మనకు ఎలాంటి నష్టం జరగలే: ఆపరేషన్‌ సింధూర్‌పై కేంద్రం కీలక ప్రకటన

మనకు ఎలాంటి నష్టం జరగలే: ఆపరేషన్‌ సింధూర్‌పై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎కు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ దాడులు పూర్తి విజయవంతమయ్యాయని.. ఈ ఆపరేషన్లో భారత్ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం (మే 14) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పాక్‌లోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేశామని దీనికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.

ఆపరేషన్ సిందూర్‎లో 9 కీలక ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని.. వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది.
మరోసారి దాడికి దిగితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాలని పాకిస్తాన్‌ను ప్రధాని మోడీ హెచ్చరించారని పేర్కొంది. భారత వైమానిక దళం పాకిస్తాన్‎కు చైనా సరఫరా చేసిన వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసిందని వెల్లడించింది. అలాగే పాక్  PL-15 క్షిపణులు, టర్కీకి చెందిన డ్రోన్లు, పాక్ దీర్ఘ-శ్రేణి రాకెట్లు, క్వాడ్‌కాప్టర్లు, వాణిజ్య డ్రోన్‌లను నాశనం చేసినట్లు తెలిపింది. 

కేవలం 23 నిమిషాల్లోనే సిందూర్ మిషన్‎ను పూర్తి చేశామని కేంద్రం వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ భారతదేశ సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిందని పేర్కొంది. స్వదేశీ హైటెక్ వ్యవస్థలను జాతీయ రక్షణలో సజావుగా అనుసంధానించడం.. డ్రోన్ యుద్ధం, లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ లేదా ఎలక్ట్రానిక్ యుద్ధంలో భారతదేశం తన గణనీయమైన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. సైనిక కార్యకలాపాలలో సాంకేతిక స్వావలంబన వైపు భారత్ చేస్తోన్న ప్రయాణంలో ఆపరేషన్ సిందూర్ ఒక మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది.

కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం టూరిస్ట్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులపై విక్షణరహితంగా కాల్పులు జరిపి ఉగ్రమూకలు రక్తపుటేరులు పారించారు. ముష్కరుల్లో కాల్పుల్లో మొత్తం 26 మంది పర్యాటకులు మరణించారు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా మిసైల్, బాంబుల వర్షం కురిపించింది. భారత్ చేసిన మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు.