
- ఇండియన్ ఆర్మీ ప్రపంచ రికార్డు
- లేహ్ లో సింధూపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం
- 260 అడుగుల పొడవు.. లేహ్, లడక్‌లకు ఉపయోగం
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ మరో ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. 40 రోజుల్లోనే 260 అడుగుల పొడవైన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించి ఆశ్చర్య పరిచింది. జమ్మూకాశ్మీర్‌లోని లేహ్ లో సింధూనదిపై నిర్మించిన ఈ వంతెన పేరు మైత్రి. ఆర్మీలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ లోని కంబాట్ ఇంజినీర్ల(సాహస్ ఔర్ యోగ్యత) బృందం దీన్ని నిర్మించింది.బ్రిడ్జి నిర్మాణానికి 500 టన్నుల కన్ స్ట్రక్షన్ మెటీరియల్ వాడారు. జమ్మూకాశ్మీర్‌లో 1947–48, 1962,1971, 1999ల్లో యుద్ధాలు చేసిన మాజీ సైనికులు దీన్ని ప్రారంభించారు. సైనికులు, స్థానికుల మధ్య స్నేహ బంధాన్ని గుర్తు చేస్తూ ఈ వంతెనకు ‘మైత్రి’అని పేరు పెట్టారు. లేహ్, లడక్ ప్రాంతంలో రాక-పోకలకు ‘మైత్రి’ ఎంతో ఉపయోగపడనుంది. ఈ ప్రాంతంలోని పెద్ద గ్రామాలైన చోగ్లం సార్, స్టోక్,చుచోట్ ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. సైన్యం పనితీరుకు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇబ్బందికర వాతావరణంలో ఎన్నో వ్యయప్రయాసలను తట్టుకొని బ్రిడ్జి నిర్మించడం నిజంగా ఆశ్చర్యమంటూ నెటిజన్లు పొగడుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో రోడ్లను విస్తరించేందుకు శ్రీకారంచుట్టిన కేంద్రం తద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మైత్రి బ్రిడ్జిని నిర్మించారు. సియాచిన్ గ్లేసియర్‌కు వాహనాల రాకపోకలు పెంచేందుకు లడక్‌లో 35 మీటర్ల బ్రిడ్జిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 2018 జూన్ లో ప్రారంభించింది. మనాలీ నుంచి కార్గిల్ లోని జంక్సర్ మీదుగా లడక్ వెళ్లేందుకు అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే రోడ్డును గతేడాది నిర్మించారు.ఆసియాలో అతి పొడవైన జోజిలా సొరంగం నిర్మాణంలో ఉంది.