
- ఎల్‌సీఆర్, ఎస్‌ఎల్‌ఆర్ వంటి రూల్స్‌తో లిక్విడిటీ ఒత్తిళ్లు లేవు
- ఇండియన్ బ్యాంకుల ఇన్వెస్ట్‌మెంట్లకు రిస్క్ తక్కువ
బిజినెస్ డెస్క్, వెలుగు: గత 20 రోజుల్లోనే మూడు యూఎస్ బ్యాంకులు, ఒక యూరప్ బ్యాంక్ దివాలా బాట పట్టాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో బ్యాంకులకు కష్టాలు మొదలయ్యాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇండియాలో కూడా ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచుతోంది. మరి దేశంలోని బ్యాంకులు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయనే అనుమానాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. యూఎస్ బ్యాంకులతో పోలిస్తే ఇండియన్ బ్యాంకులు మంచి పొజిషన్‌లో ఉన్నాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. యూఎస్‌తో పోలిస్తే ఇండియాలో బాండ్ ఈల్డ్‌లు తక్కువగా పెరిగాయని వివరించింది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం వలన అక్కడి బాండ్ ఈల్డ్‌లు షార్ట్ టెర్మ్‌లోనే 5 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లు పెరగక ముందు లాంగ్ టెర్మ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన బ్యాంకులు నష్టపోయాయి. డిపాజిట్లను దృష్టిలో పెట్టుకొని సరిపడ లిక్విడిటీని మెయింటైన్ చేయడంలో యూఎస్ బ్యాంకులు ఫెయిలయ్యాయి.
ఆర్‌బీఐ తీసుకొచ్చిన లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సీఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్– బ్యాంకులు డిపాజిట్ల కోసం మినిమమ్ క్యాష్‌ను మెయింటైన్ చేయడం) బ్యాంకులను లిక్విడిటీ సమస్యల నుంచి కాపాడుతున్నాయి. అంటే దేశంలోని బ్యాంకులు తమ దగ్గర డిపాజిట్లకు తగ్గట్టు లిక్విడిటీని కచ్చితంగా మెయింటైన్ చేయాలి. అదే యూఎస్ బ్యాంకులయితే తమ దగ్గరకొచ్చిన డిపాజిట్లలో మెజార్టీ వాటాను ఇన్వెస్ట్ చేస్తున్నాయి. తాజాగా దివాలా తీసిన బ్యాంకులు తమ డిపాజిట్లను పెద్ద మొత్తంలో బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఇవి మార్క్ టూ మార్కెట్ ( బాండ్ ఈల్డ్ రేటు బట్టి వాల్యూ మారడం) బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ డబ్బుల కోసం క్యూ కట్టడంతో ఫండ్స్ లేక, తమ ఇన్వెస్ట్‌మెంట్లను లాస్‌లో అమ్ముతున్నాయి. ఇండియన్ బ్యాంకులు ఎక్కువగా మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్ వెల్లడించింది. అంటే దేశంలోని బ్యాంకులు బాండ్లలో ఇన్వెస్ట్ చేశాక, మెచ్యూరిటీ అయ్యేంత వరకు హోల్డ్ చేస్తున్నాయి. ‘ఇండియన్ బ్యాంకులు మార్క్ టూ మార్కెట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, ఇంకా బుక్ చేయని నష్టాలకు కచ్చితంగా ప్రొవిజినింగ్ చేయాలి. అది కూడా రియల్ టైమ్ బేసిస్‌లో చేస్తుండాలి. ఫలితంగా బాండ్లను అమ్మేటప్పుడు వచ్చిన నష్టాలను తట్టుకోవడానికి వీటికి వీలుంటోంది’ అని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ చీఫ్ ఎకనామిస్ట్ సుజన్ హజ్రా అన్నారు.
సరిపడినంత క్యాపిటల్..
యూఎస్ బ్యాంకులతో పోలిస్తే ఇండియన్ బ్యాంకులలో ఎక్కువగా రిటైల్ డిపాజిట్లు (సేవింగ్స్ అకౌంట్లు, టెర్మ్ డిపాజిట్లు) ఉంటాయి. హోల్‌సేల్, కార్పొరేట్ డిపాజిట్లు తక్కువ. తాజాగా మూడు యూఎస్ బ్యాంకులు దివాలా తీయడానికి ప్రధాన కారణం హోల్‌సేల్, కార్పొరేట్ డిపాజిట్లు ఒక్కసారిగా విత్‌డ్రా అవ్వడమే. ఎన్‌పీఏల వలన దేశంలోని బ్యాంకులు దివాలా అంచుల వరకు వెళ్లినా, సరిపడినంత లిక్విడిటీ అందుబాటులో ఉండడం వలన సంక్షోభం నుంచి ఇవి బయటపడగలిగాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. మరోవైపు ఫెడ్‌తో పోలిస్తే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తక్కువగా పెంచిందని, దీంతో ఫైనాన్షియల్ సెక్టార్‌లో లిక్విడిటీ సంక్షోభం ఇంకా తలెత్తలేదని చెబుతున్నారు.
మన బ్యాంకులూ జాగ్రత్తగా ఉండాలి..
వడ్డీ రేట్లు పెరగడంతో దేశంలోని బ్యాంకులపై ఎటువంటి ఒత్తిడి లేదని చెప్పలేం. అప్పులపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో క్రెడిట్ గ్రోత్ స్లో అవుతోంది. డిపాజిట్ల రేట్లు కూడా ఎక్కువవుతుండడంతో బ్యాంకుల లాభాలు తగ్గనున్నాయి. ఇన్‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉండడంతో వినియోగం పడిపోతోంది. ఈ ఎఫెక్ట్ బ్యాంకు షేర్లలో కనిపిస్తోందని మార్కెట్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. అదానీ ఇష్యూ, యూఎస్ బ్యాంకింగ్ సంక్షోభం వలన నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఈ నెలలో ఇప్పటి వరకు 3.3 శాతం నష్టపోయింది.
యూఎస్ బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావం ఇండియన్ బ్యాంకులపై పెద్దగా ఉండదు. ఆర్‌బీఐ తీసుకొచ్చిన లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సీఆర్) బ్యాంకింగ్ వ్యవస్థలోని లిక్విడిటీ ఒత్తిళ్లను తగ్గిస్తోంది. ఎల్‌సీఆర్ ఎక్కువగా ఉండడం, సీడీఆర్ (అప్పులు, డిపాజిట్ల రేషియో) తక్కువగా ఉండడంతో ప్రభుత్వ బ్యాంకులపై లిక్విడిటీ రిస్క్ తక్కువ. ఇండి యన్ బ్యాంకుల లోన్ టూ అసెట్స్ రేషియో 36% ఉంటే, తాజాగా దివాలా తీసిన ఎస్‌వీబీలో 65 శాతంగా ఉంది. అదనంగా ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువగా ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. - అజిత్ కాబి, ఎల్‌కేపీ సెక్యూరిటీస్ బ్యాంకింగ్ ఎనలిస్ట్