
- కాల్పుల విరమణకు పాకిస్థాన్ తూట్లు
- ఇద్దరు సైనికులు.. ఓ సామాన్యుడి మరణం
- ప్రజల ఇళ్లపైనా పాక్ సైనికుల షెల్ దాడులు
- ఉగ్రవాదుల చొరబాట్లకు సాయంగా పాక్ కుట్రలు
- పీవోకేలోని ముష్కర క్యాంపులపై అటాక్ కు దిగిన భారత సైన్యం
మోడీజీ… పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పండి అంటూ అభ్యర్థిస్తున్నారు సరిహద్దులోని గ్రామాల ప్రజలు. జమ్ము కశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతంలో ఇవాళ ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ఇప్పటికే తాము చాలా కష్టనష్టాలు అనుభవించామని, ఇకనైనా దాయాది దేశానికి తగిన శాస్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముష్కర మూకల్ని సరిహద్దు దాటించేందుకు కశ్మీర్ లోని తంధార్, నౌగం, కుప్వారా సెక్టార్ల వెంట పాక్ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు, ఓ సామాన్యుడు మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
అలాగే హీరానగర్ సెక్టార్ నేరుగా ప్రజల ఇళ్లపై షెల్ దాడులకు దిగారు పాక్ రేంజర్లు. ఈ ప్రాంతంలో ఒక ఇల్లు, రైస్ గోడౌన్, రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో పిల్లలెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు స్థానికులు. కానీ ముగ్గురు పెద్దలకు గాయాలయ్యాయని చెప్పారు. అలాగే చిత్రకూట్ గ్రామంలో ఆరు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
స్ట్రాంగ్ రియాక్షన్
ఉగ్రవాదులను సరిహద్దు దాటించి, భారత్ లోకి పంపేందుకు పాక్ ఆర్మీ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ కాల్పులను తిప్పికొట్టే పనిలో భారత సైన్యం ఉంటే ముష్కరులు చొరబడొచ్చని పాక్ పన్నాగం. దీన్ని పసిగట్టిన మన సైన్యం.. పాక్ కు గట్టి బుద్ధి చెప్పేందుకు ఇవాళ ఉదయం స్ట్రాంగ్ కౌంటర్ కు దిగింది. నేరుగా పీవోకేలో ఉన్న ఉగ్ర క్యాంపులపైనే ఆర్టిలరీ గన్స్ తో అటాక్ మొదలుపెట్టింది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లను ధ్వంసం చేసింది.