- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–సెప్టెంబర్‌లో 14 శాతం వృద్ధి
- పెరిగిన కార్లు, టూవీలర్ల ఎక్స్‌పోర్ట్స్
- ఆఫ్రికన్ దేశాల కరెన్సీ విలువ పడడంతో నెమ్మదించిన ఎగుమతులు: సియామ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో 25,28,248 బండ్లు ఇండియా నుంచి ఎగుమతి అయ్యాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌లో ఎగుమతైన 22,11,457 బండ్లతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) రిపోర్ట్ ప్రకారం, 2024–25లోని ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య కార్లు, టూవీలర్ల ఎగుమతులు ఎక్కువగా పెరిగాయి.
చాలా ఆఫ్రికన్ దేశాల కరెన్సీ విలువ డాలర్‌తో పోలిస్తే పడుతోందని, దీంతో అత్యవసర ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకోవడానికి ఈ దేశాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర అన్నారు. బండ్లు వంటి అత్యవసరం కాని ప్రొడక్ట్‌లను దిగుమతు చేసుకోవడం తగ్గించాయని చెప్పారు. వివిధ దేశాల కరెన్సీ విలువ పడిపోవడంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి బండ్ల ఎగుమతులు 5.5 శాతం పడ్డాయి. 2022–23 లో 47,61,299 బండ్లు ఎగుమతి కాగా, కిందటి ఆర్థిక సంవత్సరంలో 45,00,492 బండ్లు ఎగుమతి అయ్యాయి.
కార్ల ఎగుమతుల్లో మారుతి టాప్
ఈ ఏడాది ఏప్రిల్– సెప్టెంబర్‌లో జరిగిన బండ్ల ఎగుమతుల్లో టూవీలర్లు, ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు, బస్సులు వంటివి) వాటా ఎక్కువగా ఉంది. కిందటేడాది ఇదే టైమ్‌లో 3,36,754 ప్యాసింజర్ బండ్లు ఎగుమతి కాగా, ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో 3,76,679 బండ్లు ఎగుమతి అయ్యాయి. ఇది 12 శాతం గ్రోత్‌కు సమానం. కార్ల ఎగుమతుల్లో మారుతి సుజుకీ టాప్‌లో కొనసాగుతోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో 1,47,063 కార్లను ఎగుమతి చేసింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌లో చేసిన ఎక్స్‌పోర్ట్స్ 1,31,546 బండ్లతో పోలిస్తే 12 శాతం గ్రోత్ నమోదు చేసింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎగుమతులు 86,105 కార్ల నుంచి ఒక శాతం తగ్గి 84,900 కార్లుగా నమోదయ్యాయి. మరోవైపు టూవీలర్ల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్– సెప్టెంబర్‌లో 19,59,145 బండ్లకు ఎగిశాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఎగుమతైన 16,85,907 బండ్లతో పోలిస్తే ఇవి 16 శాతం ఎక్కువ. ముఖ్యంగా స్కూటర్ల ఎగుమతులు 19 శాతం పెరిగి 3,14,533 బండ్లకు, మోటార్‌సైకిల్ (బైక్‌ల) ఎగుమతులు 16 శాతం పెరిగి 16,41,804 బండ్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికల్స్ ఎగుమతులు 12 శాతం వృద్ధి చెంది 35,731 బండ్లకు పెరిగాయి. త్రీవీలర్ ఎగుమతులు మాత్రం ఒక శాతం తగ్గి 1,55,154 బండ్ల నుంచి 1,53,199 బండ్లకు పడ్డాయి.