భారతీయులు రష్యా ఆర్మీలో చేరొద్దు.. అదొక డేంజర్ కోర్సు..: మంత్రిత్వ శాఖ హెచ్చరిక..

భారతీయులు రష్యా ఆర్మీలో చేరొద్దు.. అదొక డేంజర్ కోర్సు..: మంత్రిత్వ శాఖ హెచ్చరిక..

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కొన్ని నెలలుగా జరుగుతున్న సంగతి మీకు తెలిసిందే.  అయితే  ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లిన భారతీయుల్లో కొందరు రష్యన్ సైన్యంలో చేరారని వార్తలు రావడంతో, ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖను ప్రశ్నించిగా, భారత పౌరులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. భారత పౌరులు రష్యన్ సైన్యంలో చేరకూడదని,  అదొక ప్రమాదకరమైన కోర్సు అని హెచ్చరించింది. 

నిజానికి, ప్రతి సంవత్సరం లక్షల మంది భారతదేశం నుండి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తుంటారు. అందులో రష్యా కూడా ఒక దేశం. వీరిలో కొంతమందికి రష్యన్ సైన్యంలో చేరడానికి ఆఫర్లు వస్తున్నాయి. ఇంకా, మంచి జీతం కూడా వస్తుందని నమ్మిస్తున్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా రష్యాకు ఇప్పుడు ఎక్కువమంది సైనికులు అవసరం, ఎందుకంటే రష్యా దేశంలోని యువత సైన్యంలో చేరడానికి ఇష్టపడటం లేదు. దింతో ఉద్యోగాల కోసం రష్యా వెళ్లే భారతీయులకి మాయమాటలు చెప్పి రష్యన్ సైన్యంలో చేర్చుకుంటున్నారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే : రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకం గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారతీయులు రష్యన్ సైన్యంలో చేరకూడదని, ఈ మధ్య రష్యన్ సైన్యంలో భారతీయ పౌరుల నియామకం గురించి వార్తలు చూశాను అని అన్నారు. చాల సందర్భాల్లో ప్రభుత్వం ఇలాంటి వాటిలో ఉన్న ప్రమాదాలను హైలైట్ చేసి, భారత పౌరులను హెచ్చరించిందన్నారు.

ఢిల్లీ, మాస్కోలోని రష్యన్ అధికారులతో కూడా మేము ఈ విషయాన్ని చర్చించాము. ఈ పద్ధతిని ఆపేసి మా పౌరులను విడుదల చేయాలని కోరాము. రష్య సైన్యంలో చేరిన  భారతీయ పౌరుల కుటుంబాలతో కూడా మేము సంప్రదిస్తున్నాము అని MEA ప్రతినిధి అన్నారు. విదేశాలలో జాబ్ ఆఫర్లను ఒప్పుకోవద్దని కూడా భారతీయులను హెచ్చరించాము, రష్యన్ సైన్యంలో చేరడానికి వచ్చే ఏ ఆఫర్‌కైనా దూరంగా ఉండాలని కోరుతున్నామన్నారు.