కరీబియన్లనూ కొట్టేస్తే సెమీస్ కు చేరువైనట్లే

కరీబియన్లనూ కొట్టేస్తే సెమీస్ కు చేరువైనట్లే
  • ధోనీ బ్యాటింగ్‌ పై అందరి దృష్టి
  •  పరువు కోసం విండీస్​ ఆరాటం

ఇప్పటివరకు వరల్డ్‌‌కప్‌‌లో ఇండియాకు అంతా మంచే జరిగింది. ఒకటి, రెండు విఫలమైనా.. మిగిలిన అస్త్రాలన్నీ బాగానే పని చేశాయి. అనుకున్నట్లుగానే విజయాలు కూడా దక్కాయి. కానీ.. రాబోయే పది రోజులు మాత్రం విరాట్‌‌సేనకు అత్యంత కీలకం. ఎందుకంటే ఇంగ్లండ్‌‌తో సహా నాలుగు కీలక మ్యాచ్‌‌లు ఆడాల్సి ఉంది. సెమీస్‌‌ బెర్త్‌‌ దక్కాలంటే ఇందులో కనీసం రెండు మ్యాచ్‌‌లైనా గెలవాలి. ఏ ఒక్కదాంట్లో ఓడినా పరిస్థితులు తలకిందులవుతాయి. దీనికితోడు ఆటగాళ్లు గాయాలబారిన పడకుండా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో నేడు వెస్టిండీస్‌‌తో జరిగే మ్యాచ్‌‌.. టీమిండియాకు అతి ముఖ్యమైంది. ఇందులో గెలిస్తే దాదాపుగా సెమీస్‌‌కు చేరువైనట్లే..! అయితే.. ఇప్పటికే నాకౌట్‌‌ రేసుకు దూరమైన విండీస్‌‌.. పోతుపోతూ ఎవర్నో ఒకర్ని దెబ్బతీయాలని భావిస్తున్న తరుణంలో అలసత్వం వహిస్తే.. టీమిండియాకు ముప్పు తప్పదు..!

మాంచెస్టర్‌‌: ప్రపంచకప్‌‌లో మరో అసక్తికర పోరు. 9 పాయింట్లతో టేబుల్‌‌లో మూడో స్థానంలో ఉన్న టీమిండియా.. గురువారం జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో వెస్టిండీస్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 36 ఏళ్ల కిందట ఇదే గడ్డపై కరీబియన్లను ఓడించి తొలి వరల్డ్‌‌కప్‌‌ను ఒడిసిపట్టుకున్న ఇండియా.. ఆ మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోవాలని భావిస్తున్నది. ఆ క్రమంలో ఫేవరెట్‌‌ హోదాకు న్యాయం చేస్తూ విజయంతో సెమీస్‌‌ బెర్త్‌‌ ను సాఫీగా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్‌‌లో టీమిండియాకు ఎదురులేదన్నది వాస్తవం. కానీ మైదానంలో ఎప్పుడు ఎలా ఆడుతుందో  తెలియని కరీబియన్లు.. బలమైన బౌలింగ్‌‌తో విరాట్‌‌ వీరులను కట్టడి చేయాలని చూస్తున్నారు. తద్వారా టీమిండియా సెమీస్‌‌ అవకాశాలను క్లిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షం ముప్పు కూడా లేదు కాబట్టి.. విండీస్‌‌ బౌలింగ్‌‌, ఇండియా బ్యాటింగ్‌‌ మధ్య రసవత్తర పోరాటం జరగడం ఖాయం.

ధోనీపై ఆందోళన

ప్రసుత్తం టీమ్‌‌ఇండియా లైనప్‌‌ బయటకు బలంగా కనిపిస్తున్నా.. మిడిల్‌‌ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అఫ్గాన్‌‌తో మ్యాచ్‌‌లో ఎదురైన ఒత్తిడిని మిడిలార్డర్‌‌ అధిగమించలేకపోయింది. దీంతో కష్టంగా ఆ మ్యాచ్‌‌లో గట్టెక్కాం. ముఖ్యంగా మాజీ కెప్టెన్‌‌ ధోనీ ఫెర్ఫామెన్స్‌‌ అనుకున్న స్థాయిలో లేదు. ఐపీఎల్‌‌లో చెలరేగిన మహీ.. 50 ఓవర్ల ఫార్మాట్‌‌లో తేలిపోతున్నాడు. రెండో పవర్‌‌ప్లేలో భారీగా పరుగులు రాబట్టడంలో ఈ జార్ఖండ్‌‌ డైనమెట్‌‌ ఇబ్బందులుపడుతున్నాడు. అఫ్గాన్‌‌పై 52 బాల్స్‌‌ ఆడి 28 రన్స్‌‌ చేయడమే ఇందుకు ఉదాహరణ. మహీ ఆటతీరుపై మాజీలతో పాటు సచిన్‌‌ కూడా విమర్శించాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు దినేశ్‌‌ కార్తీక్‌‌కు అవకాశం ఇవ్వకపోయినా.. ధోనీ బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ మార్చడంపై టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ దృష్టిపెడితే బాగుంటుంది. లీగ్‌‌ దశలో నాలుగే మ్యాచ్‌‌లు ఉన్నాయి.  కాబట్టి నాకౌట్‌‌ పోరును దృష్టిలో పెట్టుకుని కేదార్‌‌ను బ్యాటింగ్‌‌లో ప్రమోట్‌‌ చేయాలి. హార్దిక్‌‌ ఫ్లోటర్‌‌గా ఉపయోగపడుతున్నా.. అతనికి సహకారం అందించే వారు కరువయ్యారు.

