ఇండో-పాక్‌ వార్‌.. ఆ కిక్కే వేరు!

ఇండో-పాక్‌ వార్‌.. ఆ కిక్కే వేరు!

 

ఇండియా వర్సెస్​ పాకిస్థాన్‌‌.. ఈ మాట వినపడగానే  చెవులు రిక్కించుకుంటయ్..  పిడికిళ్లు బిగుసుకుంటయ్​.. రోమాలు నిక్కబొడుచుకుంటయ్. ఎంత ముఖ్యమైన పనులున్నా చిన్నగానే కనిపిస్తయ్..!  ఇక వరల్డ్‌‌కప్‌‌లో ఇండో–పాక్‌‌ మ్యాచ్‌‌ అంటే ఇంక చెప్పాల్సింది ఏముంటుంది. దాయాదుల ఆట తర్వాతే మరేదైనా అనిపిస్తుంది. పేరుకు రెండు జట్ల మధ్య ఆటే అయినా  ఓ యుద్ధం అన్న భావన అనిపిస్తుంది. ఆట సాగుతున్నంతసేపు ఫ్యాన్స్‌‌ హార్ట్‌‌ బీట్‌‌ డబుల్‌‌ అవుతుంది. అలాంటి అనుభూతిని మరోసారి పంచేందుకు ఇండియా, పాక్‌‌ రెడీ అవుతున్నాయి. ఆదివారమే ఇండో–పాక్‌‌ అల్టిమేట్‌‌ వార్‌‌. ఈ  పోరు కోసం రెండు దేశాల ప్రజలు సహా.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ సందర్భంగా గత వరల్డ్‌‌కప్స్‌‌లో ఇండో–పాక్‌‌ మ్యాచ్‌‌లు ఎలా జరిగాయో  ఓ సారి గుర్తు చేసుకుందాం.

మొహాలీలో ముప్పేట దాడి..

2011లో స్వదేశంలో వరల్డ్‌‌కప్‌‌ను అందుకునే క్రమంలో సెమీఫైనల్లో  పాకిస్థాన్‌‌ను 29 రన్స్‌‌ తేడాతో  ఇండియా చిత్తుగా ఓడించింది.  పాక్‌‌ బౌలింగ్‌‌ను తట్టుకోలేక ఐదుగురు బ్యాట్స్‌‌మెన్‌‌ సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమైనా.. సచిన్‌‌ (85)  అండతో తొలుత టీమిండియా 260 రన్స్‌‌ చేసింది. ఛేజింగ్‌‌ను పాక్‌‌ దీటుగానే ఆరంభించినా.. హోమ్‌‌టీమ్‌‌ బౌలర్లంతా తలో రెండు వికెట్లతో సమష్టిగా రాణించడంతో 231 రన్స్‌‌కే ఆలౌటైంది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో ఫైనల్లో  అడుగుపెట్టిన ధోనీసేన లంకను కూడా జయించి కప్పు కొట్టేసింది.

మియాందాద్‌‌ కుప్పిగంతులు..సచిన్‌‌ మాస్టర్‌‌ స్ట్రోక్‌‌..

వరల్డ్‌‌కప్‌‌ 1975లోనే మొదలైనా.. మెగా టోర్నీలో ఇండియా–పాక్‌‌ మ్యాచ్‌‌ కోసం ఫ్యాన్స్‌‌ 17 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 1992లో తొలిసారి దాయాది జట్లు పోటీ పడ్డాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఇండియా కీపర్‌‌ కిరణ్‌‌ మోరేను వెక్కిరిస్తూ.. జావెద్‌‌ మియాందాద్‌‌ కుప్పిగంతులు వేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది.  పాక్‌‌ ఎన్ని ‘కుప్పిగంతులు’ వేసినా ఈ పోరులో  టీమిండియాదే పైచేయి అయింది. ఈ మ్యాచ్‌‌లో మరో స్పెషల్‌‌ అట్రాక్షన్‌‌ కూడా ఉంది. క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ నాడు 19 ఏళ్ల వయసులో బరిలోకి దిగి 62 బాల్స్‌‌లో 54 రన్స్‌‌ చేసి మ్యాన్ ఆఫ్‌‌ ది మ్యాచ్‌‌గా నిలిచాడు.   ప్రపంచానికి తన బ్యాట్‌‌ పవర్‌‌ చూపించాడు.  ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 216 రన్స్‌‌ చేస్తే .. పాక్‌‌ 173 పరుగులకే కుప్పకూలింది.

సొహైల్‌‌ ఓవరాక్షన్‌‌..  ప్రసాద్‌‌ యాక్షన్‌‌

ఇండియా ఆతిథ్యం ఇచ్చిన 1996 వరల్డ్‌‌కప్‌‌లో  దాయాదులు క్వార్టర్‌‌ఫైనల్లో పోటీ పడ్డారు. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌‌లో  నవ్‌‌జ్యోత్‌‌ సింగ్‌‌ సిద్దూ (93) అద్భుత ఓపెనింగ్‌‌కు ఆఖర్లో వకార్‌‌ యూనిస్‌‌ను టార్గెట్‌‌ చేస్తూ అజయ్‌‌ జడేజా (25 బంతుల్లో 45) మెరుపులు తోడవడంతో ఇండియా 287 రన్స్‌‌ చేసింది. ఛేజింగ్‌‌లో  వెంకటేశ్‌‌ ప్రసాద్‌‌, అనిల్‌‌ కుంబ్లే చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో పాక్‌‌ 248/9 స్కోరుకే పరిమితమై 39 రన్స్‌‌ తేడాతో ఓడిపోయింది. గత వరల్డ్‌‌కప్‌‌లో మియాందాద్‌‌ కుప్పిగంతులు వేస్తే ఈ సారి పాక్‌‌ కెప్టెన్‌‌  అమిర్‌‌ సొహైల్‌‌  అతిగా ప్రవర్తించాడు. వెంకటేష్​ ప్రసాద్​బౌలింగ్‌‌లో ఫోర్‌‌ కొట్టి బంతిని చూడు అంటూ వెంకీని వెటకారం చేశాడు.  కానీ, నెక్ట్స్‌‌ బాల్‌‌కే  సొహైల్‌‌ను ప్రసాద్‌‌ క్లీన్‌‌బౌల్డ్‌‌ చేసి పెవిలియన్‌‌కు దారి చూపిస్తూ  రివెంజ్‌‌ తీర్చుకున్నాడు.

ప్రసాద్‌‌  ప్రతాపం

కార్గిల్‌‌ వార్‌‌ తర్వాత రెండు దేశాల మధ్య ప్రజల్లో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుకున్న టైమ్‌‌లో 1999 టోర్నీలో ఇండో–పాక్‌‌ మ్యాచ్‌‌పై అందరి దృష్టి నిలిచింది. అయితే, వరుసగా మూడోసారి కూడా పాక్‌‌పై ఇండియాదే పైచేయి అయింది.  బెంగళూరులో అమిర్‌‌ సొహైల్‌‌ ఓవరాక్షన్‌‌కు అదిరిపోయే రియాక్షన్‌‌ ఇచ్చిన వెంకటేశ్‌‌ ప్రసాద్‌‌ ఈసారి అద్భుత బౌలింగ్‌‌తో చెలరేగిపోయాడు. ముందుగా సచిన్‌‌ (45) ఆరంభానికి  రాహుల్‌‌ ద్రవిడ్‌‌, మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ హాఫ్‌‌ సెంచరీలు తోడవడంతో ఇండియా ప్రత్యర్థి ముందు 228 టార్గెట్‌‌ను ఉంచింది. అనంతరం ప్రసాద్‌‌ (9.3–2–27–5) ఐదు వికెట్ల స్పెల్‌‌తో చెలరేగడంతో పాక్‌‌ 180 రన్స్‌‌కే కుప్పకూలింది.

మేటి ఆటగాళ్ల  ఆటలో మళ్లీ మనోళ్లే..

2003 వరల్డ్‌‌కప్‌‌లో దాయాది జట్ల మ్యాచ్‌‌ ఆల్‌‌టైమ్‌‌ బెస్ట్‌‌ ప్లేయర్ల మధ్య పోరు అనొచ్చు. సచిన్‌‌, గంగూలీ, ద్రవిడ్‌‌, కుంబ్లే, సెహ్వాగ్‌‌తో ఇండియా.. ఇంజమామ్, సయీద్‌‌ అన్వర్‌‌, ఆఫ్రిదితో పాక్‌‌ అత్యంత బలమైన జట్లతో బరిలో నిలిచాయి. పాక్‌‌ తొలిసారి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేయగా.. అన్వర్‌‌ సెంచరీ సాయంతో  ఇండియా ముందు 274 రన్స్‌‌ టార్గెట్‌‌ ఉంచింది. మహా శివరాత్రి నాడు జరిగిన ఆ మ్యాచ్‌‌లో సచిన్‌‌ పాక్‌‌కు కాళరాత్రిని మిగిల్చాడు. అక్రమ్‌‌, అక్తర్‌‌ బౌలింగ్‌‌ను చిత్తు చేస్తూ 75 బాల్స్‌‌లోనే 98 రన్స్‌‌ చేయడంతో ఇండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. సచిన్‌‌తో బ్యాటింగ్‌‌ చేస్తుండగా తన ఏకాగ్రత దెబ్బతీసేందుకు  ఆఫ్రిది స్లెడ్జింగ్‌‌ చేసినా  కైఫ్​ మూడో వికెట్‌‌కు సెంచరీ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ నమోదు చేయడం విశేషం.

విరాట్‌‌ విహారం.. ఇండియా సిక్సర్‌‌

ఆస్ట్రేలియాలో  జరిగిన గత మెగా టోర్నీలో ఇండియా కప్పు గెలవకపోయినా.. పాకిస్థాన్‌‌పై వరుసగా ఆరోసారి గెలిచి సిక్సర్‌‌ కొట్టింది. అప్పటికే సచిన్‌‌ వారసుడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌‌ కోహ్లీ.. పాక్‌‌పై పంజా విసిరాడు. వరల్డ్‌‌కప్‌‌లో పాక్‌‌పై సచిన్‌‌కు కూడా సాథ్యంకాని సెంచరీని విరాట్‌‌ అందుకున్నాడు. పాక్‌‌కు చుక్కలు చూపిస్తూ కోహ్లీ సెంచరీ, ధవన్‌‌, రైనా హాఫ్‌‌ సెంచరీలు చేయడంతో  ఇండియా 300 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆపై, షమీ (4/35)విజృంభించడంతో పాక్‌‌ 224 రన్స్‌‌కే ఆలౌటై ంది.