సిరీస్ చిక్కేనా! నేడు ఇంగ్లండ్‌‌తో ఇండియా విమెన్స్‌‌ టీమ్ మూడో వన్డే

సిరీస్ చిక్కేనా! నేడు ఇంగ్లండ్‌‌తో ఇండియా విమెన్స్‌‌ టీమ్ మూడో వన్డే

చెస్టర్-లీ-స్ట్రీట్ (యూకే): తొలి మ్యాచ్‌‌లో అద్భుత విజయం సాధించి లార్డ్స్‌‌ వన్డేలో  చెత్త షాట్‌‌ సెలెక్షన్‌‌తో ఓడిన  ఇండియా విమెన్స్ టీమ్ జట్టు  ఇంగ్లండ్‌‌తో ఆఖరాటకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా మంగళవారం జరిగే మూడో, చివరి వన్డేల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ అందుకున్న హర్మన్‌‌ సేన ఇప్పుడు ఇంగ్లిష్ గడ్డపై వన్డే సిరీస్‌‌ను సొంతం చేసుకున్న అరుదైన రికార్డు సృష్టించనుంది. 

అదే జరిగితే మరో రెండు నెలల్లో స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ ముంగిట హర్మన్‌‌సేన కాన్ఫిడెన్స్‌‌ రెట్టింపు కానుంది. అయితే, లార్డ్స్‌‌ మ్యాచ్ విక్టరీతో ఆత్మవిశ్వాసంతో పుంజుకున్న ఇంగ్లండ్‌‌ను ఓడించాలంటే ఇండియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే.  వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన రెండో మ్యాచ్‌‌లో ఇండియా పేలవ బ్యాటింగ్‌‌తో 143 రన్స్‌‌కే పరిమితం కాగా ఇంగ్లండ్ ఈజీగా టార్గెట్ అందుకుంది.

వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్‌‌రౌండర్ దీప్తి శర్మ మినహా మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ సోఫీ ఎకిల్‌‌స్టోన్‌‌ బౌలింగ్‌‌లో బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సిరీస్ గెలవాలంటే కెప్టెన్ హర్మన్‌‌, జెమీమా, ప్రతీక, హర్లీన్ వంటి కీలక బ్యాటర్లలో ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడటం తప్పనిసరి. వారికి లోయర్ ఆర్డర్‌‌లో రిచా ఘోష్, దీప్తి నుంచి మద్దతు అవసరం. బౌలర్లు కూడా ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌‌పై ఒత్తిడి పెంచాల్సి ఉంది. మరోవైపు, రెండో వన్డే విజయంతో ఇంగ్లండ్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి టీ20 సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.