సౌతాఫ్రికాతో 5 మ్యాచ్ ల టీ20 ల సిరీస్ లో భాగంగా టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి టీ20లో సౌతాఫ్రికాపై భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) ముగిసిన ఈ మ్యాచ్ లో సఫారీలను చిత్తు చేస్తూ 101 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. మొదట బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్య (28 బంతుల్లో 59: 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులతో పాటు బౌలర్లు దుమ్ములేపి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్య, దూబేలకు తలో వికెట్ దక్కింది.
176 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్ లోనే అర్షదీప్ సింగ్ డికాక్ (0) వికెట్ పడగొట్టి టీమిండియాకు మంచి ఆరంభం ఇచ్చాడు. ఇదే ఊపులో అర్షదీప్ తన రెండో ఓవర్లో స్టబ్స్ (14) వికెట్ పడగొట్టి రెండో వికెట్ అందించాడు. పవర్ ప్లే లో మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. భారత స్పిన్నర్ల ధాటికి స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఒక్కరు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయారు. దీంతో సౌతాఫ్రికా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించలేక చతికిల పడి కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాలో ఆరుగురు బౌలర్లు వికెట్ తీసుకోవడం విశేషం.
పాండ్య మెరుపులతో టీమిండియాకు భారీ స్కోర్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ శుభమాన్ గిల్ తొలి బంతినే ఫోర్ కొట్టి రెండో బాల్ ఔటయ్యాడు. ఎంగిడి వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపడిన గిల్.. మిడాఫ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మూడో ఓవర్లో కేవలం 11 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కూడా క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడలేదు. 17 పరుగులే చేసి పవర్ ప్లే తర్వాత ఔటయ్యాడు. దీంతో ఇండియా 48 పరుగులకే టాపార్డర్ ను కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ 30 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బందిపడిన తిలక్ వర్మ 32 బంతుల్లో 26 పరుగులు చేసి నిరాశపరిచాడు. 23 పరుగులు చేసిన అక్షర్ పెవిలియన్ కు చేరడంతో 105 పరుగుల వద్ద ఇండియా 5 వికెట్లు కోల్పోయి సగం జట్టును కోల్పోయింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ 16 ఓవర్లో మహరాజ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి దూకుడు చూపించిన హార్దిక్.. అదే జోరును చూపించాడు. దూబేతో కలిసి పరుగుల వరద పారించాడు. చివరి వరకు క్రీజ్ లో జట్టు స్కోర్ ను 175 పరుగులకు చేర్చాడు.
HUGE win for India in the T20I series opener 👏#INDvSA scorecard: https://t.co/g4gyJRXl8s pic.twitter.com/J5Vyjf9FvB
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2025

