నెదర్లాండ్స్‌‌ పై ఇండియా గెలుపు... అజేయంగా సూపర్–8 రౌండ్‌ కు

నెదర్లాండ్స్‌‌ పై ఇండియా గెలుపు... అజేయంగా సూపర్–8 రౌండ్‌ కు
  • 17 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌‌‌‌పై ఇండియా గెలుపు
  • దంచికొట్టిన శివం దూబే
  • సత్తా చాటిన చక్రవర్తి, పాండ్యా

టీ20 వరల్డ్ కప్‌‌ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది.  బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌‌లో.. శివం దూబే (66) మెరుపు ఫిఫ్టీకి తోడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  (3/14 ) మూడు వికెట్లు తీయడంతో 17  రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌‌పై గెలిచింది.

అహ్మదాబాద్‌‌‌‌: శివం దూబే (31 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66) మెరుపు ఫిఫ్టీకి తోడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  (3/14 ) మూడు వికెట్లతో మ్యాజిక్ చేయడంతో టీ20 వరల్డ్ కప్‌‌‌‌ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్‌‌‌‌-–ఎలో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో 17  రన్స్ తేడాతో  చిన్న జట్టు నెదర్లాండ్స్‌‌‌‌పై  కష్టంగానే గెలిచింది. వరుసగా నాలుగో విజయంతో సూపర్‌‌‌‌‌‌‌‌–8 పోటీకి రెడీ అయింది.  తొలుత ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 193/6 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (21 బాల్స్‌‌‌‌లో 3 సిక్సర్లతో 30), సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31) కూడా రాణించారు. 

డచ్ టీమ్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ (3/56) మూడు, ఆర్యన్ దత్ (2/19) రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో డచ్ టీమ్ ఓవర్లన్నీ ఆడి 176/7 స్కోరు చేసి ఓడింది. బాస్ డి లీడె (33)తో పాటు చివర్లో జాచ్‌‌‌‌ లయన్ కాషెట్ (16 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 1 సిక్స్‌‌‌‌తో 26), నోహ్‌‌‌‌  క్రోస్ (12 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 25 నాటౌట్‌‌‌‌) సత్తా చాటారు. రెండు వికెట్లు కూడా తీసిన దూబేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌లో  భాగంగా ఆదివారం జరిగే తొలి పోరులో సౌతాఫ్రికాతో ఇండియా పోటీపడనుంది.

అభి మళ్లీ డకౌట్‌‌‌‌.. దంచిన దూబే

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ (0) మళ్లీ సున్నాచుట్టాడు.  వరల్డ్ కప్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో డకౌటైన నాలుగో బ్యాటర్‌‌గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఓవర్లోనే ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్‌‌‌‌ దత్ బౌలింగ్‌‌‌‌లో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  పవర్ ప్లేలో మూడు ఓవర్లు వేసిన ఆర్యన్.. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌ (18), తిలక్ వర్మను కూడా ఇబ్బంది పెట్టాడు. వాన్‌‌‌‌ బీక్ వేసిన రెండో ఓవర్లో తిలక్ సిక్స్‌‌‌‌ కొట్టగా..అకెర్‌‌‌‌‌‌‌‌మన్ బౌలింగ్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కూడా సిక్స్‌‌‌‌తో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ఐదో ఓవర్లో  ఆర్యన్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్ అవ్వడంతో రెండో వికెట్‌‌‌‌కు 39 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. 

కెప్టెన్ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి పవర్ ప్లేను 51/2తో ముగించిన తిలక్.. భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ, పవర్‌‌‌‌‌‌‌‌ ప్లే తర్వాత స్లో అయిన అతను తొమ్మిదో ఓవర్లో  వాన్ బీక్‌‌‌‌ స్లో ఫుల్ లెంగ్త్ బాల్‌‌‌‌కు  భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసి  మెర్వేకు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో లెవిట్‌‌‌‌ క్యాచ్ డ్రాప్‌‌‌‌ చేయడంతో బతికిపోయిన సూర్య  కాసేపు జాగ్రత్తపడ్డాడు. శివం దూబే కూడా క్రీజులో కుదురుకునేందుకు టైమ్ తీసుకోవడంతో  18 బాల్స్‌‌‌‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. 11 ఓవర్లకు ఇండియా 76/3 మాత్రమే చేసింది. అయితే డి లీడె వేసిన తర్వాతి ఓవర్లో లాంగాన్ మీదుగా సిక్స్‌‌‌‌ కొట్టిన సూర్య ఇన్నింగ్స్‌‌‌‌కు జోష్ తెచ్చాడు. ఆ వెంటనే దూబే ఒక్కసారిగా జోరందుకున్నాడు. అకెర్‌‌‌‌‌‌‌‌మన్ బౌలింగ్‌‌‌‌లో  6, 4, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. 

