దేశ భద్రతలో ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ కీలకం : వీఆర్ చౌదరి

దేశ భద్రతలో ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ కీలకం : వీఆర్ చౌదరి
  •     దుండిగల్ ఎయిర్ ఫోర్స్‌‌ అకాడమీలో 235 మంది ఫ్లైయింగ్ కేడెట్స్ పాసింగ్ ఔట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశ భద్రతలో ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ కీలకమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌‌ మార్షల్ వీఆర్‌‌‌‌ చౌదరి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ ఫ్లయింగ్‌‌ ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని దేశ భద్రతకు కృషి చేయాలన్నారు. సైబర్‌‌ సవాళ్లనూ ఎదుర్కోవాలన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌‌లోని ఎయిర్ ఫోర్స్‌‌ అకాడమీలో శనివారం ఫ్లైయింగ్ కేడెట్ల పాసింగ్ ఔట్‌‌ పరేడ్ జరిగింది. 

అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 9 మంది మహిళా కేడెట్లు సహా మొత్తం 235 ఫ్లైట్ కేడెట్లు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చౌదరి చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. భారత వాయుసేన కీర్తిని యువ అధికారులు మరింత పెంచాలని, విధి నిర్వహణలో చివరి శ్వాస వరకు దేశరక్షణకు అంకితమివ్వాలని ట్రైనింగ్ పూర్తి చేసిన యువ ఫ్లైయింగ్ ఆఫీసర్లకు పిలుపునిచ్చారు. అనంతరం పైలట్ కోర్సులో మొదటి స్థానంలో నిలిచిన హ్యాపీ సింగ్‌‌కు రాష్ట్రపతి మెడల్‌‌, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌‌ను అందించారు. 

శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో ఫ్లయింగ్‌‌ కేడెట్లకు ఫ్లయింగ్‌‌ ఆఫీసర్లుగా పదోన్నతి ఇస్తూ వారికి ర్యాంక్‌‌లు, వింగ్స్‌‌ అందించారు. పరేడ్‌‌ అనంతరం పిలాటస్ పీసీ-7,  సారంగ్‌‌ హెలికాప్టర్‌‌, సూర్యకిరణ్‌‌ ఏరోబాటిక్‌‌, సుఖోయ్ యుద్ధ విమానాల ఫ్లైయింగ్ ఆఫీసర్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.