
- నేడు పాకిస్థాన్ తో ఇండియా పోరు
- గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు
- శంకర్ అరంగేట్రం!
- మ్యాచ్ కు వర్షం ముప్పు
చరిత్ర మనదే.. రికార్డులూ మనవే.. కానీ పోరాటం ఎప్పడూ కొత్తదే..! ఘన వారసత్వం మనదే.. ఘనత వహించే ఆటగాళ్లూ మనోళ్లే.. కానీ ఉత్కంఠ మాత్రం ఎప్పుడూ తప్పనిదే..! యుద్ధానికి తీసిపోదు.. పోరాటాలకు తక్కువ కాదు.. కానీ అంతిమ ఫలితం మాత్రం ఎప్పుడూ మనదే..! ఒక్కో పరుగు అభిమానానికి ఊపిరి పోస్తుంది .. ఒక్కో బంతి ఆటగాడిని నిలువెల్లా వణికిస్తుంది .. ఒక్కో షాట్ బౌలర్లను చేష్టలుడిగేలా చేస్తుంది .. అందుకే ఆస్వాదించే ఈ క్షణాలు ప్రత్యేకం.. ఎంత చూసినా తనివితీరని ఈ నిమిషాలు అమూల్యం ..రాకరాక వచ్చే ఈ ఘడియలు అద్భుతం.. ఇండో–పాక్ పోరు అంటేనేవరల్డ్ కప్ చరిత్రలో ఓ సువర్ణాక్షరం..! గత చరిత్రకు తక్కువ కాకుండా..కురువకుండా ఉంటే వరుణుడికి కూడా ముచ్చెమటలు పట్టించే హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది..! వరుసగా ఏడో విజయంపై కన్నేసిన టీమిం డియాచేతిలో ఈసారి కూ డా దాయాదికిదరువు తప్పకపోవచ్చు..!
మాంచెస్టర్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అద్వితీయ పోరుకు సమయం ఆసన్నమైంది. మాజీల మాటల యుద్ధంలో.. వేడెక్కుతున్న విశ్లేషణల మధ్య.. మాధ్యమాలు మోతెక్కుతున్న వేళ.. అంచనాలు ఆకాశాన్ని అంటాయి.. ఆశలు అనంతాన్ని చేరాయి. క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు భోజనంలాగా.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లకే తలమానికమైన ఇండో–పాక్ పోరు మరికొద్ది గంటల్లోనే..! ఆట పరంగా, రికార్డుల పరంగా మనకంటే చాలా వెనుకబడి ఉన్న దాయాది జట్టు.. సంచలనం చేయాలని భావిస్తుంటే.. జైత్రయాత్రను పునరావృతం చేయాలని టీమిండియా కంకణం కట్టుకుంది. అయితే రెండు జట్ల వ్యూహాలు, బలం, బలహీనతలను పక్కనబెడితే.. వరుణుడు విలన్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిణామాలు ఈ మ్యాచ్‌కు ఎనలేని హైప్ తెచ్చినా.. 22 గజాల పిచ్‌లో పోరాటం చేసినోడిదే అంతిమ విజయం. అందరూ చెబుతున్నట్లుగా దీనిని మరో మ్యాచ్‌గా భావించే పరిస్థితి మాత్రం లేదు. రెండు దేశాల మధ్య పోరాటం కంటే.. యావత్ క్రికెట్‌అభిమానుల మధ్య యుద్ధం అనే భావనే ఎక్కువగా ఉంది. ఏదేమైనా గతంలో కంటే భిన్నమైన బౌలింగ్ బలంతో ఉన్న పాక్‌కు.. గతంలో ఎన్నడూ లేనంత విభిన్నంగా ఉన్న టీమిండియా బ్యాటింగ్‌కు రసవత్తర పోరు మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.
టాప్–3 చెలరేగితే..
