కోహ్లీ సేన ఫ్లాప్ షో.. బొక్క బోర్లా పడిన టీమిండియా

కోహ్లీ సేన ఫ్లాప్ షో.. బొక్క బోర్లా పడిన  టీమిండియా

తొలి రోజు బ్యాటింగ్‌‌లో విఫలమయ్యారు..! రెండో రోజు బౌలింగ్‌‌లో నిరాశపరిచారు..! మూడో రోజు అపోజిషన్‌‌ టెయిల్‌‌ను కట్‌‌ చేయలేకపోయారు..! కానీ నాలుగో రోజు అద్భుతాన్ని ఆశించారు..! ఆడాల్సిన టైమ్‌‌లో అవకాశాలను వృథా చేసుకున్నారు..! పట్టు సాధించాల్సిన పరిస్థితుల్లో పెవిలియన్‌‌కు పోటీపడ్డారు..! ఫలితం… న్యూజిలాండ్‌‌ గడ్డపై ఎదురైన తొలి ‘టెస్ట్‌‌’ సవాల్‌‌లో టీమిండియా బొక్క బోర్లా పడింది..! కండీషన్స్‌‌ను అర్థం చేసుకోలేక.. హోమ్‌‌ టీమ్‌‌ బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కోలేక చేజేతులా ఓటమిని మూటగట్టుకుంది..! దీంతో ప్రతిష్టాత్మక టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో విరాట్‌‌సేనకు తొలి పరాజయం తప్పలేదు..!!

వెల్లింగ్టన్‌‌:  ఊహించిందే జరిగింది..! మూడు రోజుల పాటు మ్యాచ్‌‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టిన న్యూజిలాండ్‌‌.. తొలి టెస్ట్‌‌లో ఇండియాకు చెక్‌‌ పెట్టింది. తమకు మాత్రమే సూటయ్యే కండీషన్స్‌‌లో అదిరిపోయే బ్యాటింగ్‌‌, అద్భుతమైన బౌలింగ్‌‌తో చెలరేగుతూ… నాలుగు రోజుల్లోనే మ్యాచ్‌‌ను ముగించింది. ఫలితంగా సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌‌లో కివీస్​10 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇండియా నిర్దేశించిన 9 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 1.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా ఛేదించింది. లాథమ్‌‌ (7 నాటౌట్‌‌), బ్లండెల్‌‌ (2 నాటౌట్‌‌) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. కివీస్‌‌కు ఇది వందో టెస్ట్‌‌ విజయం కావడం విశేషం. మరోవైపు 2018–19 సీజన్‌‌లో పెర్త్‌‌లో ఆసీస్‌‌ చేతిలో ఓడిన తర్వాత ఇండియాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్‌‌ మొత్తంలో 9 వికెట్లు తీసిన సౌథీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్‌‌ శుక్రవారం నుంచి క్రైస్ట్‌‌చర్చ్‌‌లో జరుగుతుంది. ప్రస్తుతం టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా 360 పాయింట్లతో టాప్‌‌లోనే కొనసాగుతోంది.

ఓడిన తీరే బాధాకరం..

144/4 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌లో 81 ఓవర్లలో 191 ర న్స్‌‌కు ఆలౌటైంది. స్టార్లతో కూడిన లైనప్‌‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌ చేయలేకపోయారు. ఓపికగా ఆడే ప్రయత్నం కూడా చేయకపోవడం మరింత బాధ కలిగించే అంశం. తొలి ఇన్నింగ్స్‌‌లో లెంగ్త్‌‌ డెలివరీస్‌‌, ఫుల్లర్‌‌ లెంగ్త్‌‌ బంతులతో చెలరేగిన బౌల్ట్‌‌ (4/39), సౌథీ (5/61).. రెండో ఇన్నింగ్స్‌‌లో రౌండ్‌‌ ది వికెట్‌‌తో ఇండియాను దెబ్బకొట్టారు. పక్కటెముకలను టార్గెట్‌‌గా చేసుకుని పదునైన రైజింగ్‌‌ డెలివరీలతో విరుచుకుపడ్డారు. తొలి 20 నిమిషాల్లోనే ఓవర్‌‌నైట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రహానె (29), విహారి (15) బలహీనతలను పసిగట్టారు. 68వ ఓవర్‌‌లో బౌల్ట్‌‌ వేసిన లవ్లీ ఔట్‌‌ స్వింగర్‌‌ నుంచి రహానె తప్పించుకోలేకపోయాడు. డిఫెన్స్‌‌ చేసే ప్రయత్నం చేసినా.. బ్యాట్‌‌ ఎడ్జ్‌‌ తాకుతూ కీపర్‌‌ చేతుల్లోకి వెళ్లింది. తర్వాతి ఓవర్‌‌లో సౌథీ వేసిన క్లాసికల్‌‌ ఔట్‌‌ స్వింగర్‌‌కు విహారి వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఈ ఇద్దరి ఔట్‌‌తో ఇండియా ఓటమి ఖరారైంది. దూకుడుగా ఆడిన రిషబ్‌‌ (25).. స్లాగ్‌‌ స్వీప్‌‌తో బౌండరీ సాధించినా రెండోఎండ్‌‌లో సహకారం కరువైంది. అశ్విన్‌‌ (4), ఇషాంత్‌‌ (12) వరుస విరామాల్లో ఔటయ్యారు. మరోసారి స్వీప్‌‌ చేసే ప్రయత్నంలో పంత్‌‌ కూడా వెనుదిరగగా, బుమ్రా (0) మూడు బాల్స్‌‌ ఆడి వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఫోర్త్‌‌ డే 16 ఓవర్లు ఆడిన ఇండియా 47 రన్స్‌‌ జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది.