
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియా విమెన్స్ జట్టు ఆఖరి మ్యాచ్‌లో మాత్రం బోల్తా కొట్టింది. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ (41 బాల్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 75) చెలరేగినా మిగతా వారు నిరాశపర్చడంతో.. శనివారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3–2కు పరిమితమైంది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. 19 రన్స్‌కే ఓపెనర్ స్మృతి మంధాన (8), జెమీమా (1) ఔటయ్యారు. ఈ దశలో షెఫాలీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15) మూడో వికెట్‌కు 66 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
మిడిలార్డర్‌లో రిచా ఘోష్ (24) నిలకడగా ఆడినా.. వరుస విరామాల్లో హర్మన్, హర్లీన్ డియోల్ (4), షెఫాలీ, దీప్తి శర్మ (7) వెనుదిరగడంతో స్కోరు 126/6గా మారింది. చివర్లో రాధా యాదవ్ (15 నాటౌట్) మెరుగ్గా ఆడింది. రిచాతో ఏడో వికెట్‌కు 28, అరుంధతి రెడ్డి (9 నాటౌట్) ఎనిమిదో వికెట్‌కు 13 రన్స్ జోడించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో చార్లీ డీన్ 3, ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లీ (46), డానీ వ్యాట్ (56) తొలి వికెట్‌కు 101 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. 7 బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔటయ్యారు.
మైయా బౌచియర్ (16), కెప్టెన్ టామీ బ్యూమోంట్ (30), అమీ జోన్స్ (10) మెరుగ్గా ఆడినా చివర్లో ఉత్కంఠ నెలకొంది. విజయానికి ఆరు బాల్స్‌లో ఆరు రన్స్ కావాల్సిన దశలో అరుంధతి రెడ్డి మూడు బాల్స్ తేడాలో బ్యూమోంట్, అమీ జోన్స్‌ను ఔట్ చేసింది. కానీ ఎకిల్‌స్టోన్ (4 నాటౌట్), స్కోల్‌ఫీల్డ్ (2 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. దీప్తి, అరుంధతి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చార్లీ డీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మొత్తంగా 10 వికెట్లు తీసిన శ్రీచరణికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ బుధవారం సౌతాంప్టన్‌లో జరగనుంది.