కోహ్లీసేనకు ఎదురుందా!..ఇవాళ వెస్టిండీస్ తో ఫస్ట్ వన్డే

కోహ్లీసేనకు ఎదురుందా!..ఇవాళ వెస్టిండీస్ తో ఫస్ట్ వన్డే

చెన్నైటెస్ట్‌‌లు, టీ20ల్లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా దాదాపు నాలుగు నెలల తర్వాత వన్డే సమరానికి రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం జరిగే ఫస్ట్‌‌ వన్డేలో వెస్టిండీస్‌‌తో తలపడనుంది. ఇరుజట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుండగా.. మ్యాచ్‌‌ వేదికైన చెన్నైలో గడిచిన 48 గంటల్లో కురిసిన వర్షాలు కాస్త కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో చివరిగా సొంతగడ్డపై వన్డే ఆడిన కోహ్లీ సేన.. ఆగస్టులో జరిగిన కరీబియన్‌‌ టూర్‌‌లో విండీస్‌‌పై సిరీస్‌‌ గెలిచింది. ఈ సిరీస్‌‌లోనూ గెలిస్తే విండీస్‌‌పై వరుసగా పది వన్డే సిరీస్‌‌లు నెగ్గిన రికార్డు ఇండియా సొంతమవుతుంది. అంతేకాక ఈ ఏడాదికి అదిరిపోయే ఫినిషింగ్‌‌ ఇచ్చినట్లు అవుతుంది.

బ్యాటింగే బలం..

ఎప్పటిలాగే ఈ సిరీస్‌‌లోను టీమిండియా బ్యాటింగ్‌‌నే నమ్ముకుంది. గాయం కారణంగా రెగ్యులర్‌‌ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ జట్టుకు దూరం కావడంతో లోకేశ్‌‌ రాహుల్‌‌.. రోహిత్‌‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించనున్నాడు. వన్‌‌డౌన్‌‌లో కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ వస్తాడు. ముంబైలో జరిగిన టీ20లో ఈ ముగ్గురు ఫుల్‌‌ఫామ్‌‌ చూపెట్టడంతో  టాపార్డర్‌‌ చాలా బలంగా కనిపిస్తోంది. ధవన్‌‌కు రిప్లేస్‌‌మెంట్‌‌గా టీమ్‌‌లోకి వచ్చిన మయాంక్‌‌ అగర్వాల్‌‌ బెంచ్‌‌కు పరిమితం కావాల్సిందే. అయితే ఓసారి ఓపెనర్‌‌గా, మరోసారి మిడిలార్డర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా వస్తున్న రాహుల్‌‌..  జట్టులో తన ప్లేస్‌‌ను సుస్థిరం చేసుకునేందుకు ఇది మరో అవకాశం. టీ20 సిరీస్​లో రెండు మ్యాచ్‌‌ల్లో అద్భుతంగా ఆడిన అతను అదే ఫామ్‌‌ను కొనసాగిస్తే తిరుగుండదు.  శ్రేయస్‌‌ అయ్యర్‌‌ నాలుగో స్థానంలో రానుండగా, వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌పైనే మరోసారి అందరి దృష్టి నెలకొంది. ఎన్ని అవకాశాలిచ్చినా వరుసగా ఫెయిలవుతున్న పంత్‌‌.. ఈ సిరీస్‌‌లోనైనా కెప్టెన్‌‌ నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూడాలి. ఇక, పేస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ కోటాలో ఈ మ్యాచ్‌‌తో శివం దూబే వన్డే అరంగేట్రం చేయనున్నాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ టీమ్‌‌లోకి వచ్చిన  కేదార్‌‌ జాదవ్‌‌కు తుదిజట్టులో ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా నుంచి పోటీ ఉంది. జాదవ్‌‌ కూడా పార్ట్‌‌టైమ్‌‌ స్పిన్నర్‌‌గా పనికొస్తాడు కాబట్టి మేనేజ్‌‌మెంట్‌‌ ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

