
ఆసియా కప్ 2025లో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. బుధవారం (సెప్టెంబర్ 24) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-4 మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండు విజయాలతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మొదట బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75: 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు బౌలర్లందరూ సమిష్టిగా రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ ను ఒక పరుగుకే ఔట్ చేసి బుమ్రా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆతర్వాత పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ కలిసి సైఫ్ హసన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లే లో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఆడుతూ రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు. వీరి జోడీని కుల్దీప్ విడదీశాడు. పవర్ ప్లే తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ నిదానంగా సాగుతూ వచ్చింది. క్రీజ్ లో ఉన్నంత సేపు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన తౌహిద్ హ్రిడోయ్ 7 పరుగులకే ఔటయ్యాడు.
11 ఓవర్లో వరుణ్ చక్రవర్తి.. షమీమ్ హొస్సేన్ ను డకౌట్ చేయడంతో బంగ్లాదేశ్ 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 13 ఓవర్లో కెప్టెన్ జాకర్ అలీ రనౌట్ కావడంతో బంగ్లా సగం జట్టుకు కోల్పోయి దాదాపు ఓటమిని కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సైఫ్ హసన్ అసాధారణంగా పోరాడుతూ వచ్చాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్ నుంచి టీమిండియా బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా కుప్పకూలింది.
17 ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు తీసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. 69 పరుగులు చేసి జోరు మీదున్న సైఫ్ హసన్ భారీ షాట్ ఆడే క్రమంలో ఔటవ్వడంతో బంగ్లాకు ఏ మూలనో ఉన్న ఆశలు కూడా పోయాయి. తిలక్ వర్మ చివరి వికెట్ తీసుకొని బంగ్లా ఇన్నింగ్స్ ను ముగించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మకు చెరో వికెట్ దక్కింది.
►ALSO READ | IND vs PAK: ఆదివారం ఏం జరుగుతుందో చూద్దాం.. సూర్య కామెంట్స్‌పై స్పంచిందిన షహీన్ అఫ్రిది
టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి మూడు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే వచ్చాయి. నాలుగో ఓవర్ నుంచి అసలు విధ్వంసం స్టార్ట్ అయింది. ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ విధ్వంసంతో నాలుగో ఓవర్లో 21.. ఐదో ఓవర్లో 17.. ఆరో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే లో ఇండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రిషద్ హుస్సేన్ విడగొట్టాడు.
గిల్ వికెట్ తీసి బంగ్లాకు తొలి వికెట్ అందించాడు. ఇక్కడ నుంచి ఇండియా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. మూడో నెంబరు లో ప్రమోషన్ తో వచ్చిన దూబే 2 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత సూర్యతో సమన్వయ లోపం కారణంగా బౌండరీలతో హోరెత్తిస్తున్న అభిషేక్ శర్మ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే సూర్య (5) పెవిలియన్ కు చేరాడు. భారీ షాట్ కు ప్రయత్నించి తిలక్ వర్మ (5) కూడా ఔటవ్వడంతో ఇండియా 129 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లలో అక్షర్ పటేల్ తో కలిసి హార్దిక్ పాండ్య జట్టుకు ఒక మాదిరి స్కోర్ ను అందించాడు.
India qualify for the Asia Cup final with an emphatic win against Bangladesh 👌#INDvBAN 📝: https://t.co/SV7NoGU8Tq pic.twitter.com/pL9iMMZbgV
— ICC (@ICC) September 24, 2025