
ఇండియన్ ఆర్మీ నిర్ణయం.. వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలు
ఆయుధాలను చూపించిన 40 ప్రైవేటు కంపెనీలు
బోర్డర్లో అసలే పరిస్థితులు బాగా లేవు. ఈ మధ్యే పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న టెర్రర్ గ్రూపులు కొన్ని డ్రోన్లను ఇండియా మీదకు పంపించాయి. ఆయుధాలనూ పంపాయి. టైంకు గుర్తించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే..! అందుకే ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ముందే పసిగట్టి కూల్చేసేందుకు మన ఆర్మీ టెక్నాలజీని వాడుకోవాలనుకుంటోంది. డ్రోన్లతో గస్తీ చేయాలని భావిస్తోంది. శత్రు దేశాల డ్రోన్లకు డ్రోన్లతోనే జవాబు చెప్పాలని నిర్ణయించింది. అందులో భాగంగా గత మంగళవారం ఆర్మీ డిజైన్ బ్యూరో (ఏడీబీ) ఓ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని మాణిక్ షా సెంటర్లో ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో దేశీ సహా దాదాపు 40 కంపెనీలు తమ డ్రోన్ టెక్నాలజీలను చూపించాయి.
ప్రస్తుతం ఆర్మీకి ఆయుధాలు అందించడంలో ఏడీబీనే కీలకంగా వ్యవహరిస్తోంది. ‘‘అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాలు కొనేందుకు ఆర్మీ కమాండర్లకు ప్రత్యేక ఆర్థిక అధికారాలున్నాయి. అందుకే వాళ్ల సలహాలు తీసుకునేందుకే ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాం” అని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆర్మీ దృష్టంతా సరిహద్దు గస్తీపైనే ఉంది. దాంతో పాటు నిఘా పరికరాలు, శత్రువుల కమ్యూనికేషన్‌ను కనిపెట్టి అడ్డుకునే హైటెక్ రేడియో సెట్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో శత్రు దేశాలు పంపిస్తున్న డ్రోన్లను టార్గెట్ చేసేందుకు, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఆర్మీ చూస్తోంది. ప్రస్తుతం మన దేశంలోకి చొచ్చుకొస్తున్న డ్రోన్లను కూల్చడానికి గన్నులు లేదా విమానాలను ఆర్మీ వాడుతోంది. వాటికి బదులు డ్రోన్లను డ్రోన్లతోనే కూల్చాలని భావిస్తోంది. ఆ డ్రోన్లే మిసైళ్లుగా శత్రు డ్రోన్లను ఢీకొట్టి పేల్చేసే దిశగా అడుగులు వేస్తోంది. వాటన్నింటినీ మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే తయారు చేయించనుంది.