T20 World Cup: టీమిండియా తీన్మార్‌‌‌‌.. మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత్

T20 World Cup: టీమిండియా తీన్మార్‌‌‌‌.. మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత్
  • టీ20 వరల్డ్ కప్‌‌లో కొత్త చరిత్ర
  • మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత్​
  • ట్రోఫీ నిలబెట్టుకున్న తొలి జట్టుగా  రికార్డు
  • ఫైనల్లో 96 రన్స్ తేడాతో న్యూజిలాండ్‌‌పై గ్రాండ్ విక్టరీ
  • సత్తా చాటిన శాంసన్‌‌, అభిషేక్‌‌, ఇషాన్‌‌, బుమ్రా

చరిత్ర సృష్టించాలన్నా మేమే.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా మేమే అని టీమిండియా మరోసారి గర్జించింది..! అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ, ఆతిథ్య జట్టుకు కప్పు దక్కదన్న సెంటిమెంట్‌‌ను బద్దలుకొడుతూ మన జట్టు మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది.  సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అహ్మదాబాద్ గడ్డపై న్యూజిలాండ్‌‌ను మట్టికరిపించి.. టీ20 క్రికెట్‌‌ చరిత్రలోనే అత్యధికంగా మూడోసారి వరల్డ్‌‌ కప్‌‌ను ముద్దాడి తీన్‌‌మార్ కొట్టింది. ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్‌‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో తగిలిన ఓటమి గాయాన్ని.. ఈ అద్భుత విజయంతో  మాన్పుకుంది.

ఇది ఆట కాదు వేట

ఖతర్నాక్ ఫామ్‌‌తో ఫైనల్‌‌కు దూసుకొచ్చిన సూర్యసేన.. ఆఖరాటలో వన్‌‌సైడ్ వార్ చేసింది. ప్రత్యక్షంగా లక్ష మంది అభిమానుల కేరింతలు, వంద కోట్ల మంది ఆశీస్సుల నడుమ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని మన బ్యాటర్లు ‘రన్‌‌’రంగంగా మార్చేశారు. తమది ఆట కాదు వేట అన్నట్టు కివీస్‌‌ను వేటాడేశారు. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన సంజూ శాంసన్ (46 బాల్స్‌‌లో5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89) ఫైనల్లోనూ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌‌ కోసమే తన ఆటను దాచుకున్నట్టు కుర్ర ఓపెనర్ అభిషేక్ శర్మ (21 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) చెలరేగితే.. మరో వీరుడు ఇషాన్ కిషన్ (25 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54) కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకరిని మించి మరొకరు అన్నట్టు ఈ త్రయం సృష్టించిన పరుగుల విళయానికి  ఇండియా 255 రన్స్‌‌ రికార్డు స్కోరు చేసింది.

బౌలింగ్‌‌లోనూ అదే దెబ్బ

బ్యాటింగ్‌‌లో దంచికొట్టిన ఇండియా.. ఆపై బంతితోనూ బెంబేలెత్తించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్‌‌క్యాప్స్‌‌ బ్యాటర్లకు మన బౌలర్లు చుక్కలు చూపించారు. ఇండియా బౌలింగ్ ‘బ్రహ్మాస్త్రం’ జస్‌‌ప్రీత్ బుమ్రా (4/15) నిప్పులు చెరిగే బంతులకు తోడు.. స్పిన్నర్ అక్షర్ పటేల్ (3/27) మాయాజాలం తోడవడంతో కివీస్ తోకముడిచింది. కనీసం 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేయడంతో మన త్రివర్ణ పతాకం మూడోసారి రెపరెపలాడింది!  పాపం న్యూజిలాండ్ అద్భుత ఆటతో రెండోసారి ఫైనల్‌కు వచ్చిన ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. వరల్డ్ కప్‌ నెగ్గాలన్న  కల మరోసారి కలగానే మిగిలింది.

 
 అహ్మదాబాద్‌‌: టీ20 ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ.. వరల్డ్ కప్‌‌లో టీమిండియా ముచ్చటగా మూడోసారి చాంపియన్‌‌గా నిలిచింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్‌‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అయిన ఓటమి గాయాన్ని తుడిచిచేసి.. అదే మైదానంలో విజయ గర్జన చేసింది. ఆదివారం రాత్రి ఏకపక్షంగా సాగిన తుది పోరులో ఇండియా ఏకంగా 96 రన్స్ తేడాతో న్యూజిలాండ్‌‌ను చిత్తు చిత్తుగా ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. శాంసన్‌‌, ఇషాన్‌‌, అభిషేక్ మెరుపు ఫిఫ్టీలతో అదరగొట్టడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 255/5 స్కోరు చేసింది. 

 కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ (3/46) మూడు వికెట్లు పడగొట్టాడు. చివర్లో  శివమ్ దూబే (8 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్‌‌) దంచికొట్టాడు. అనంతరం బుమ్రా, అక్షర్ దెబ్బకు ఛేజింగ్‌‌లో కివీస్ 19 ఓవర్లలో 159 రన్స్‌‌కే ఆలౌటైంది. టిమ్ సిఫర్ట్ (52), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (43) మాత్రమే పోరాడారు. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్  మ్యాచ్‌‌,  శాంసన్‌‌ (5 మ్యాచ్‌‌ల్లో 321 రన్స్‌‌) కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు లభించాయి. 

టాప్‌‌-3 తడాఖా

టాప్‌‌–3 బ్యాటర్లు ఫిఫ్టీలతో తడాఖా చూపెట్టడంతో ఇండియా రికార్డు స్కోరు చేసింది.  గత రెండు మ్యాచ్‌‌ల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కేరళ స్టార్ శాంసన్ మరోసారి కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌‌తో మెప్పించాడు. ఇంకోవైపు వరుస వైఫల్యాల తర్వాత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లో తన మార్కు చూపెట్టాడు. ఓ ఎండ్‌‌లో అభిషేక్‌‌, మరోవైపు శాంసన్‌‌ బౌండరీలనే టార్గెట్‌‌ చేయడంతో స్కోరుబోర్డు బుల్లెట్ ట్రైన్‌‌ను తలపించింది. ఇద్దరూ గ్రౌండ్ నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ కివీస్ పేసర్లను బెంబేలెత్తించారు. తొలి రెండు ఓవర్లలో 12 రన్స్‌‌ మాత్రమే ఇచ్చిన కివీస్‌‌కు మూడో ఓవర్‌‌‌‌ నుంచి ఓపెనర్లు అసలు ఆట చూపెట్టారు. డఫీ బౌలింగ్‌‌లో అభి రెండు సిక్సర్లతో టచ్‌‌లోకి వచ్చాడు. 

ఆపై ఫెర్గూసన్‌‌ వేసిన నాలుగో ఓవర్లో అభి, సంజూ చెరో ఫోర్‌‌‌‌, సిక్స్‌‌తో 24 రన్స్ రాబట్టారు. హెన్రీ బౌలింగ్‌‌లో చెరో సిక్స్ బాదారు. డఫీ వేసిన ఆరో ఓవర్లో అభి 4, 6, 4, 6తో రెచ్చిపోయి 18 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. పవర్ ప్లేను ఇండియా 92/0తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కివీస్ రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతో బౌలింగ్ చేసింది. ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ రచిన్ రవీంద్ర తన తొలి బాల్‌‌కే అభిని ఔట్ చేసి ఫస్ట్ వికెట్‌‌కు 98 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. కానీ, ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. అభిషేక్ ఔటైనా.. కివీస్​కు కష్టాలు తప్పలేదు. 

అప్పటికే క్రీజులో కుదురుకున్న శాంసన్‌‌కు తోడైన ఇషాన్ కూడా బౌండరీల మోత మోగించడంతో  సగం ఓవర్లకే ఇండియా 127/1తో నిలిచింది. 33 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సంజూ.. ఫెర్గూసన్ బౌలింగ్‌‌లో  రెండు సిక్సర్లు కొట్టగా.. ఇషాన్ 6, 4 బాదడంతో 12  ఓవర్లకే స్కోరు 160 దాటింది. 14వ ఓవర్లో రచిన్ మళ్లీ బౌలింగ్‌‌కు దిగగా.. శాంసన్ హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆపై శాంట్నర్ ఓవర్లో 6, 4తో స్కోరు 200 దాటించిన ఇషాన్‌‌.. 23 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 

దూబే ఫినిషింగ్ టచ్‌‌..

