ఒక్కో కుటుంబానికి రూ.కోటి సాయం: భారతీయుడు-2 ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు..

ఒక్కో కుటుంబానికి రూ.కోటి సాయం: భారతీయుడు-2 ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు..

బుధవారం రాత్రి చెన్నైలో భారతీయుడు-2 సినిమా షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం సినిమా ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా షాక్ లోకి నెట్టేసింది. షూటింగ్ జరుగుతుండగా భారీ క్రేన్ కూలి ముగ్గురు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. డైరెక్టర్ శంకర్ కు కాలు విరిగింది. షూటింగ్ లో ఉన్న హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గాయపడిన వారిని కిల్పాక్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు కమల్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ ముగ్గిరితో పాటు నేనూ మార్చురీలో ఉండేవాణ్ణి

యాక్సిడెంట్స్ కి పేద, గొప్ప అన్న తేడాలు ఉండవని, ప్రమాదం ముంచుకొస్తే ఎవరినైనా మింగేస్తుందని భావోద్వేగంతో అన్నారు కమల్ హాసన్. ఈ ప్రమాదంలో తాను కూడా ప్రాణాలు కోల్పోయేవాడినంటూ.. ఘటన జరిగిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. ‘నిజానికి కొద్ది క్షణాల గ్యాప్ లో తాను కూడా ఇవాళ ఆ ముగ్గురితో పాటు మార్చరీలో నిర్జీవంగా పడి ఉండేవాడిని. వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడ్డా. క్రేన్ కూలడానికి కొద్ది క్షణాల ముందు వరకూ కాజల్, నేను ఆ క్రేన్ పడిన టెంట్ కిందే ఉన్నాం. నేను నిల్చుని ఉన్న చోటి నుంచి రెండు అంగుళాలు పక్కకు జరిగి ఉన్నా ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేవాడిని కాదు. నా బదులు మరెవరో ఆ ఘటన గురించి మీతో మాట్లాడేవారు’ అని చెప్పారు కమల్ హాసన్.

డైరెక్టర్ శంకర్, కెమెరామ్యాన్ ఈ ప్రమాదం జరగడానికి నాలుగు సెకన్ల ముందే అక్కడి నుంచి లేచి పక్కన నిలబడ్డారని, లేకుంటే వాళ్ల పరిస్థితి కూడా మరోలా ఉండేదని అన్నారు. ఈ ఘటనలో మరణించిన శంకర్ అసిస్టెంట్ శ్రీకృష్ణ కొద్ది రోజుల క్రితం వరకు తన దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడని, నిన్న తన దగ్గరకు వచ్చి రెండ్రోజుల ముందే శంకర్ టీమ్ లో చేరినట్లు గర్వంగా చెప్పాడని అన్నారు. కెరియర్ లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలనుకున్న కృష్ణ ఇవాళ ప్రాణాలతో లేకపోవడం చాలా బాధాకరమని చెప్పారు.

కోట్ల బడ్జెట్ సినిమాలని గొప్పలు కాదు

భారతీయుడు-2 సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి కుటుంబాలకు హీరో కమల్ హాసన్ రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని వారికి ప్రాణాలకు ఇస్తున్న పరిహారంగా చూడొద్దని ఆయన కోరారు. ముగ్గురు బాధితుల కుటుంబాలకు తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనల్లోంచి కోలుకోవడం ఎంతటి కష్టమో తనకు వ్యక్తిగతంగా తెలుసని అన్నారు. ప్రమాదాలు ఎప్పుడూ కాచుకుని ఉంటాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటన సినీ ఇండస్ట్రీలో పని చేసేవారి రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు కమల్. కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నామని, కానీ నేటికీ సినిమా కోసం పని చేస్తున్న వారికి రక్షణ కల్పించలేకపోవడంపై తాను సిగ్గుచేటుగా ఫీలవుతున్నానని అన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.