ధవన్ గైర్హాజరీతో ఇప్పుడు టీమిండియా తుది కూర్పుపై ఆసక్తి నెలకొంది. అందులోనూ పాక్‌తో మ్యాచ్ కావడంతో ఆసక్తి రెట్టింపైంది. ఆమిర్ ఫస్ట్ స్పెల్ దాటిని తట్టుకుని రోహిత్, రాహుల్ నిలబడతారా? అన్న సందేహం ప్రతి అభిమాని మదిలో మెదులుతోంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2016 ఆసియా కప్‌లో ఆమిర్ దెబ్బకు హిట్‌మ్యాన్ కుదేలయ్యాడు. స్వింగ్, పేస్, బౌన్స్ కలయికతో దూసుకొచ్చే బంతులను పరుగులుగా మార్చాలంటే వీరిద్దరి ఫుట్‌వర్క్ అదిరిపోవాలి. సచిన్ చెప్పినట్లుగా ఆరంభం నుంచే ఆమిర్‌పై ఎదురుదాడి చేయాలన్న వ్యూహానికి కట్టుబడితే ఈ ఇద్దరూ సక్సెస్ కావొచ్చు. అదే జరిగితే టీమిండియా భారీ స్కోరు ఖాయం. వన్‌డౌన్‌లో కోహ్లీకి తిరుగులేదు. పాక్‌పై అతని రికార్డే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2015 అడిలైడ్‌లో సెంచరీతో చెలరేగిన విషయం దాయాది దేశపు అభిమానులు అంత తొందరగా మర్చిపోరు. కుర్ర బౌలర్లు హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది.. మన వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తామని చెబుతున్నారు. ఇండియా మూడంకెల స్కోరు దాటాలంటే టాప్–3 చెలరేగాల్సిందే.
4పైనే చర్చ..
రాహుల్ ఓపెనర్‌గా వెళ్లడంతో ఇప్పుడు మిడిలార్డర్‌లో 4వ స్థానంపై చర్చ మొదలైంది. ఈ స్థానం కోసం దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ మధ్య పోటీ నెలకొంది. గత రెండు మూడు రోజులుగా శంకర్.. అందరికంటే ముందు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. కాబట్టి మేనేజ్‌మెంట్ అతని వైపే మొగ్గొచ్చు. అయితే వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఓవర్లు కుదిస్తారు. ఆ టైమ్‌లో ఒత్తిడిని జయించాలంటే అనుభవజ్ఞుడు కార్తీక్ ఉండటం చాలా ఉపయోగం. ఒకవేళ ఫుల్‌లెంగ్త్ మ్యాచ్ అయితే శంకర్‌కు ఓటేయొచ్చు. మేఘావృత వాతావరణంలో అతని సీమ్ బౌలింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఎవరు ఎలా చెలరేగినా.. ఈ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ఆల్ సెషన్స్’ ధోనీ అల్టిమెట్ ట్రంప్ కార్డ్. వికెట్ల వెనుకాల ఉండి అతను వేసే ప్రతి వ్యూహం.. పాక్‌కు పీడకలగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. మహీతో కలిసి కేదార్, హార్దిక్ ఫినిషింగ్ బాధ్యతలు పంచుకోవచ్చు. టాప్‌లో ఎవరైనా నిరాశపర్చినా.. మిడిల్‌లో ఒకరిద్దరు కుదురుకున్నా.. భారీ స్కోరు ఖాయం.
షమీ వస్తాడా?
సీమింగ్ కండిషన్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను దీటుగా ఎదుర్కొంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుంటే ఎక్స్ట్రా పేసర్‌గా షమీకి అవకాశం దక్కొచ్చు. కానీ దీనికి కోహ్లీ మొగ్గు చూపకపోవచ్చు. మణికట్టు మంత్రంతో పాక్‌ను ఉచ్చులో బిగించాలంటే.. కుల్చా జోడీ ఉండాల్సిందే. ఎక్స్‌ట్రీమ్ కండీషన్‌లో షమీని తీసుకురావాలంటే.. ఓ బ్యాట్స్‌మన్‌ను తగ్గించుకోవాలి. దీనికి శాస్త్రి ఒప్పుకోకపోవచ్చు. భారీ టార్గెట్‌ను నిర్దేశిస్తే.. బౌలర్లపై పెద్దగా ఒత్తిడి ఉండదు. అందులోనూ పాక్ బ్యాటింగ్ లైనప్‌లో ఎలాగూ నిలకడ ఉండదు. కాబట్టి ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడే చాన్స్ ఉంది. ఐదో బౌలర్ కోటాను హార్దిక్, కేదార్, శంకర్ పూర్తి చేస్తారు. ఆరంభంలోనే బుమ్రా.. ఫకర్‌కు చెక్ పెడతాడని ఆశిస్తున్నారు. భువనేశ్వర్ ఆఫ్ స్టంప్ లైన్‌ను దొరికించుకుంటే.. బాబర్ ఆజమ్ చేష్టలుడిగిపోవాల్సిందే. హఫీజ్‌ను దెబ్బకొట్టడానికి హార్దిక్ కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ మెరిస్తే ఈ మ్యాచ్‌లో విరాట్‌సేన విజయం నల్లేరు మీద నడకే.