మహీ, కేదార్‌‌ స్లోగా ఆడటం వల్ల పాండ్యాపై ఒత్తిడి పెరుగుతున్నది. పవర్‌‌ హిట్టింగ్‌‌ కోసం రిషబ్‌‌ను ఆడించడంపై కోహ్లీ, శాస్త్రి ఆలోచన చేయడం లేదు. ఒకవేళ శంకర్‌‌ను పక్కనబెట్టి నాలుగో స్థానంలో పంత్‌‌ను తీసుకోవాలన్న ఆలోచన చేస్తే మాత్రం అది సాహసోపేత నిర్ణయంగా చెప్పొచ్చు. అయితే విండీస్‌‌లో పేస్‌‌ బౌలర్లు ఎక్కువ కాబట్టి ధోనీకి ఈ మ్యాచ్‌‌లో స్ట్రయిక్‌‌ రొటేషన్‌‌ ఈజీ కావొచ్చు. కానీ స్లో బౌలర్లు ఎదురైతే మాత్రం మళ్లీ కష్టాలు తప్పవు. వికెట్ల వెనుకాల కీపింగ్‌‌ నైపుణ్యం, ఫీల్డ్‌‌ సెటప్‌‌, బౌలర్లకు, కోహ్లీకి సలహాలు.. ఇలాంటి అంశాలను తీసుకుంటే మహీ మ్యాచ్‌‌లో ఉండటం చాలా ముఖ్యం. వీటన్నింటిని పక్కనబెడితే  ధోనీ సూపర్‌‌ ఫినిషింగ్‌‌ను చూడాలంటే అతన్ని స్వేచ్చగా ఆడనివ్వాలి. భువనేశ్వర్‌‌  అందుబాటులోకి రావడంతో  బౌలింగ్‌‌ కూర్పుపై కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో హ్యాట్రిక్‌‌ తీసిన షమీని కొనసాగిస్తారా? లేక భువీని తీసుకుంటారా? చూడాలి. రిస్క్‌‌ తీసుకోవద్దని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తే షమీ ఉంటాడు.  బుమ్రా, కుల్దీప్‌‌ స్థానాలు పదిలం. చహల్‌‌ స్థానంలో జడేజా వచ్చే అవకాశాలున్నాయి.  ఐదో బౌలర్‌‌ కోటా హార్దిక్‌‌, కేదార్‌‌, శంకర్‌‌ పంచుకుంటారు.

గెలుపే టార్గెట్‌‌..

మరోవైపు లీగ్‌‌ తొలి మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌‌పై దుమ్మురేపిన విండీస్‌‌.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌‌ల్లో పెద్దగా రాణించలేదు. స్టార్లు అందుబాటులో ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఆడిన ఆరు మ్యాచ్‌‌ల్లో నాలుగు పరాజయాలతో నాకౌట్‌‌ బెర్త్‌‌ను దూరం చేసుకుంది. తొడ కండరాల గాయంతో ఆల్‌‌రౌండర్‌‌ రసెల్‌‌ టోర్నీకి దూరం కావడం కూడా విండీస్‌‌కు ప్రతికూలంగా మారింది. ఎలాగూ సెమీస్‌‌ చేరే అవకాశం లేదు కాబట్టి టోర్నీ ముగింపైనా ఘనంగా ఉండాలని కరీబియన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇప్పట్నించి ఆడే ప్రతి మ్యాచ్‌‌లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. విండీస్‌‌ పేస్‌‌ బౌలింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. యువ పేసర్లు షెల్డన్‌‌ కోట్రెల్‌‌, ఒషానే థామస్‌‌ అద్భుతాలు చేస్తున్నారు. వీళ్లిద్దరు షార్ట్‌‌ బాల్స్‌‌ వ్యూహానికి కట్టుబడితే రోహిత్, కోహ్లీకి గట్టిపోటీ తప్పదు. భారీ ఆశలు పెట్టుకున్న క్రిస్‌‌ గేల్‌‌ భారీ ఇన్నింగ్స్‌‌పై దృష్టిపెట్టాడు.  అయినా గేల్‌‌కు బుమ్రా నుంచి ముప్పు పొంచి ఉంది. హోప్‌‌, హెట్‌‌మయర్‌‌పై అంచనాలున్నా.. కుల్చా ద్వయాన్ని ఎలా ఆడతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కివీస్‌‌పై చెలరేగిన బ్రాత్‌‌వైట్‌‌ దానిని కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.