భువీ ఔట్‌‌.. శార్దూల్‌‌ ఇన్‌‌

టీ20 సిరీస్‌‌తో టీమ్‌‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పేసర్‌‌ భువనేశ్వర్‌‌ గాయంతో వన్డేలకు దూరమయ్యాడు. దీంతో భువీకి రిప్లేస్‌‌మెంట్‌‌గా శార్దూల్‌‌ ఠాకూర్‌‌ను తీసుకున్నారు. అయితే చెన్నై వికెట్‌‌ స్పిన్‌‌కు అనుకూలించే చాన్స్‌‌ ఎక్కువగా ఉండడంతో ఠాకూర్‌‌కు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో చోటు దక్కడం అనుమానమే. దీపక్‌‌ చహర్‌‌, మహ్మద్‌‌ షమీ పేస్‌‌ భారం మోయనున్నారు. థర్డ్‌‌ పేసర్‌‌గా ఆల్‌‌రౌండర్‌‌ దూబే వారికి అండగా నిలవనున్నాడు. ఇక, వరల్డ్‌‌కప్‌‌ తర్వాత తొలిసారిగా కుల్చా(కుల్దీప్‌‌, చహల్‌‌) జోడీ ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగనుంది.

పొలార్డ్‌‌పైనే భారం..

టీ20 స్పెషలిస్ట్‌‌లతో నిండిన విండీస్‌‌ జట్టు.. కెప్టెన్‌‌ కీరన్‌‌ పొలార్డ్‌‌ను నమ్ముకుని ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగుతుంది. ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌కు పోకుండా స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ ఇటీవల అఫ్గానిస్థాన్‌‌పై వన్డే సిరీస్‌‌ గెలిచిన విండీస్‌‌.. ఈ సిరీస్‌‌లోనూ అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని అనుకుంటుంది. అయితే ముంబై టీ20లో ఫీల్డింగ్‌‌ చేస్తూ గాయపడిన ఓపెనర్‌‌ ఎవిన్‌‌ లూయిస్‌‌ అందుబాటుపై ఆ జట్టు ఆందోళనలో ఉంది. లూయిస్‌‌ విషయంలో చివరి నిమిషం దాకా క్లారిటీ వచ్చేలా లేదు. దీంతో సునీల్‌‌ ఆంబ్రిస్‌‌, బ్రెండన్‌‌ కింగ్‌‌లో ఒకరు షై హోప్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించొచ్చు. షైహోప్‌‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉండడం కలిసొచ్చే అంశం. హెట్‌‌మయర్‌‌, నికోలస్‌‌ పూరన్‌‌తోపాటు కెప్టెన్‌‌ పొలార్డ్‌‌తో బ్యాటింగ్‌‌ లైనప్‌‌ బలంగానే ఉంది. వీరికి తోడుగా ఆల్‌‌రౌండర్‌‌ రోస్టన్‌‌ ఛేజ్‌‌ కీలకం కానున్నాడు. అయితే వీళ్లంతా క్రీజులో ఎంత సేపు ఓపిగ్గా ఉంటారనే దానిపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. వీళ్లలో ఏ ఒక్కరు క్రీజులో పాతుకుపోయినా.. స్లాగ్‌‌ ఓవర్లలో ఇండియా బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. బౌలింగ్‌‌లోనూ విండీస్‌‌ లైనప్‌‌ బలంగానే కనిపిస్తోంది. స్పిన్నర్లు హేడెన్‌‌ వాల్ష్‌‌, పైర్‌‌ టీ20 సిరీస్‌‌లో ఫర్వాలేదనిపించారు. కాట్రెల్‌‌, కిమో పాల్‌‌, షెపర్డ్‌‌, అల్జారీ జోసెఫ్‌‌తో పేస్‌‌ అటాక్‌‌ కూడా బాగానే ఉంది. అయితే ఇండియా బ్యాట్స్‌‌మెన్‌‌ను ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరం.