విశాఖ వీరులెవరో ? సౌతాఫ్రికాతో ఇండియా మూడో వన్డే.. రోహిత్, కోహ్లీపైనే ఆశలు

విశాఖ  వీరులెవరో ? సౌతాఫ్రికాతో ఇండియా మూడో వన్డే.. రోహిత్, కోహ్లీపైనే ఆశలు
  • సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టిన ఆతిథ్య జట్టు
  • రోహిత్, కోహ్లీపైనే ఆశలు 
  • డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకాపై సఫారీ కన్ను 
  • మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌

విశాఖపట్నం: లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై మళ్లీ అందరి దృష్టి ఉండగా.. ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. చెరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నెగ్గి సమంగా ఉన్న ఇరు జట్లు వైజాగ్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో శనివారం సిరీస్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తేల్చే మూడో, ఆఖరి వన్డేలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌ను కోల్పోయిన టీమిండియా  సొంతగడ్డపై వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ను కూడా చేజార్చుకోకూడదనే పట్టుదలతో ఉంది. మరోవైపు, రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ టార్గెట్ ఛేజ్ చేసిన జోరులో ఉన్న  సౌతాఫ్రికా జట్టు ఇండియా గడ్డపై అరుదైన రికార్డును నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది.

1986-87లో పాకిస్తాన్ తర్వాత మరో జట్టు ఇండియాలో టెస్టు, వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ రెండింటినీ ఒకే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెగ్గలేదు. నాడు పాక్‌‌‌‌‌‌‌‌ టెస్టుల్లో 1-0తో, వన్డేల్లో 5-1తో ఇండియాను ఓడించింది. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత సౌతాఫ్రికాకు అలాంటి అరుదైన డబుల్ ధమాకా సాధించే సువర్ణావకాశం లభించింది. మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియా ఓడిపోతే సొంతగడ్డపై ఘోర పరాభవంగా చరిత్రలో నిలిచిపోతుంది. అది జరగకూడదంటే రాయ్‌‌‌‌‌‌‌‌పూర్ రెండో వన్డేలో చేసిన తప్పిదాలను ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ చేయకూడదు.

జైస్వాల్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌పై టెన్షన్‌‌‌‌‌‌‌‌.. బరిలోకి తిలక్‌‌‌‌‌‌‌‌!
వైజాగ్‌‌‌‌‌‌‌‌లో కింగ్ కోహ్లీ.. రోహిత్‌‌‌‌‌‌‌‌పై భారీ అంచనాలున్నాయి. ఇండియా బ్యాటింగ్ భారాన్ని ఈ సీనియర్లు మోయాల్సిందే. వైజాగ్ స్టేడియం కోహ్లీ అడ్డా. ఇక్కడ ఆడిన వన్డేల్లో తనకు ఏకంగా 97.83 సగటు ఉంది. ఇక, కోహ్లీ తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 సార్లు వెంటవెంటనే రెండు సెంచరీలు చేసినా... ఒక్కసారి కూడా హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ సెంచరీ అందుకోలేకపోయాడు.  ప్రస్తుతం అద్భుత ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అతను  వైజాగ్‌‌‌‌‌‌‌‌లో ఈ  రికార్డు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక, తన అమ్మమ్మ ఊరైన వైజాగ్‌‌‌‌‌‌‌‌లో హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌కు కూడా మంచి రికార్డుంది. తొలి వన్డే మాదిరిగా మరోసారి ‘రోకో’ షో వస్తే జట్టుకు సగం కష్టాలు తప్పినట్టే.  గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీతో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్, వరుసగా రెండు ఫిఫ్టీలు కొట్టిన కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి కీలకం కానున్నారు.  అయితే, బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 సార్లు లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఔటైన అతను ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ -స్టంప్ బాల్స్‌‌‌‌‌‌‌‌ ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు.

వరుసగా రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలైన జైస్వాల్ ఈ కీలక పోరులోనూ నిరాశపరిస్తే తన వన్డే కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ప్రమాదం తప్పదు.  బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా చాలా మెరుగవ్వాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు అందించినా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. రాంచీలో చచ్చీచెడి గెలిచినా.. రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేలిపోయారు. ముఖ్యంగా  ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా రన్స్ నియంత్రించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మిడిలార్డర్ బలోపేతం కోసం స్పిన్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెస్ట్ ఇచ్చి తిలక్ వర్మను బరిలోకి దించే చాన్సుంది. ఏదేమైనా  రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, బౌలింగ్, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌లో లోపాలను సరిదిద్దుకుంటేనే ఇండియాకు విజయం దక్కుతుంది. 

సఫారీలకు గాయాల బెడద
వరుసగా రెండో సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురిపెట్టిన సౌతాఫ్రికాను గాయాలు వేధిస్తున్నాయి. రెండో వన్డేలో గాయపడిన పేసర్ బర్గర్, ఓపెనర్ టోనీ డిజార్జి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి స్థానాల్లో ఒట్నిల్ బార్ట్‌‌‌‌‌‌‌‌మన్, ర్యాన్ రికెల్టన్ తుది జట్టులోకి రావొచ్చు. 

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ చాలా బలంగా ఉంది. రాయ్‌‌‌‌‌‌‌‌పూర్ సెంచరీ హీరో మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌తో పాటు బ్రీట్జ్​కే, డెవాల్డ్‌‌‌‌‌‌‌‌ బ్రెవిస్‌‌‌‌‌‌‌‌ను ఎంత త్వరగా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరిస్తే ఇండియాకు అంత మంచిది. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కో యాన్సెన్ సఫారీ  జట్టుకు కొండంత బలం. అతను మరోసారి టీమిండియాకు సవాల్ విసరనున్నాడు. 

తుది జట్లు (అంచనా):
ఇండియా: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, రుతురాజ్, రాహుల్ (కెప్టెన్/కీపర్), తిలక్ వర్మ/సుందర్, జడేజా, కుల్దీప్, హర్షిత్ రాణా, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ.
సౌతాఫ్రికా: మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, డికాక్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), బవూమ (కెప్టెన్), బ్రీట్జ్‌‌‌‌‌‌‌‌కే, రికెల్టన్, బ్రెవిస్, యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్‌‌, ఎంగిడి, బార్ట్‌‌‌‌‌‌‌‌మన్.

టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే!
ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రెండు జట్ల తలరాతను టాస్‌‌‌‌‌‌‌‌, మంచు శాసించే అవకాశం ఉంది. మంచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ ఉన్న  వైజాగ్‌‌‌‌‌‌‌‌లో సాయంత్రం వేళల్లో  తేమ ఎక్కువగా వల్ల రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు బాల్‌‌‌‌‌‌‌‌పై పట్టు దొరకడం కష్టమవుతుంది. 

34వ ఓవర్ తర్వాత ఒకే బాల్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తుండటంతో,  పాత బాల్‌‌‌‌‌‌‌‌ మంచులో తడిసి బౌలర్లకు ఏమాత్రం సహకరించదు. ఇక, గత 20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో టాస్ కోల్పోయిన ఇండియా ఈసారైనా టాస్ గెలిచి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటుందో  లేదో వేచి చూడాలి. వైజాగ్‌‌‌‌‌‌‌‌లో శనివారం వర్ష సూచన లేదు.