స్వదేశంలో ఏ జట్టయినా కింగే. ముఖ్యంగా టెస్టుల్లో ఆతిధ్య జట్టుకు తిరుగుండదు. బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియా వరకు సొంతగడ్డపై అన్ని జట్లు చెలరేగిపోతాయి. ఇక ఈ విషయంలో భారత క్రికెట్ జట్టు అందరికంటే ఒక అడుగు ముందుకే ఉంటుంది. టీమిండియాతో స్వదేశంలో మ్యాచ్ అంటే సిరీస్ కు ముందు ప్రత్యర్థి సగం ఆశలు వదులుకుంటుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది. మ్యాచ్ లు ఓడిపోవడం అలవాటు చేసుకున్న మన జట్టు.. అదే పనిగా సిరీస్ లు కూడా చేజార్చుకుంటుంది. దీనికి తోడు భారీ పరాజయాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సొంతగడ్డపై ఇలాంటి ప్రదర్శన ఊహించనిది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి కావడం విచారకరం. విదేశాల్లో ఇలాంటి పరాజయాన్ని పట్టించుకోక పోయినా స్వదేశంలో మాత్రం ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ను కలవరానికి గురి చేస్తోంది. నిన్నటివరకు టెస్ట్ క్రికెట్ లో టీమిండియాకు అతి పెద్ద ఓటమి 342 పరుగులతో ఓడిపోవడం. 2004లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా విధించిన 543 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్నపుడు ఇండియా 200 పరుగులకే ఆలౌటైంది. దీంతో 342 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఇండియా 408 పరుగులతో ఓడిపోయి ఈ చెత్త రికార్డ్ ను బ్రేక్ చేసింది.
టెస్ట్ క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్‌కు అతిపెద్ద ఓటములు
2025లో సౌతాఫ్రికాపై 408 పరుగులు
2004లో ఆస్ట్రేలియాపై 342 పరుగులు
2006లో పాకిస్థాన్‌పై 341 పరుగులు
2007లో ఆస్ట్రేలియాపై 337 పరుగులు
2017లో ఆస్ట్రేలియాపై 333 పరుగులు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఘోరంగా ఓడింది. ఐదో రోజు ముగిసిన ఈ టెస్టులో సఫారీలపై 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 549 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా.. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి పూర్తి చేతులెత్తేశారు. కేవలం 140 పరుగులకే మన జట్టు కుప్పకూలింది. సఫారీ స్పిన్నర్ హార్మర్ 6 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. సొంతగడ్డపై ఇంత ఘోర పరాభవం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 2-0తో గెలుచుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి సెంచరీతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత మార్కో జాన్సెన్ 6 వికెట్లతో విజృంభించడంతో ఇండియా 201 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 78.3 ఓవర్లలో 260/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టాన్ స్టబ్స్ (94) సెంచరీ మిస్ చేసుకోగా, టోనీ డి జోర్జి (49) రాణించాడు. 549 పరుగుల టార్గెట్ లో ఇండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది.
