రెండు నెలల్లో భారత్ మా దారికొస్తది..అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ కామెంట్

రెండు నెలల్లో భారత్ మా దారికొస్తది..అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్  కామెంట్

వాషింగ్టన్: అదనపు సుంకాలు ఇండియాను దూరం చేశాయనే వాదనను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్  కొట్టిపారేశారు. ఒకటి రెండు నెలల్లో ఇండియా తమ దారికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీ సారీ చెప్పి తమ ప్రెసిడెంట్ ట్రంప్ తో డీల్ కుదుర్చుకుంటారని కామెంట్ చేశారు. ప్రపంచంలో అమెరికానే అతిపెద్ద వినియోగదారు అని, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే సూత్రాన్ని మర్చిపోవద్దని అన్నారు. 

ఈమేరకు ఇండియాకు దూరమయ్యామంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై లుట్నిక్ స్పందించారు. ఇండియా, చైనా, రష్యాల మైత్రి ఎక్కువ కాలం సాగదని చెప్పారు. ‘చైనా తన వస్తువులు మాకే అమ్ముతుంది. ఇండియా కూడా మాకే అమ్ముతుంది. ఆ రెండు దేశాలకూ మేమే అతిపెద్ద వినియోగదారులం. మాకు దూరంగా ఇండియా, చైనాలు దగ్గరై సాధించేదేమీ ఉండదు. 

ఎందుకంటే ఆ రెండు దేశాలు పరస్పరం వస్తువులను అమ్ముకోలేవు కదా. మళ్లీ మాకు అమ్మాల్సిందే’ అని అన్నారు.  ఒకటి రెండు నెలల్లో ఇండియా ఈ విషయం గ్రహించి తిరిగి అమెరికాను ఆశ్రయిస్తుందని చెప్పారు. చర్చలు జరిపేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని లుట్నిక్ పేర్కొన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఆపేసి, బ్రిక్స్ కు దూరం జరిగితే ఇండియాతో చర్చలు జరిపేందుకు సిద్దమని తెలిపారు. దీనికి సిద్ధపడకపోతే ఇండియా 50 శాతం పన్నులు చెల్లించాల్సిందేనని లుట్నిక్ స్పష్టం చేశారు.