Women's ODI World Cup 2025: అసాధ్యమనుకున్న మ్యాచ్‌లో అద్భుతం.. టీమిండియా ఎమోషనల్ సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్

Women's ODI World Cup 2025:  అసాధ్యమనుకున్న మ్యాచ్‌లో అద్భుతం.. టీమిండియా ఎమోషనల్ సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్

వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్. ఆడుతుంది ఏడు సార్లు ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై. సొంతగడ్డపై ఆడుతున్నా ఆసీస్ జట్టును ఓడించాలంటే అసాధ్యమనుకున్నారు. దీనికి తోడు టాస్ కూడా ఆస్ట్రేలియా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించారు. మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 339 పరుగుల భారీ టార్గెట్ ఇండియా ముందు ఉంచారు. కళ్ళ ముందు 339 పరుగుల టార్గెట్.. 59 పరుగులకే రెండు వికెట్లు డౌన్. ఫామ్ లో ఉన్న స్మృతి మందాన ఔటయ్యేసరికీ ఇండియా విజయంపై ఎవరికీ ఆశలు లేవు.

అయితే ఇక్కడ నుంచే అసలైన ఆట మొదలయింది. జెమీమా, హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదట ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత క్రమంగా జోరు పెంచారు. అలవోకగా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కౌర్ భారీ షాట్ కు ప్రయత్నించి సెంచరీ మిస్ అయినా.. జెమీమా సెంచరీ పూర్తి చేసుకుంది. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా.. చివర్లో దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్ జ్యోత్ కౌర్ లతో కీలక భాగస్వామ్యాలు నిర్మించి ఇండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.

అమన్ జ్యోత్ కౌర్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టడంతో టీమిండియా ప్లేయర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విన్నింగ్ షాట్ కొట్టగానే జట్టు మొత్తం గ్రౌండ్ లోకి వచ్చి సెలెబ్రేట్ చేసుకుంది. సెంచరీతో మ్యాచ్ ను గెలిపించిన జెమీమా ఎమోషనల్ తో కన్నీళ్లు పెట్టుకుంటే సహచర ప్లేయర్స్ ఓదారుస్తూ కనిపించారు. ఒకరినొకరు హగ్ లు ఇచ్చుకుంటూ గ్రౌండ్ లో ఎమోషనల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాపై తరచూ ఐసీసీ టోర్నీల్లో ఓడిపోతున్న భారత జట్టుకు ఈ విజయం ఎంతో ప్రత్యేకం. దీంతో మన జట్టు సంబరాలు అంబరాన్ని అంటాయి. స్టేడియంలో అభిమానులు చప్పట్లు కొడుతుంటే.. డగౌట్ లో మనోళ్లు సంతోషంతో ఉరకలు వేశారు. చిన్నపిల్లలా మారిపోయి విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.    

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతం చేసింది. ఆస్ట్రేలియా విధించిన 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముగిసిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (127) వీరోచిత సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమిండియాకు విజయాన్ని అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో  338 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి గెలిచింది.