సంజూ, ఇషాన్ జోరుతో 15 ఓవర్లకు 203/1తో నిలిచిన ఇండియా 300 స్కోరు చేసేలా కనిపించింది. కానీ స్లాగ్ ఓవర్లలో కివీస్ బౌలర్లు పుంజుకున్నారు. 16వ  ఓవర్లో జేమ్స్‌‌ నీషమ్ మూడు వికెట్లు తీసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. శాంసన్‌‌ తోపాటు  ఇషాన్‌‌, కెప్టెన్ సూర్యకుమార్ (0) భారీ షాట్లకు ట్రై చేసి క్యాచ్‌‌లు ఇచ్చారు. శాంసన్‌‌–ఇషాన్ రెండో వికెట్‌‌కు 105 రన్స్ జోడించారు. 

డఫీ, నీషమ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హార్దిక్‌‌ పాండ్యా (18), తిలక్ వర్మ (8 నాటౌట్‌‌) షాట్లు ఆడలేపోయారు. హెన్రీ వేసిన 19వ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన పాండ్యా తర్వాతి బాల్‌‌కే శాంట్నర్‌‌‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. 15–19వ ఓవర్లో మధ్యలో  4 వికెట్లు కోల్పోయిన ఇండియా 28 రన్స్ మాత్రమే చేసి 231/5తో నిలిచింది. కానీ, నీషమ్ వేసిన చివరి ఓవర్లో శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ షాట్లతో 4, 6, 6, 4, 0,4తో  ఏకంగా 24 రన్స్ రాబట్టిన అతను  స్కోరు 250 దాటించి అద్భుత ఫినిషింగ్ ఇచ్చాడు. 

బ్లాక్‌‌క్యాప్స్ మైండ్ బ్లాంక్‌‌

కొండంత లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టిన ఆతిథ్య బౌలర్లు ప్రత్యర్థి నడ్డి విరిచారు. హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో టిమ్ సిఫర్ట్  రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 రన్స్ పిండుకోవడంతో కెప్టెన్ సూర్య వెంటనే స్పిన్నర్ అక్షర్‌‌‌‌ పటేల్‌‌ను రంగంలోకి దించాడు. సెమీస్‌‌లో తన ఫీల్డింగ్‌‌తో అదరగొట్టిన అక్షర్ ఈసారి స్పిన్‌‌తో మ్యాజిక్ చేశాడు. తన నాలుగో బాల్‌‌కే ప్రమాదకర ఫిన్‌‌ అలెన్ (9)ను ఔట్ చేసి ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఆపై బుమ్రా తన తొలి బాల్‌‌కే రచిన్ రవీంద్ర (1)ను కీపర్ క్యాచ్‌‌తో వెనక్కుపంపాడు. 

ఈ షాక్‌‌ల నుంచి కోలుకునేలోపే ఐదో ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ (5)ను బౌల్డ్ చేసిన అక్షర్ కివీస్‌‌ను 47/3తో కష్టాల్లోకి నెట్టాడు. ఓ ఎండ్‌‌లోక్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్లు కొట్టిన సిఫర్ట్ 23 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని జట్టులో ఆశలు రేపాడు. కానీ, మార్క్ చాప్‌‌మన్‌‌ (3)ను పాండ్యా బౌల్డ్ చేయగా.. వరుణ్ వేసిన 9వ  ఓవర్లో సిఫర్ట్‌‌ కీపర్‌‌‌‌ ఇషాన్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో 72/5తో కివీస్ పీకల్లోతు కష్టాల్డో పడింది. 

ఈ టైమ్‌‌లో కెప్టెన్ శాంట్నర్, డారిల్ మిచెల్ (17)  ఫోర్లు, సిక్సర్లతో  అనూహ్యంగా ఎదురుదాడికి దిగి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, 13వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన అక్షర్​ మిచెల్‌‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆపై 16వ ఓవర్లో బుమ్రా వరుస బాల్స్‌‌లో నీషమ్ (8), మ్యాట్ హెన్రీ (0)ని బౌల్డ్ చేసి కివీస్‌‌ ఓటమి ఖాయం చేశాడు. ఒంటరి పోరాటం చేస్తున్న శాంట్నర్‌‌‌‌ను కూడా బుమ్రానే బౌల్డ్ చేయగా.. అభిషేక్ వేసిన 19వ ఓవర్లో తిలక్ పట్టిన క్యాచ్‌‌కు డఫీ (3) లాస్ట్ వికెట్‌‌గా ఔటవ్వడంతో టీమిండియా సంబరాలు షురూ అయ్యాయి.

