
పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో చిన్న పిల్లల మరణాలకు భారత్ లో తయారైన దగ్గు మందులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలుషితమైన మేడిన్ ఇండియా దగ్గు సిరప్ లు తాగి దాదాపు 70 మంది చిన్నారులు చనిపోయారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC ), గాంబియా ఆరోగ్య అధికారులు సంయుక్తంగా జరిపిన దర్యాప్తులో తేలింది.
ఇండియాకు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్.. గాంబియాకు నాలుగు దగ్గు సిరప్లు సరఫరా చేస్తోంది. డైథిలిన్ గ్లైకాల్‌తో కూడిన ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్‌మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు ఔషధాలను పంపిస్తోంది. అయితే వీటిపై గతేడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ కు చెందిన నాలుగు ఔషధాలపై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గాంబియాలోకి దిగుమతి చేసుకున్న డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ వంటి కలుషితమైన మందులు పిల్లల్లో తీవ్రమైన మూత్రపిండాల ఇంజూరీ (AKI) క్లస్టర్ కు దారితీశాయి. వీటిలోని విషం ఉన్న పిల్లలు మానసిక స్థితి, తలనొప్పి, జీర్ణశయాంతర లక్షణాలలు ఎదురయ్యాయి. ఈ సిరప్ లను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడంతో మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపించాయి. తర్వాత దశలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమై పక్షవాతానికి దారితీశాయి. నాలుగు దగ్గు సిరప్‌లలో రెండు రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉండటంతో గాంబియాలో 70 మంది చిన్నారుల మరణానికి కారణమైందని నివేదిక పేర్కొంది.