వరల్డ్​ ఎకనామిక్ ​ఫోరం సదస్సులో..సమోసా ఘుమఘుమలు

వరల్డ్​ ఎకనామిక్ ​ఫోరం సదస్సులో..సమోసా ఘుమఘుమలు

సెంట్రల్​ డెస్క్:​ స్విట్జర్లాండ్​ లోని దావోస్​ నగరం వేదికగా ప్రారంభమైన వరల్డ్​ ఎకనామిక్ ​ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ఇండియా వంటకాలు ఘుమఘుమలాడాయి. జనవరి 16న (సోమవారం) సదస్సు ప్రారంభమయ్యాక  వివిధ దేశాల నుంచి వచ్చిన అతిథులకు అందించిన ఇండియా వంటకాల జాబితాలో బిర్యానీ, టిక్కా, కచోరీస్ తో పాటు మనందరికీ ఎంతో ఇష్టమైన సమోసా కూడా ఉంది. విదేశాల ప్రతినిధులు కూడా ఎంతో ఇష్టంగా సమోసాను తిని..  టీ, కాఫీలు తాగారు. వీటి తయారీ కోసం స్పెషలిస్ట్​ చెఫ్ లను కొన్ని రోజుల ముందే ఇండియా నుంచి  స్విట్జర్లాండ్​ కు తీసుకెళ్లారట.  చెఫ్​లు వెళ్తూవెళ్తూ బిర్యానీ, టిక్కా, కచోరీస్, సమోసా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను తమతో తీసుకెళ్లారని అంటున్నారు. దీంతో జనవరి 21 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఇండియా మెనూ స్పెషల్​గా మారింది. ఇండియా మెనూలో అన్నింటి కంటే ప్రత్యేకం సమోసా.  స్ట్రీట్​ ఫుడ్ నుంచి ఇంటర్నేషనల్​ ఈవెంట్లో స్నాక్​ దాకా అన్నిచోట్లా తన రుచితో ఫుడ్​ లవర్స్​ నోరూరిస్తున్న దాని గురించి కొన్ని విశేషాలు.. 

సమోసా హిస్టరీ..

సమోసా హిస్టరీ విషయంలోకి వెళ్తే.. ఇరాన్​కు చెందిన చరిత్రకారుడు అబుల్ ఫజల్​ బేయాగీ 15వ శతాబ్దంలో రాసిన ఒక పుస్తకంలో  తొలిసారి దాని గురించి ప్రస్తావించారు. వెయ్యేండ్ల క్రితమే మిడిల్​ ఈస్ట్​ దేశాల ప్రజలు సమోసాను తయారు చేసుకొని తినేవారని ఆయన పేర్కొన్నారు. మిడిల్​ ఈస్ట్​లో సమోసాను ‘సంబోసా’ లేదా ‘సంబూస్క్’ అని పిలుస్తారని అబుల్ ఫజల్​ బుక్​లో ఉంది. సమోసా భారతదేశంలోకి 14వ శతాబ్దంలోకి ప్రవేశించిందని ఆయన చెప్పారు. మిడిల్​ ఈస్ట్​ నుంచి దక్షిణాసియాకు వ్యాపార అవసరాల నిమిత్తం వచ్చినవారు ఇక్కడి ప్రజలకు సమోసాను పరిచయం చేశారని తెలిపారు. 13వ శతాబ్దం నాటి ప్రముఖ ఇండో పర్షియన్​ సూఫీ గాయకుడు అమీర్ ఖుస్రోకు ఇష్టమైన వంటకాల జాబితాలో సమోసా చేరిందని  అబుల్ ఫజల్​ బేయాగీ 
పుస్తకంలో ప్రస్తావన ఉంది. 

ఒక్కో పేరు.. ఒక్కో టేస్టు

ప్రపంచంలో తొలిసారిగా చేసిన సమోసాలను.. మాంసం, ఉల్లిపాయలు, మసాలాలు కలిపి చేసి ఉంటారని చెబుతారు. సమోసాను మిడిల్​ ఈస్ట్​దేశాల్లో సంబూస్క్​, నేపాల్​ లో సింగాడా, ఆఫ్రికాలో సంబూసా, పోర్చుగల్​ లో చమూక్స్​ అనే పేర్లతో పిలుస్తారు.  ఇక ఇండియాలోనూ ఒక్కోచోట ఒక్కో రకమైన సమోసాలు ఫేమస్​. బెంగాల్​లో ఆలు, పల్లి గింజలు నింపిన సమోసాలు తయారుచేస్తారు. బెంగాలీలు సమోసాలను సింగాడా అని పిలుస్తారు. మన హైదరాబాదీ ఆలూ సమోసా టేస్ట్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరప్రదేశ్​, ఢిల్లీలోనూ ఆలూ సమోసా చాలా ఫేవరేట్​స్నాక్​.