టెహ్రాన్: ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులందరినీ టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వెంటనే ఇరాన్ విడిచి వెళ్లిపోవాలంటూ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్‌లో నివసిస్తున్న ఇండియన్ స్టూడెంట్లు, టూరిస్టులు, వ్యాపారవేత్తలు ఉన్నఫళంగా ఇరాన్‌ను విడిచిపెట్టాలని ఎంబసీ అధికారులు సూచించారు.
‘‘ఇండియన్ సిటిజన్స్ అందరూ తమ పాస్‌పోర్ట్‌లు, వీసాలు, ఇతర ముఖ్యమైన గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా బయలుదేరడానికి రెడీగా ఉండాలి. ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండండి. అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా సాధ్యమైనంత త్వరగా ఇరాన్ నుంచి బయటపడండి. ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్న ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దు. ఏమైనా ఇబ్బందులు వస్తే టెహ్రాన్‌లోని ఎంబసీతో కాంటాక్ట్ అవ్వండి.
ఇంటర్నెట్ పని చేయకపోతే, కుటుంబ సభ్యుల ద్వారా అయినా సమాచారం ఇవ్వండి. ఎమర్జెన్సీ హెల్ప్ కోసం ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించండి’’ అని అధికారులు సూచించారు. ఇరాన్‌లో ఉండి, ఇప్పటివరకు ఎంబసీ వద్ద రిజిస్టర్ చేసుకోని వారు వెంటనే తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్నెట్ సమస్య ఉంటే, ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు వారి తరఫున రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వంనుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారతీయులెవరూ ఇరాన్‌కు ప్రయాణించొద్దని హెచ్చరించింది.