నిలకడేమి సమస్య..
ఇండియాతో మ్యాచ్ అంటే పాకిస్థాన్‌కు ఎప్పుడూ కసే. టోర్నీల్లో ఎన్ని మ్యాచ్‌లు ఓడినా.. టీమిండియాపై గెలిస్తే చాలు అనుకునే అభిమానులకు లెక్కలేదు. వాళ్లను సంతృప్తి పరిచేందుకైనా పాక్ ఈ మ్యాచ్‌లో తెగింపు చూపెడుతుంది. అయితే పాత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఇండియాపై గెలువడం అంత సులువు కాదనే విషయం తెలుసు. ఇటీవల ఆడిన 13 మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్ బృందం 12 మ్యాచ్‌ల్లో ఓడింది. లాస్ట్ వీక్ ఇంగ్లండ్‌పై గెలిచి ఊరట చెందినా ఆసీస్ చేతిలో ఓడి పాత పాటే అందుకుంది. బ్యాటింగ్‌లో నిలకడలేమి పాక్‌కు ఉన్న అతిపెద్ద సమస్య. టాప్–3 బ్యాట్స్‌మెన్ యావరేజ్ 50కి పైగా ఉన్నా.. ఫఖర్ జమాన్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది. బాబర్ ఆజమ్, ఇమాముల్, హఫీజ్‌పై భారీ ఆశలున్నాయి. వెటరన్ షోయబ్ మాలిక్ మెరిస్తే కొద్దొగొప్పో స్కోరును ఆశించొచ్చు. అయితే అతను తుది జట్టులో ఉంటాడో లేడో తెలియని పరిస్థితి. పేస్ అటాక్‌లో ఆమిర్ బలంగా కనిపిస్తున్నాడు. ఇతనికి సహకారం అందించేందుకు షాదాబ్ ఖాన్‌ను రంగంలోకి దించుతున్నారు. రియాజ్ కూడా చెలరేగితే కష్టాలే. షాహిన్ షా ఆఫ్రిదికి ఇండియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే పరిస్థితి లేదన్నది వాస్తవం. అయితే తమదైన రోజున ఎంత పెద్ద ప్రత్యర్థినైనా ఓడించడం పాక్ లక్షణం. మొన్న ఇంగ్లండ్‌పై గెలుపే ఇందుకు నిదర్శనం.
ఈ మ్యాచ్ మేం బాగా ఆడినా, ఆడకపోయినా.. అక్కడితోనే అంతా ముగిసిపోదు.టోర్నమెంట్ ముం దుకు సా గుతుంది . మా ఫోకస్ మరింత పెద్ద లక్ష్యంపై ఉంటుంది .మా జట్టులో ఏ ఒక్కరూ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం లేదు. పదకొండు మంది బాధ్యతను పంచుకుం టారు. వాతావరణం ఎవరి చేతుల్లో ఉండదు. మ్యాచ్ ఎంతసేపుసాగుతుందో తెలియదు. దాన్ని బట్టి మేం ఏంచేయాలో అందుకు మా నసికంగాసిద్ధంగా ఉండాల్సిందే. –విరాట్ కోహ్లీ
జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, విజయ్ శంకర్, ధోనీ, జాదవ్, హార్దిక్, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
పాకిస్థాన్: సర్ఫరాజ్ (కెప్టెన్), ఇమాముల్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, హఫీజ్, హారిస్ సోహైల్, షోయబ్ మాలిక్ / ఆసిఫ్ అలీ / ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, వాహబ్ రియాజ్, ఆమిర్, షాహిన్ షా ఆఫ్రిది.