14వ  ఓవర్లో సూర్యను క్లెయిన్ ఔట్ చేయడంతో డచ్ బౌలర్లు మళ్లీ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ మెర్వే వేసిన 16వ ఓవర్లో దూబే, పాండ్యా చెరో సిక్స్‌‌‌‌తో ఎదురుదాడికి దిగారు. వాన్‌‌‌‌ బీక్ బౌలింగ్‌‌‌‌లో మరో రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన దూబే 25 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 150 మార్కు దాటించాడు. అదే ఊపులో దూబే మరో రెండు ఫోర్లు రాబట్టగా.. 19వ ఓ వర్లో హార్దిక్ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు. లాస్ట్ ఓవర్లో దూబే, రింకూ సింగ్ (6 నాటౌట్‌‌‌‌) చెరో సిక్స్​ కొట్టగా.. ఆఖరి బాల్‌‌‌‌కు సిక్స్ ట్రై చేసిన పాండ్యా లాంగాఫ్‌‌‌‌లో మెర్వేకు క్యాచ్ ఇచ్చాడు.  దూబే, పాండ్యా జోరుతో చివరి 9 ఓవర్లలో11 7 రన్స్ రాబట్టిన ఇండియా మంచి స్కోరు చేసింది. 

లాస్ట్ ఓవర్ వరకూ డచ్ పోరాటం..

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌, ఎండింగ్‌‌‌‌లో నెదర్లాండ్స్‌‌‌‌ గట్టి పోటీనే ఇచ్చినా.. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన ఇండియా బౌలర్లు ప్రత్యర్థికి అడ్డుకట్ట వేశారు. స్టార్టింగ్‌‌‌‌లో ఓపెనర్లు మైఖేల్ లెవిట్ (24), మాక్స్ ఒడౌడ్ (20) తొలి వికెట్‌‌‌‌కు 35 రన్స్ జోడించి శుభారంభం అందించారు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో ఇచ్చిన  టఫ్ క్యాచ్‌‌‌‌ను స్లిప్‌‌‌‌లో అభి డ్రాప్ చేయడంతో బతికిపోయిన ఒడౌడ్‌‌‌‌.. సుందర్ బౌలింగ్‌‌‌‌లో సిక్స్ కొట్టాడు. కానీ ఆరో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు దిగిన వరుణ్ చక్రవర్తి  స్ట్రెయిట్‌‌‌‌ బాల్‌‌‌‌తో అతడిని బౌల్డ్ చేసి ఇండియాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకున్న లెవిట్‌‌‌‌ను ఎనిమిదో ఓవర్లో పాండ్యా వెనక్కుపంపాడు. అయితే, వన్‌‌‌‌డౌన్ బ్యాటర్ బాస్ డి లీడెతో కలిసి అకెర్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌ (23) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 

పాండ్యా ఓవర్లోనే సిక్స్‌‌‌‌  కొట్టిన అతను అభి వేసిన 11వ ఓవర్లో మరో సిక్స్ బాదాడు.  ఇంకోవైపు లీడె కూడా క్రమం తప్పకుండా ఫోర్లు కొట్టాడు. అయితే, 13వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌‌‌కు వచ్చిన చక్రవర్తి.. వరుస బాల్స్‌‌‌‌లో అకెర్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌తో పాటు ఆర్యన్‌‌‌‌ దత్ (0)ను పెవిలియన్ చేర్చి డచ్ టీమ్ జోరుకు బ్రేక్ వేశాడు. దూబే బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ రాబట్టిన లీడె మరో షాట్‌‌‌‌కు ట్రై చేసి వరుణ్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. 16వ ఓవర్లో స్కాట్ ఎడ్వర్డ్స్ (15)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో నెదర్లాండ్స్‌‌‌‌ 125/6తో డీలా పడింది. చివరి 4 ఓవర్లలో  ఆ టీమ్‌‌కు 68 రన్స్ అవసరం అయ్యాయి.  ఓటమి ఖాయం అనుకున్న దశలో డచ్ బ్యాటర్లు నోవా క్రోస్, కాషెట్ అనూహ్యంగా పోరాడారు. 

సుందర్ బౌలింగ్‌‌‌‌లో  వరుసగా రెండు ఫోర్లు కొట్టిన క్రోస్‌.. పాండ్యా వేసిన 19వ ఓవర్లో భారీ షాట్లతో  సిక్స్, రెండు ఫోర్లు రాబట్టి మ్యాచ్‌‌‌‌లో టెన్షన్ రేపాడు. దూబే వేసిన చివరి ఓవర్లో డచ్ టీమ్‌‌‌‌కు 28 రన్స్ అవసరం అయ్యాయి. సూర్య, తిలక్ రెండు క్యాచ్‌‌‌‌లు డ్రాప్ చేసినా.. కాషెట్‌‌‌‌ను ఔట్ చేయడంతో పాటు పది రన్స్ మాత్రమే ఇచ్చిన దూబే జట్టును గెలిపించాడు.
 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 193/6 (శివం దూబే 66, సూర్య 34, పాండ్యా  30, వాన్ బీక్ 3/56, ఆర్యన్ దత్ 2/19). నెదర్లాండ్స్‌‌: 20 ఓవర్లలో 176/7 (డి లీడె 33, కాషెట్ 26, చక్రవర్తి 3/14, దూబే 2/35).