WCL 2025: పాకిస్తాన్‌తో సెమీఫైనల్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఇండియా ఛాంపియన్స్

WCL 2025: పాకిస్తాన్‌తో సెమీఫైనల్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఇండియా ఛాంపియన్స్

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చాలామంది భారత ఆటగాళ్లు పాకిస్థాన్ తో మ్యాచ్ బహిష్కరించాలని కోరుకుంటున్నారని సమాచారం. గ్రూప్ దశలో పాకిస్థాన్ తో ఇండియా ఆడడానికి నిరాకరించడంతో మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శిఖర్ ధవన్ సహా పలువురు ఇండియా వెటరన్ ప్లేయర్లు పాకిస్థాన్ తో లీగ్ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

సెమీ ఫైనల్ అయినప్పటికీ తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని భారత మాజీ క్రికెటర్లు తెలిపారట. గురువారం (జూలై 31) బర్మింగ్ హోమ్ వేదికగా ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్ల మధ్య సెమీస్ ఫైనల్ జరగనుంది. అయితే, మ్యాచ్ ముందు రోజు భారత జట్టు స్పాన్సర్‌లలో ఒకరైన ఈజ్‌మైట్రిప్ ఉగ్రవాదం, క్రికెట్ కలిసి ఉండలేవని చెబుతూ సెమీ ఫైనల్ నుంచి వైదొలిగింది. కంపెనీ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నందుకు ఇండియా ఛాంపియన్‌లను తాము అభినందిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ పాల్గొన్న మ్యాచ్‌లతో సంబంధం కలిగి ఉండటానికి తాము ఇష్టపడటం లేదని అన్నారు.

ALSO READ : WCL 2025: రేపే చిరకాల ప్రత్యర్థుల సెమీస్ ఫైట్.. పాకిస్థాన్‌తో ఇండియా ఆడకపోతే పరిస్థితి ఏంటి..?

కొన్ని రోజుల క్రితమే టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ పాకిస్థాన్ తో నాకౌట్ మ్యాచ్ అయినా ఆడేది లేదని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు. రూల్స్ ప్రకారం.. ఇండియా ఛాంపియన్స్ సెమీ-ఫైనల్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో ఆడటానికి నిరాకరిస్తే మొహమ్మద్ హఫీజ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుకు వాకోవర్ లభిస్తుంది. దీంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇండియా ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం లేనందున పాకిస్థాన్ ఛాంపియన్స్ సెమీస్ ఆడకుండానే ఫైనల్లో అడుగు పెట్టబోతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మరో సెమీస్ జరుగుతుంది.