారు.

పరుగులు చేయలేక తడబడిన భారత్

బాగా అచ్చొచ్చిన పిచ్ పై పరుగులు చేయలేక తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ మెరుపు బ్యాటింగ్ ను  వాషింగ్టన్ సుందర్ అందిపుచ్చుకుని పోరాటం కొనసాగించాడు. అయితే 138 బంతుల్లో 85 పరుగులు ( 12 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసినా అతనికి సహచర ఆటగాళ్ల నుండి ఎలాంటి సహకారం అందలేదు. ఓవర్ నైట్ స్కోరు 257/6 స్కోరుతో సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు మాత్రమే చేసి 337 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు వెనుకబడింది. ఎంతో ఉత్సాహంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు తొలి బంతికే వికెట్ కోల్పోవడం షాక్ కు గురిచేసింది.