Asia Cup 2025 Final: ఇండియాకు ఆసియా కప్ అందించిన తెలుగోడు.. ఫైనల్లో పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ

Asia Cup 2025 Final: ఇండియాకు ఆసియా కప్ అందించిన తెలుగోడు.. ఫైనల్లో పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ

ఆసియా కప్ 2025 టైటిల్ ను ఇండియా గెలుచుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి దాయాధి జట్టు పొగరు దించింది. స్వల్ప టార్గెట్ లో 20 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయిన తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (53 బంతుల్లో 69: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో  ఇండియాను గెలిపించాడు. సంజు శాంసన్ (24), దూబే (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియాకు ఇది 9 వ ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 19.4 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. 

20 పరుగులకే 3 వికెట్లు:
 
147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ క్రమంలో షహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఇండియా 7 పరుగులు రాబట్టింది. రెండో ఓవర్ తొలి బంతికి ఒక స్లో బంతితో ఫహీమ్ అష్రాఫ్ ఓపెనర్ అభిషేక్ శర్మను బోల్తా కొట్టించాడు. స్లో బంతిని భారీ షాట్ ఆడాలని చూసిన అభిషేక్ (5) మిడాన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన సూర్య కుమార్ యాదవ్ 5 బంతులాడి కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అఫ్రిది బౌలింగ్ లో ఔటయ్యాడు. మిడాఫ్ లో షాట్ ఆడాలని చూసిన సూర్య.. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా పట్టిన అద్భుతమైన క్యాచ్ కు ఔటయ్యాడు. కాసేపటికే గిల్ కూడా ఔట్ కావడంతో ఇండియా 20 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 

శాంసన్, తిలక్ నిలకడ:  

పాక్ బౌలర్లు రెచ్చిపోవడంతో ఇండియా పవర్ ప్లే లో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. గిల్ ఔటైన తర్వాత టీమిండియాను ఆదుకునే బాధ్యత తిలక్ వర్మ, సంజు శాంసన్ తీసుకున్నారు. జాగ్రత్తగా జట్టును ముందుకు తీసుకెళ్లారు. వికెట్ కాపాడుకుంటూనే మధ్యలో బౌండరీ కొడుతూ వచ్చారు. మూడో వికెట్ కు 57 పరుగుల భాగస్వామ్యం తర్వాత పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. మంచి టచ్ లో కనిపించిన శాంసన్ ను ఔట్ చేసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. 

తిలక్, దూబే ఫినిషింగ్:  

దూబేతో కలిసి తిలక్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 15 ఓవర్లో దూబే ఒక ఫోర్ కొడితే.. తిలక్ వర్మ 4,6 బాదాడు. దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.  ఈ క్రమంలో తిలక్ వర్మ 41 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీన్ అష్రాఫ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. చివర్లో దూబే ఔటైనా.. తిలక్ వర్మ చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ గెలిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీన్ అష్రాఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.    

146 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్:       

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ పాకిస్థాన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 9.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ అందించారు. వీరిద్దరి జోడీ జాగ్రత్తగా ఆడడంతో పవర్ ప్లే లో పాక్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. పవర్ ప్లే తర్వాత టీమిండియా స్పిన్నర్లపై ఆధిపత్యం చూపించిన ఈ జోడీ వేగంగా ఆడుతూ వికెట్ కాపాడుకుంటూ వచ్చింది. వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన ఫర్హాన్ (57) ను ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు.

ఆ తర్వాత సైమ్ అయూబ్ తో కలిసి ఫకర్ జమాన్ 29 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అయితే పాక్ ఒక పరుగు వ్యవధిలో అయూబ్ (14) తో పాటు మహమ్మద్ హారీస్ వికెట్ (0) కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి 126 పరుగులతో పర్వాలేదనిపించిన పాక్.. ఊహించని విధంగా వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు విజృంభించడంతో కేవలం 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో పాకిస్థాన్ 150 పరుగుల మార్క్ కూడా అందుకోలేకపోయింది. టాపార్డర్ మినహాయిస్తే మిగిలిన పాక్ బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. 

India win the Asia Cup 2025 Final in an absolute thriller against Pakistan 😮‍💨

📝: https://t.co/ISyV26V2nB pic.twitter.com/Yhouly8BXz

— ICC (@ICC) September 28, 2025