బిషన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ బేడీ కన్నుమూత

బిషన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ బేడీ కన్నుమూత

న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ బిషన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ బేడీ (77) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా, లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన బేడీకి భార్య అంజు, కుమారుడు అంగద్‌‌‌‌‌‌‌‌, కూతురు నేహా ఉన్నారు. ‘ఇటీవల బేడీ మోకాలికి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ శరీరానికి పాకింది. ఆ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ నుంచి కోలుకోలేకపోయాడు’ అని బేడీ స్నేహితుడు ఒకరు వెల్లడించారు.

1946లో అమృత్‌‌‌‌‌‌‌‌సర్‌‌‌‌‌‌‌‌లో పుట్టిన బేడీ దశాబ్ద కాలంపాటు తన స్పిన్‌‌‌‌‌‌‌‌ మాయాజాలంతో ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌ను ఏలాడు. ‘సర్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌’గా పేరుగాంచిన బేడీ..  67 టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో 266 వికెట్లు తీశాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌, ఒకసారి 10 వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌ ఉండటం విశేషం. 10 వన్డేల్లో 7 వికెట్లు పడగొట్టాడు. 1975–79 వరకు ఇండియా టెస్ట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను నడిపించిన బేడీ.. 22 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు నాయకత్వం వహించాడు.

1966 నుంచి 1978 వరకు ఎర్రాపల్లి ప్రసన్న, చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌, వెంకట్‌‌‌‌‌‌‌‌రాఘవన్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను అత్యుత్తమ శిఖరాలకు తీసుకెళ్లారు. క్రికెట్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పిన తర్వాత 1990లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్​ టూర్‌‌‌‌‌‌‌‌లకు మేనేజర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు. 1974 నుంచి 1982 వరకు ఢిల్లీ రంజీ ట్రోఫీ టీమ్‌‌‌‌‌‌‌‌కు సుదీర్ఘ కాలంగా కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా సేవలందించారు. మంగళవారం జరిగిన బేడీ అంత్యక్రియలకు కపిల్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌, సెహ్వాగ్‌‌‌‌‌‌‌‌, మదన్‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌, కీర్తి ఆజాద్‌‌‌‌‌‌‌‌, నెహ్రా, అజయ్‌‌‌‌‌‌‌‌ జడేజా హాజరయ్యారు. బేడీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రికెటర్లు తమ సంతాపాన్ని ప్రకటించారు.