స్కోర్‌‌‌‌బోర్డ్‌‌

ఇండియా: శాంసన్ (సి) సబ్/ మెకోంచి (బి) నీషమ్ 89, అభిషేక్ (సి) సిఫర్ట్ (బి) రవీంద్ర 52, ఇషాన్ (సి) చాప్‌‌మన్ (బి) నీషమ్ 54, హార్దిక్ పాండ్యా (సి) శాంట్నర్ (బి) హెన్రీ 18, సూర్యకుమార్ (సి) రచిన్‌‌ (బి) నీషమ్ 0, తిలక్ వర్మ (నాటౌట్) 8, శివమ్ దూబే (నాటౌట్) 26; ఎక్స్‌‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 255/5; వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226;  బౌలింగ్: మ్యాట్ హెన్రీ 4–0–49–1, గ్లెన్ ఫిలిప్స్ 1–0–5–0, జాకబ్ డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, మిచెల్ శాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1,  నీషమ్ 4–0–46–3.


న్యూజిలాండ్‌‌: సిఫర్ట్ (సి) ఇషాన్ (బి) వరుణ్ 52, ఫిన్ అలెన్ (సి) తిలక్ వర్మ (బి) అక్షర్ పటేల్ 9, రచిన్ రవీంద్ర (సి) ఇషాన్  (బి) బుమ్రా 1, గ్లెన్ ఫిలిప్స్ (బి) అక్షర్ 5, చాప్‌‌మన్ (బి) పాండ్యా 3, డారిల్ మిచెల్ (సి) ఇషాన్ (బి) అక్షర్ పటేల్ 17, శాంట్నర్ (బి) బుమ్రా 43,  నీషమ్ (బి) బుమ్రా 8, హెన్రీ (బి) బుమ్రా 0, ఫెర్గూసన్ (నాటౌట్) 6,  డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్  3; ఎక్స్‌‌ట్రాలు: 12; మొత్తం: 19 ఓవర్లలో 159 ఆలౌట్; వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159;  బౌలింగ్: అర్ష్‌‌దీప్  4–0–32–0, హార్దిక్  4–0–36–1, అక్షర్  3–0–27–3, బుమ్రా 4–0–15–4,  చక్రవర్తి 3–0–39–1, అభిషేక్  1–0–5–1.

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియాకు అభినందనలు. ఈ అద్భుతమైన విజయం అసాధారణ నైపుణ్యాలు, దృఢ సంకల్పం, జట్టు కృషిని ప్రతిబింబిస్తుంది. ప్లేయర్లు టోర్నమెంట్ అంతటా అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈ విజయం ప్రతి భారతీయ హృదయాన్ని గర్వంతో , ఆనందంతో నింపింది. టీమిండియాకు శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్ర మోదీ

నిజం చెప్పాలంటే ఈ ప్రయాణం రెండేండ్ల కిందటే మొదలైంది. 2024 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో ఉన్నా నాకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అప్పుడే కచ్చితంగా ఏదో ఒకటి సాధించాలని కష్టపడ్డాను, నిరంతరం కలలు కన్నాను. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత నా కెరీర్ అయిపోయిందని, కలలన్నీ చెదిరిపోయాయని తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నా కోసం వేరే ప్లాన్ చేశాడు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా సచిన్ టెండూల్కర్ సర్ నాతో టచ్‌లో ఉంటూ ఎంతో మార్గనిర్దేశం చేశారు. ఫైనల్‌కు ముందు రోజు కూడా ఆయన ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు.  ప్రస్తుతం ఈ అద్భుతమైన విజయాన్ని ఆస్వాదిస్తా. ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిస్తాను.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ సంజూ శాంసన్‌

శాంసన్  రాసిన శాసనం

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ పేరు ఎక్కడా వినిపించలేదు. న్యూజిలాండ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో వరుస వైఫల్యాలతో జట్టులో చోటే ప్రశ్నార్థకమైన స్థితి నుంచి నేడు ఇండియాను ప్రపంచ విజేతగా నిలిపిన ప్రధాన శక్తిగా సంజూ అవతరించాడు. ఈ  కేరళ ముద్దుబిడ్డ తన అద్భుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో విమర్శకులందరి నోళ్లు మూయించి ఇండియా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడే సంజూ తన అసలైన ప్రతాపాన్ని చూపాడు. టోర్నీలో తను ఆడిన మూడు కీలక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లు ఇండియా తలరాతను మార్చేశాయి. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో సూపర్-8 నాకౌట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 196 టార్గెట్ ఛేజింగ్​లో  సంజూ 50 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 97 రన్స్​ తో అజేయంగా నిలిచి ఇండియాను సెమీస్‌‌‌‌‌‌‌‌కు చేర్చాడు. 

