వన్డేల్లోనూ జోరు కొనసాగేనా?.. ఇవాళ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ తొలి వన్డే

వన్డేల్లోనూ జోరు కొనసాగేనా?.. ఇవాళ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ తొలి వన్డే
  • నేడు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ తొలి వన్డే
  • సా.  5.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

సౌతాంప్టన్‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై చరిత్రాత్మక టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ విజయం తర్వాత ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ విజయంతో మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా అదే జోరును వన్డేల్లోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మే నెలలో శ్రీలంక, సౌతాఫ్రికాతో జరిగిన ట్రై నేషన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ను గెలవడం కూడా ఇండియాకు కలిసొచ్చే అంశం. ఇటీవల దూకుడైన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న ఇండియా 300 స్కోరు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ట్రై సిరీస్‌‌‌‌‌‌‌‌లో 276, 275, 337, 342 స్కోర్లు చేయడమే ఇందుకు నిదర్శనం. భారీ స్కోర్లు చేయడం వల్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. 

ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ వర్మ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ప్రతీకా రావల్‌‌‌‌‌‌‌‌ జట్టులోకి వచ్చింది. ట్రై సిరీస్‌‌‌‌‌‌‌‌లో రాణించిన ఆమె కెరీర్‌‌లో వేగంగా 500 రన్స్‌‌‌‌‌‌‌‌ అందుకొని మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. టాప్‌‌‌‌‌‌‌‌లో స్మృతి మంధాన, హర్మన్‌‌‌‌‌‌‌‌.. మిడిల్‌‌‌‌‌‌‌‌లో జెమీమా, హర్లీన్‌‌‌‌‌‌‌‌ డియోల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫినిషర్‌‌‌‌‌‌‌‌ రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. దీప్తి శర్మ, అమన్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్​లో అదనపు బలంగా మారనుంది. పేసర్లు రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌, టిటాస్‌‌‌‌‌‌‌‌ సాధు, పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌ గాయాలతో ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరమైనా అరుంధతి, క్రాంతి గౌడ్‌‌‌‌‌‌‌‌, అమన్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌, సయాలీ వాళ్ల ప్లేస్‌‌‌‌‌‌‌‌లను భర్తీ చేసేందుకు రెడీగా ఉన్నారు. స్పిన్నర్లు శ్రీచరణి, రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌, స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణా, దీప్తి శర్మపై పూర్తి నమ్మకం ఉంది. మరోవైపు గజ్జ నొప్పి కారణంగా టీ20లకు దూరమైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నాట్ సివర్‌‌‌‌‌‌‌‌ బ్రంట్‌‌‌‌‌‌‌‌ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనుంది. మోకాలి నొప్పి నుంచి కోలుకున్న నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ సోఫీ ఎకిల్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ కూడా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ ఇద్దరి రాకతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ బలం రెట్టింపైంది.