
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో.. కేబినెట్ సమావేశం మధ్యలోనే బయటకొచ్చేసి పవన్ హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా వెళ్లి ఆయన తల్లిని కలుస్తారు. పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి మూడో షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోనే జరుగుతోంది. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చిరంజీవి కూడా షూటింగ్ మధ్యలో నుంచే వెళ్లిపోయారు.
ఇక.. డిప్యూటీ సీఎం పవన్ షెడ్యూల్ విషయానికొస్తే.. ఏపీలో మంగళవారం జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో భాగం కావాల్సి ఉంది. సీఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏపీలో మరో రెండు కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై చర్చించనున్నారు. విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులకు కూడా ఏపీ కేబినెట్ పచ్చ జెండా ఊపనుంది.
31 అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. అమరావతిలో రెండు దశలో 44 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్. 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,052 కోట్లతో టెండర్లు.. ఇలా ఇవాల్టి ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు ఉండనున్న తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలా కేబినెట్ భేటీ మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.