ఇది కేవలం ఇన్నింగ్స్ మాత్రమే కాదు.. టోర్నీలో సంజూ పునరాగమనానికి నాంది.సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ 42 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 89 రన్స్ చేసి జట్టును ఫైనల్ చేర్చాడు. తుదిపోరులోనూ తన మార్కు చూపెడుతూ  మరోసారి టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన సంజూ  జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్‌‌‌‌‌‌‌‌తో ఫస్ట్ వికెట్‌‌‌‌‌‌‌‌కు 98, ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌తో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 105 రన్స్ జోడించి కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మూడు కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో కలిపి సంజూ 138 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 275 రన్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు.

 తన స్ట్రయిక్ రేట్ 199.27 కావడం విశేషం. ఈ మొత్తం 275 రన్స్‌‌‌‌‌‌‌‌లో  214  ( 78 శాతం) కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే వచ్చాయి. అంటే ప్రతి 3.14 బాల్‌‌‌‌‌‌‌‌కు ఓ బౌండరీ బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గత దశాబ్ద కాలంగా సంజూ సామర్థ్యంపై వస్తున్న సందేహాలకు ఈ టోర్నీతో తెరపడింది. కోచ్ గౌతమ్ గంభీర్ మొదటి నుంచీ సంజూపై ఉంచిన నమ్మకం వృధా కాలేదు. 

గంభీర్ చెప్పినట్లుగా వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాకుండా, జట్టు అవసరాల కోసం ఆడిన సంజూ.. టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు.  కేవలం 5 మ్యాచ్‌‌లు మాత్రమే ఆడి  321 రన్స్‌‌ చేసి ప్లేయ ర్ఆఫ్ ద టోర్నీగా నిలిచిన శాంసన్‌‌‌‌‌‌‌‌ ఈ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం ఒక ఆటగాడిగా ప్రవేశించి, ఒక విజేతగా.. ఒక లెజెండ్‌‌‌‌‌‌‌‌గా బయటకు వచ్చాడు. ఈ టోర్నీలో సంజూ బాదిన  ఫోర్లు, సిక్సర్లు ఇండియా క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
 

1 టీ20 వరల్డ్‌ కప్‌లో మూడోసారి కప్పు నెగ్గిన తొలి టీమ్ ఇండియా. 2007, 2024లోనూ విన్నర్‌‌గా నిలిచింది. వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన జట్టు ఇండియానే.

1  టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్-3 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.

3 టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 50 ప్లస్ స్కోరు చేసిన మూడో బ్యాటర్ సంజూ శాంసన్. గతంలో షాహిద్ అఫ్రిది (2009), విరాట్ కోహ్లీ (2014) మాత్రమే ఈ ఘనత సాధించారు.

2 ఇండియాకు  వరుసగా రెండు వరల్డ్ కప్ టైటిల్స్ (2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్) అందించిన తొలి కోచ్‌ గౌతమ్ గంభీర్.
 
92/0 టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యధిక
 పవర్‌‌‌‌‌‌‌‌ప్లే స్కోరు.  

1  టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌) చేసిన బ్యాటర్ అభిషేక్ శర్మ. బెథెల్, ఫిన్ అలెన్ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌) రికార్డును బ్రేక్ చేశాడు. 

4 ఇండియాకు ఐసీసీ వరల్డ్ కప్‌ అందించిన నాలుగో కెప్టెన్ సూర్య కుమార్‌‌. కపిల్ దేవ్‌, ఎంఎస్‌ ధోనీ, రోహిత్ శర్మ సరసన చేరాడు.

255/5  టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది మూడో అత్యధిక టీమ్ స్కోరు. ఫైనల్లో ఇదే హయ్యెస్ట్ స్కోరు.

7 మెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20ల్లో అత్యధికంగా 7 సార్లు 250 ప్లస్ స్కోర్లు సాధించిన టీమ్‌‌‌‌‌‌‌‌ ఇండియా. సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్ హైదరాబాద్ (5 సార్లు) రెండో స్థానంలో ఉంది.

  2  ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ ఆడిన రెండో ఫైనల్లోనూ ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2021లోనూ ఆ టీమ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ ఇండియా
రూ. 27.48 కోట్లు
న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌
రూ.14.65 కోట్లు