
Diwali Car Sales: జీఎస్టీ స్లాబ్ మార్పులతో పండగ సీజన్లో ఆటో విక్రయాలపై ప్రభావం పడొచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఆటోమొబైల్ రంగం పండుగ సీజన్ కోసం ఎదురుచూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో పెద్ద మార్పులు చేయాలని పరిశీలిస్తోంది. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయా? ఎప్పుడు వస్తాయి? అనే అనిశ్చితి వినియోగదారుల్లో ఉంది. ముఖ్యంగా స్మాల్ కార్లు, ఎంట్రీ లెవెల్ టూ-వీలర్లు కొనాలనుకుంటున్న చాలా మంది జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనం కోసం తమ షాపింగ్ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవచ్చని, ఇది అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాలైన.. కార్లు, బైకులు, ఆటోలు, ట్రక్కులు అన్నీ 28% జీఎస్టీ స్లాబ్లో పన్ను రేట్లకు గురవుతున్నాయి. వీటికి అదనంగా 0% నుంచి 22% వరకు కంపెన్సేషన్ సెస్ వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు కేవలం 5%, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలకు 12% జీఎస్టీ విధిస్తున్నారు. ఇలాంటి సమయంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు ఒక శుభవార్తగా కొనుగోలుదారులు చూస్తున్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు దీపావళి నాటికి నిజంగానే జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రకటిస్తే అది కొత్త వాహనాల రేట్లను తగ్గిస్తుంది. దీని ద్వారా కొంత తక్కువ రేట్లను పొందొచ్చని మధ్యతరగతి భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.
ఇక ప్రభుత్వ ప్రతిపాదిత పన్ను మార్పుల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 12% అలాగే 28% జీఎస్టీ స్లాబ్లు రద్దు చేయబడతాయి. వాటి స్థానంలో కేవలం 5%, 18% స్లాబ్లు మాత్రమే కొనసాగుతాయి. అంటే సాధారణ వాహనాలు 28% కంటే తక్కువగా.. 18% జీఎస్టీ కిందికి వస్తాయి. లగ్జరీ కార్ల కోసం కొత్తగా 40% స్లాబ్ విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ దానిని మధ్యతరగతి పెద్దగా ఫోకస్ చేయటం లేదు.
జీఎస్టీ మార్పులతో పన్ను తగ్గితే వాహనం ఎక్స్-షోరూమ్ ధరలు, ఆన్ రోడ్ ధరలు కూడా నేరుగా తగ్గుతాయి. ఉదాహరణకు.. ఒక ఎంట్రీ-లెవెల్ కార్ ధర రూ.36వేల వరకు, ఒక కమ్యూటర్ మోటార్ సైకిల్ ధర రూ.6వేల 200 వరకు తగ్గవచ్చని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యతరగతి వేతన జీవులకు ఈ మెుత్తం నిజంగా చాలా ఎక్కువ డబ్బే. అయితే తగ్గింపు ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ లేనందుకు ప్రస్తుతానికి వేచి చూడటం ఒక్కటే మార్గం. ఇదే పండగ సీజన్కి చిన్న ‘హెడ్విండ్’గా మారినప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం వాహనాలు తగ్గిన రేట్లకు అందుబాటులోకి రావడం.. దీర్ఘకాలంలో అమ్మకాలను పెంచి మొత్తం పరిశ్రమకు లాభాన్ని చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.